రాష్ట్రంలో పనిచేస్తున్న వీ ఆర్ ఏ (విలేజ్ రెవిన్యూ అసిస్టెంట్) లను, వారి వారి విద్యార్హతలను, సామర్థ్యాలను అనుసరించి ఇరిగేషన్ సహా ఇతర శాఖల్లో సర్దుబాటు చేసి వారి సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వీఆర్ఏలతో సమావేశమై, చర్చించి వారి అభిప్రాయాలను సేకరించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సిఎం అన్నారు. ఇందుకు గాను, మంత్రి కె.టి.రామారావు ఆధ్వర్యంలో మంత్రులు జి.జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ లతో కూడిన మంత్రివర్గ ఉపసంఘాన్ని సిఎం కేసీఆర్ ఏర్పాటు చేశారు.
సిఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రివర్గ ఉపసంఘం వీఆర్ఏలతో బుధవారం నుంచి చర్చలు ప్రారంభించనున్నది. చర్చల అనంతరం ఉపసంఘం సూచనల ప్రకారం నిర్ణయాలు తీసుకోని వీఆర్ఎల సేవలను వినియోగించుకునే దిశగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సిఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఉపసంఘం కసరత్తు పూర్తయి తుది నివేదిక సిద్దమైన తర్వాత మరోమారు చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని సిఎం కేసీఆర్ తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియ వారంలోపు పూర్తి కావాలని సిఎం ఆదేశించారు.