AP Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల విధుల నుంచి ఉపాధ్యాయులను తప్పించిన సంగతి తెలిసిందే. ఇకపై ఎన్నికల విధులను కూడా గ్రామ, సచివాలయ ఉద్యోగులకు అప్పగించాలని భావిస్తున్నట్లు అప్పటి నుండే ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వం ఊహించినట్లే ఇకపై ఎన్నికల విధుల సహా బోధనేతర పనులన్నీ సచివాలయ సిబ్బందికే అప్పగించారు. ఇప్పటికే సచివాలయాల్లో బిఎల్వో(బూత్ లెవల్ ఆఫీసర్) విధులను అప్పగించి ఓట్ల నమోదు, మృతిచెందిన వారి ఓట్ల తొలగింపు తదితర అంశాల పనులకు వినియోగిస్తోంది. ఈ ప్రక్రియలో బిఎల్వోలంతా ఇప్పుడు సచివాలయపరిధిలోని అన్ని ఇళ్లను గుర్తిస్తున్నారు. ఈ విధంగా పనిచేయించడం ద్వారా వచ్చే 2023లో జనాభా గణన కూడా వీరితోనే చేయించడానికి అవకాశం వుంటుంది.
వీరికి గ్రామ, వార్డు వాలంటీర్లు తోడు ఉండటంతో ప్రభుత్వం పని చాలా సులువు కావడానికి ఆస్కారం వుంటుందని ప్రభుత్వం చెప్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 14 వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు లక్షా 27వేల మందికి పైగా సచివాలయ ఉద్యోగులు ఉండగా.. వీరికి ఎన్నికల విధులను అప్పగించడం ద్వారా ఈవీఎంలు, వాటి నిర్వహణపై ఉపాధ్యాయుల కంటే వేగంగా వీరికి శిక్షణ ఇవ్వడానికి బాగుంటుందని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రజలతో అన్ని పనులకు దగ్గరగా ఉండటం ఎన్నికల విధులను వీరికి అప్పగించడం పని సులవవుతుందని చెప్తున్నారు.
ఎన్నికల విధులను సచివాలయ సిబ్బందికి అప్పగించడంపై తాజాగా స్పందించిన మంత్రి చెల్లుబోయిన ఈ అంశాన్ని బూతద్దంలో పెట్టి చూడొద్దని కోరారు. అయితే.. ఇప్పటి వరకు ఎన్నికల విధులు నిర్వహించిన వారంతా.. టీచర్లు, రెవెన్యూ ఉద్యోగులు. వీళ్ళుఏపీపీఎస్సీ, గ్రూప్స్ వంటి ప్రవేశ పరీక్షలతో పాటు ఉద్యోగులుగా శిక్షణ తీసుకొని మళ్ళీ ఎన్నికల శిక్షణ కూడా తీసుకొని ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వహించారు. అయితే, గ్రామ, సచివాలయ సిబ్బందిలో పీజీ చదివిన వారు కూడా ఉన్నా.. వాళ్లంతా నామమాత్రపు ఎంట్రన్స్ పరీక్ష రాసి.. ఎలాంటి ఇంటర్వ్యూలు లేకుండా.. ఏడాది కోసం కాంట్రాక్ట్ పద్ధతిలో వచ్చేశారు.
ఇక, ఇప్పటికే వైసీపీ పార్టీలోని విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు సచివాలయ ఉద్యోగులలో 90 శాతం మంది మన పార్టీ వాళ్ళేనని చెప్పుకొచ్చాడు. మరి అలాంటి వాళ్ళకి, వాలంటీర్లను తోడుచేసి మరీ ఎన్నికల విధులను అప్పగిస్తే పరిస్థితి ఏంటనేది ప్రభుత్వానికి తెలియని అంశం కాదు. పైగా ఎన్నికల విధులు ఎవరికి అప్పగించాలి.. ఎన్నికలలో ఏ ప్రభుత్వ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలన్నది ఎన్నికల కమిషన్ ఇష్టం. ఎన్నికల సమయంలో ఈసీ చెప్పింది ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ప్రభుత్వానికి తెలియనిదేమి కాదు.. మరి ఎన్నికల విధులు సచివాలయ సిబ్బందికేనని ప్రభుత్వం ఎలా నోటిఫికేషన్ తెస్తుందన్నదే అర్ధం కాని అంశం.