Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Rahul Gandhi: చట్టం చట్రంలో రాహుల్‌

Rahul Gandhi: చట్టం చట్రంలో రాహుల్‌

రాహుల్ గాంధీ స్థాయికి ఇలాంటి వ్యాఖ్యలు సరిపోతాాయా?

కాంగ్రెస్‌ నాయకుడు రాహల్‌ గాంధీకి పరువు నష్టం కేసులో పడిన శిక్షపై స్టే ఇవ్వడానికి గుజరాత్‌ హైకోర్టు స్టే ఇవ్వకపోవడంపై మళ్లీ చర్చ ప్రారంభమైంది. సహజంగానే కాంగ్రెస్‌ నాయకులు, ఆయనను సమర్థించే హైకోర్టు నిర్ణయాన్ని నిర్హేతుకమైనదిగా అభివర్ణిస్తుండగా, ఆయన వ్యతిరేకులు దీన్ని గట్టిగా సమర్థిస్తున్నారు. స్టే ఇవ్వకపోవడంలో ఏమాత్రం హేతుబద్ధత లేదని, ఇది విచిత్రంగా ఉందని కొన్ని పత్రికలు సైతం వ్యాఖ్యానిస్తున్నాయి. 2019లో ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్‌ గాంధీ “దోపిడీదార్లందరికీ మోదీ అనే ఇంటి పేరే ఉంటోందేమిటి అని వ్యాఖ్యానించడం జరిగింది. దీనిపై మోదీ అనే ఇంటి పేరు కలిగిన ఒక వ్యక్తి సూరత్‌ కోర్టులో రాహుల్‌ గాంధీపై పరువు నష్టం కేసు దాఖలు చేయడం జరిగింది. రాహుల్‌ గాంధీకి ఆ కోర్టు రెండేళ్ల శిక్ష విధించడంతో పాటు, లోక్‌ సభ సభ్యత్వానికి అనర్హుడిగా కూడా ప్రకటించింది. ఈ కేసు ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లింది. ఈ శిక్షలపై స్టే ఇవ్వాలని పెట్టుకున్న పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. రాహుల్‌ పరువు నష్టం కలిగించా రని భావించిన న్యాయమూర్తుల్లో హైకోర్టు న్యాయమూర్తి ఎం. ప్రచ్ఛక్‌ మూడవ వ్యక్తి.
ఇది చాలా తీవ్రమైన నేరమని ఆయన కూడా అభిప్రాయపడుతున్నారు. రెండేళ్లు జైలు శిక్ష విధించడంతో పాటు లోక్‌ సభ సభ్యత్వానికి అనర్హుడిగా చేయడం కూడా న్యాయమేనని, సమర్థ నీయమేనని ప్రచ్ఛక్‌ తో సహ న్యాయమూర్తులంతా వ్యాఖ్యానించారు. రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు మరీ అంత తీవ్రస్థాయి వ్యాఖ్యలేమీ కావని, వీటికి అంత కఠిన శిక్షలు విధించాల్సిన అవసరమేమీ లేదనే అభిప్రాయంతో వీరెవరూ ఏకీభవిస్తున్నట్టు కనిపించడం లేదు. ఇది నైతిక విరుద్ధమైన వ్యాఖ్యలని ట్రయల్‌ కోర్టు, జిల్లా కోర్టు, ఆ తర్వాత హైకోర్టు న్యాయమూర్తులంతా తప్పుబడుతున్నారు. రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ఆయనకు స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని, ఆయనకు స్టే ఇచ్చే పక్షంలో లోక్‌ సభ సభ్యత్వానికి అనర్హుడిగా చేయడం నుంచి ఆయన బయటపడినట్టు అవుతుందని హైకోర్టు న్యాయమూర్తి అభిప్రాయ పడడం జరిగింది.
ఒక పార్టీ నాయకుడు, పార్లమెంట్‌ సభ్యుడు అయిన వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేసినం దువల్ల ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాల్సి వస్తోందని న్యాయమూర్తి పేర్కొన్నారు. కేవలం ఎన్నికల్లో లబ్ధిపొందడం కోసం ఒక ఇంటి పేరు కలిగినవారందరినీ దోపిడీదార్లుగా అభివర్ణించడం ఒక బాధ్యత కలిగిన ప్రజా ప్రతినిధికి సమంజసంగా లేదని కూడా ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకోవడమో లేక దోపిడీలకు పాల్పడినట్టు ఆరోపణలున్న మోదీ ఇంటి పేరు కలిగిన వ్యక్తులను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటే సమంజసంగా ఉండేదని కూడా న్యాయమూర్తులు భావిస్తున్నారు. ఆ విధంగా కాకుండా మోదీ అనే ఇంటిపేరున్న వారందరినీ ఒకే గాటన కట్టడం వల్ల ఆ ఇంటి పేరు కలిగిన వారికి పరువు నష్టం జరిగిందని కూడా న్యాయమూర్తులు అన్నారు. రాహుల్‌ గాంధీని అనర్హుడిగా చేయడానికే దీన్ని తీవ్ర విషయంగా పరిగణించడం జరుగుతోందని, మోదీ అనే ఇంటి పేరు కలిగినవారందరూ దీనివల్ల పరువు కోల్పోయారనడానికి ఆధారాలేమీ లేవని పలువురు భావిస్తున్నారు.
ఏమాత్రం తీవ్రతరం కాని ఒక వ్యాఖ్యను సాకుగా తీసుకుని ఒక చట్టసభ సభ్యుడిని అనర్హుడిగా చేయడంపై విమర్శలు తలెత్తుతున్నాయి. రాజకీయాల్లో స్వచ్ఛతను, పవిత్రతను కాపాడడానికి, రాహుల్‌ గాంధీపై ఇతరత్రా ఉన్న కేసులను పరిగణనలోకి తీసుకుని ఆయనపై ఇటువంటి చర్య తీసుకోవడం జరిగిందనే వాదనను కూడా విశ్లేషకులు తోసిపుచ్చుతున్నారు. రాహల్‌ గాంధీ మీద వీర్‌ సావర్కర్‌ మనుమడు వేసిన కేసును కూడా న్యాయమూర్తి ఉటంకిం చడాన్ని వారు తప్పుబట్టారు. ఇదేదో భయంకరమైన నేరమయినట్టు కోర్టులు పరిగణించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. రాహుల్‌ గాంధీ స్థాయి వ్యక్తి ఇటువంటి తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేయడాన్ని ఏమాత్రం సహించలేమని మరి కొందరు భావిస్తున్నారు. దేశంలో ఇతర సమస్యల మీద విమర్శలు సాగించడానికి అవకాశం ఉండగా రాహుల్‌ ప్రత్యేకంగా మోదీ ఇంటి పేరున్న వారందరినీ విమర్శించడం ఏమాత్రం సమర్థనీయం కాదని వారు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News