BRS : దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పును తీసుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించి బుధవారం ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) కార్యాలయాన్ని ప్రారంభించి ఆ పార్టీ జెండాను ఎగురవేశారు. సర్దార్ పటేల్ రోడ్డులోని బీఆర్‌ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, జేడీఎస్ అధినేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, తమిళనాడుకు చెందిన విడుతలై చిరుతైగల్ కచ్చి పార్టీ ఎంపీ చిదంబరం, పలు రాష్ట్రాల రైతు సంఘం నాయకులతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం కంటే ముందు అక్కడ రాజశ్యామల, నవ చండీయాగాలు నిర్వహించారు. ఈ యాగాల్లో కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేందుకు
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ఇటీవలే భారత రాష్ట్ర సమితిగా మార్చారు. దీనికి ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ పార్టీ కోసం ఢిల్లీలోని వసంత్ విహార్‌లో సొంత భవనాన్ని నిర్మిస్తున్నారు. మరో ఐదు నెలల్లో ఇది పూర్తి కానుంది. మంగళవారం నిర్మాణంలో ఉన్న బీఆర్ఎస్ నూతన కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ సందర్శించారు.