IND vs BAN 1st Test : చటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ 82 పరుగులతో క్రీజులో ఉన్నాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ ఇస్తామ్ మూడు వికెట్లు పడగొట్టగా, మెహిదీ రెండు, ఖలీద్ అహ్మద్ ఓ వికెట్ తీశారు.
టాస్ గెలిచిన టీమ్ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్(22), శుభ్‌మన్ గిల్(20)లు కుదురుకున్నట్లుగానే కనిపించారు. అయితే.. జట్టు స్కోరు 41 పరుగుల వద్ద అనవసర షాట్ ఆడి శుభ్‌మన్ గిల్ పెవిలియన్‌కు చేరాడు. ఆ తరువాత కాసేపటికే కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో పాటు పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ(1)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు. దీంతో భారత్ 48 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ దశలో క్రీజులోకి వచ్చిన పంత్(46) వన్‌డౌన్ బ్యాటర్ పుజారా (90)తో కలిసి మరో వికెట్ పడకుండా లంచ్‌కు వెళ్లారు. అయితే.. లంచ్ అనంతరం కాసేపటికే పంత్ కూడా పెవిలియన్‌కు చేరాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ మరోవైపు పుజారా గోడలా నిలబడ్డాడు. పుజారా-పంత్ జోడి నాలుగో వికెట్‌కు 64 పరుగులు జోడించారు.
పంత్ తరువాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. పుజరా, శ్రేయస్ లు మంచి బంతులను గౌరవిస్తూ చెత్త బంతులను బౌండరీలకు తరలించారు. ఈ క్రమంలో ఇరువురు అర్థశతకాలను పూర్తి చేశారు. తొలిరోజు మరో వికెట్ పడకుండా వీరిద్దరే ఆట ముగిస్తారేమోనని అనిపించింది. అయితే.. మరో అరగంటలో ఆట ముగుస్తుందనగా శతకానికి 10 పరుగుల దూరంలో పుజారా క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో ఐదో వికెట్‌కు 149 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. శ్రేయస్‌తో జత కలిసిన అక్షర్ పటేల్ (14) మరొక బంతి వేస్తే ఆట ముగుస్తుందనగా మెహదీ హసన్ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ ఆరో వికెట్లు కోల్పోయింది.
ఇక రెండో రోజు శ్రేయస్, అశ్విన్ జోడి ఎన్ని పరుగులు చేస్తారు అన్నదానిపైనే భారత్ భారీ స్కోరు సాధిస్తుందా లేదా అన్నది ఆధారపడి ఉంది.