IND vs BAN Test Match: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభమైంది. బుధవారం చట్‌గామ్ వేదికగా తొలి టెస్టు జరిగింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమ్ ఇండియా ఆరు వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ 82 నాటౌట్‌గా నిలిచాడు.
తొలుత ఓపెనర్లుగా రాహుల్, శుభ్‌మన్ క్రిజ్‌లోకి వచ్చారు. తొలివికెట్‌కు రాహుల్ – గిల్ 41 పరుగులు జోడించారు. గిల్ (20) అవుట్ కాగా, క్రిజ్‌లోకి వచ్చిన కోహ్లీ (1) వెంటనే పెవిలియన్ బాటపట్టాడు. దీంతో భారత్ 21 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్లు నష్టానికి 50 పరుగులు మాత్రమే చేసింది. రిషబ్ పంత్ (46) పరుగులకే అవుట్ అయ్యాడు.
పంత్ అవుట్ కావడంతో శ్రేయస్ అయ్యర్ బరిలోకి దిగాడు. శ్రేయస్, పుజారా బలమైన భాగస్వామ్యంతో బంగ్లా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోగలిగారు. తన డిఫెన్స్‌తో బంగ్లాదేశ్ బౌలర్లను విసిగించాడు. 203 బంతులను ఎదుర్కొన్న పుజారా.. సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ తైజుల్ ఇస్లామ్ బౌలింగ్‌లో (85వ ఓవర్లో) బౌల్డయ్యాడు. అంతకు ముందు ఓవర్లో శ్రేయస్ అయ్యర్ ఔట్ కావాల్సింది.
పేసర్ ఎబాదత్ హోస్సేన్ విసిరిన బంతిని అంచనా వేయడంలో అయ్యర్ విఫలమయ్యాడు. దీంతో ఆఫ్ స్టంప్‌ను తాకుతూ బంతి వెళ్లింది. స్టంప్స్ మీదున్న బెయిల్ లైట్లు వెలిగాయి. కానీ బెయిల్ మాత్రం కింద పడలేదు. దీంతో బంగ్లా ఆటగాళ్లు అలానే చూస్తుండిపోయారు. మరోవైపు పుజారా, అయ్యర్ నవ్వుకోవటం కనిపించింది. అప్పటికే అయ్యర్ వ్యక్తిగత స్కోర్ 78 పరుగులు. ఇది జరిగిన కొద్దిసేపటికే పుజారా (90) అవుట్ అయ్యాడు. క్రిజ్‌లోకి వచ్చిన అక్షర్ పటేల్ (14) అవుట్ కావడంతో.. తోలిరోజు ఆట ముగిసే సమయానికి ఇండియా 278 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. శ్రేయస్ అయ్యర్ 82 పరుగులతో క్రిజ్‌లో ఉన్నాడు.