Saturday, October 5, 2024
HomeతెలంగాణBalka Suman: మిషన్ భగీరథ ద్వారా సురక్షిత మంచినీటి పంపిణీ

Balka Suman: మిషన్ భగీరథ ద్వారా సురక్షిత మంచినీటి పంపిణీ

చెన్నూర్ నియోజకవర్గ వ్యాప్తంగా 283 ట్యాంకుల నిర్మాణం

ప్రతి ఇంటికి శుద్ధమైన త్రాగునీటిని అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి నివాసానికి సురక్షిత మంచినీరు పంపిణీ చేస్తామని ప్రభుత్వ విప్, చెన్నూర్ నియోజకవర్గ శాసనసభ్యులు బాల్క సుమన్ అన్నారు. జిల్లాలోని నస్పూర్ గల సమీకృత జిల్లా శాఖల కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, ట్రైనీ కలెక్టర్ పి.గౌతమి, మిషన్ భగీరథ ఈ.ఎన్.సి. కృపాకర్ రెడ్డితో కలిసి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, చెన్నూర్ నియోజకవర్గ శాసనసభ్యులు మాట్లాడుతూ మిషన్ భగీరథ పథకం ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని 12 వేల 769 గ్రామాలకు సురక్షిత మంచినీటిని అందిస్తున్నామని, ఐక్యరాజ్యసమితితో పాటు పలు విదేశీ సంస్థలు మిషన్ భగీరథ పథకాన్ని ప్రశంసించాయని తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గంలోని 5 మండలాల పరిధిలోని 102 గ్రామపంచాయతీలు, 3 మున్సిపాలిటీల పరిధిలోని 64 వార్డుల వారిగా మిషన్ భగీరథ, గ్రిడ్ పనులను కొనసాగుతున్నాయని, అధికారులు రోడ్ మ్యాప్ నిర్దేశించుకుని ఆగస్టు 15వ తేదీ లోపు పెండింగ్ పనులను పూర్తి చేయాలని తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకు 283 ట్యాంకుల నిర్మాణం పూర్తి చేసి 67 వేల 163 గృహలకు 2 లక్షల 62 వేల మంది ప్రజలకు త్రాగునీరు అందించడం జరుగుతుందని, వానాకాలం దృష్ట్యా ప్రజలకు అసౌకర్యం కలుగకుండా పనులను వేగంగా పూర్తి చేయాలని, ప్రజలకు త్రాగునీరు అందించే విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం, అలసత్వం వద్దని, పనుల నిర్వహణలో పని చేయని గుత్తేదారులను తొలగించి క్రొత్తవారిని నియమించి పనులను వేగవంతం చేయాలని తెలిపారు. పనులు పూర్తయిన గ్రామాల్లో జరుగుతున్న నీటి సరఫరాలో లీకేజీలు, పైపైన్లు దెబ్బతిన్నట్లయితే వెంటనే మరమ్మత్తు చేయాలని, మిషన్ భగీరథ పనుల వల్ల దెబ్బతిన్న రోడ్లను వెంటనే నిర్మించాలని, వార్డు, గ్రామ, మండల, మున్సిపల్ స్థాయిలో ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ త్రాగునీటి సరఫరాలో అవాంతరాలు తలెత్తినట్లయితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేలా కృషి చేయాలని, అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించాలని, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి పనులు మరింత వేగంగా జరిగేలా చూడాలని తెలిపారు. మిషన్ భగీరథ ఇంట్రా పనులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

- Advertisement -

మిషన్ భగీరథ ఈ.ఎన్.సి. మాట్లాడుతూ ప్రజలకు సురక్షిత మంచినీరు అందించడానికి నిర్దేశించిన ప్రణాళికతో నీటి సరఫరా జరుగుతోందని, సురక్షిత మంచినీటిని అందించే విధానాన్ని తమ తమ గ్రామాల వద్ద ఏర్పాటు చేసిన ఫిల్టర్బెడ్ వద్ద ప్రజలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవచ్చని, మిషన్ భగీరథ పనులు పూర్తి చేయడంతో పాటు నిర్వహణ బాధ్యత కూడా తీసుకున్నామని తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నియోజకవర్గాల వారిగా ప్రజల నుండి సమాచారం సేకరించి సమస్య ఉన్న ప్రాంతాలను అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని, గ్రామ స్థాయిలో మంచినీటి సరఫరాకు అధికారులతో పాటు గ్రామపంచాయతీ సిబ్బంది సహకరించాలని తెలిపారు. ఆయా ఏజెన్సీలకు కేటాయించి పనులను పూర్తి చేసిన వెంటనే క్వాలిటీ కంట్రోల్ అధికారులు పరీక్షించిన అనంతరం బిల్లులు చెల్లించడం జరుగుతుందని, ఇప్పటి వరకు ఎలాంటి బిల్లులు బకాయి లేవని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్.అ. జ్ఞాన్ కుమార్, ఈఈ. లు అంజన్రావు, మధుసూదన్, పంచాయతీరాజ్ ఈఈ ప్రకాష్, ఏ.ఈ.లు, డి.ఈ.లు, మున్సిపల్ కమీషనర్లు, మున్సిపల్ చైర్మన్, వైస్ఛైర్మన్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఎం.పి.పి.లు, జెడ్.పి.టి.సి.లు, సర్పంచ్లు. వివిధ ఏజెన్సీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News