Friday, September 20, 2024
Homeహెల్త్Monsoon foot care: వర్షాకాలంలో పాదాల సంరక్షణ

Monsoon foot care: వర్షాకాలంలో పాదాల సంరక్షణ

పాదాలు ఆరోగ్యంగా లేకపోతే చాలా రకాల అనారోగ్యాలు చుట్టుముడతాయి

మాన్సూన్ లో పాదాలు పదిలంగా…
మాన్సూన్ వచ్సేసింది. పాదాల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాల్సిన సమయం ఇది. వర్షాల వల్ల కాళ్లకు బురద, మురికి బాగా అంటుకుంటాయి. వీటిని వదిలించుకోకపోతే, పాదాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే పలు సమస్యలు తలెత్తుతాయి. పాదాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోతే రకరకాల ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం కూడా ఈ సీజన్ లో ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఈ సమయంలో పాదాల విషయంలో తగిన జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి.
 వర్షంలో తడిసి ఇంటికి వచ్చాక వెంటనే పాదాలను గోరువెచ్చటి నీటిలో పెట్టుకోవాలి. ఈ నీళ్లల్లో ఒక కప్పు యాంటిసెప్టిక్ లోషన్ వేయడం మరవొద్దు. పదిహేను నిమిషాలపాటు పాదాలను ఆ నీళ్లల్లో ఉంచాలి. ఆతర్వాత పాదాలను యాంటీబాక్టీరియల్ సబ్బుతో శుభ్రంగా రుద్దుకుని టవల్ తో పొడిగా తుడుచుకోవాలి.
ముఖ్యంగా ఈ సీజన్ లో పాదాల గోళ్లు పెద్దవిగా పెంచుకోకూడదు. గోళ్లను పొట్టిగా కట్ చేసుకోవాలి. లేకపోతే వాటిల్లో మురికి చేరే అవకాశం ఉంది. దీంతో పాదాలు ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంది.
 పాదాలను టవల్ తో పొడిగా తుడుచుకున్న తర్వాత టాల్కమ్ పౌడర్ ని పాదాలపై చల్లుకుని గాలి తగిలేలా పాదాలను స్టూలు లేదా సోఫాపై పెట్టుకోవాలి. సీలింగ్ ఫ్యాన్ కింద కూడా పాదాలు ఆరబెట్టుకోవచ్చు. ఇదంతా చేసుకున్న తర్వాత బయటకు వెళ్లాల్సి వస్తే పాదాలకు సాక్స్ తప్పనిసరిగా వేసుకోవాలి. పాదాలు వాసన వస్తుంటే దానికి కూడా కొన్ని టిప్స్ ఉన్నాయి. టాల్కమ్ పౌడర్ ని పాదాలకు వేసుకునేటప్పుడు కొద్దిగా కర్పూరం పొడిని కూడా పాదాలపై వేసుకోవాలి. ఆతర్వాత పాదాలకు సాక్స్, బూట్స్ వేసుకోవాలి.

- Advertisement -


 వర్షాకాలంలో మీరు ఎలాంటి పాదరక్షలు వేసుకుంటున్నారన్నది కూడా చాలా ముఖ్యం. స్లిప్పర్స్ వేసుకోవచ్చు. రెయిన్ బూట్స్ వేసుకోవడం కూడా మంచిది. లేదా ప్లాస్టిక్ తో చేసిన మామూలు చెప్పులు లేదా ఓపన్ షూస్ వేసుకోవచ్చు. ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే పాదాలను శుభ్రం చేసుకుని పొడిగా
ఉంచుకోవాలి. లేకపోతే ఇన్ఫెక్షన్ల బారిన పడతారు.

 మీరు ధరించే చెప్పులు కూడా పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు వహించాలి. మీరు వేసుకునే స్లిప్పర్స్ ను యాంటీబాక్టిరియల్ సబ్బు నీళ్లల్లో కొద్దిసేపు నానబెట్టి ఆ తర్వాత పొడారిపోయేలా డ్రై ప్రదేశంలో వాటిని ఉంచాలి. ఇలా చేయడం వల్ల స్లిప్పర్లపై ఉండే ఫంగస్ బారిన పడరు.
 పాదాలు శుభ్రంగా ఉండాలంటే ఈ సీజన్ లో తప్పనిసరిగా పాదాలను తరచూ ఎక్స్ ఫొయిలేట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల పాదాలు పరిశుభ్రంగా ఉంటాయి. గోరువెచ్చని నీటిలో షాంపు కలిపి అందులో పాదాలు ఉంచాలి. తర్వాత ప్యూమిస్ స్టోన్ తో స్ర్కబ్బింగ్ చేసుకోవాలి. లేదా మీకు నచ్చిన
ఫుట్ స్క్రబ్ ను అప్లై చేసుకోవచ్చు.


 పాదాలను శుభ్రం చేసుకుని టవల్ తో పొడిగా తుడుచుకున్న తర్వాత మంచి సువాసనలు చిందించే హైడ్రెంట్ ను పాదాలకు అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాదాలు తగిన విధంగా హైడ్రేట్ అవుతాయి. గులాబారి మాయిశ్చరైజింగ్ లోషన్ దీనికి బాగా పనిచేస్తుంది. అలాగే పగిలిన పాదాలకు దాబర్ గులాబారి కోల్డ్ క్రీము రాసుకుని సాక్స్ లు ధరించాలి. రాత్రి నిద్రపోయేముందు ఈ విధంగా చేసుకుని పడుకుంటే పొద్దున్న లేచేసరికి పాదాలు మ్రుదువుగా, శుభ్రంగా, మరింత నాజూగ్గా కనిపిస్తాయి. పొడి పాదాలకు నేచురల్ బాడీ ఆయిల్ తో మసాజ్ చేస్తే పాదాలు మ్రుదువుగా తయారవుతాయి.
 ఇంటిదగ్గర పెడిక్యూర్ కూడా చేసుకోవచ్చు. దీనికి కావలసినదల్ల గోరువెచ్చటి నీటిలో షాంపు వేసి పాదాలు నాననివ్వాలి. నిమ్మరసం, ప్యూమిక్ స్టోన్ తో గాని లేదా ఏదైనా ఫుడ్ స్క్ర బ్ తో పాదాలను శుభ్రం చేసుకోవాలి. పాదాల వేళ్ళ చిగుళ్లు, గోళ్లను సున్నితంగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత వాటిని పాలిష్ చేసుకోవాలి. చివరిగా వాటిపై గ్లిజరిన్ అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల పాదాలు, వేళ్లు డీస్ట్రెస్ అవడంతో పాటు ఎంతో శుభ్రంగా కూడా ఉంటాయి.

 పాదాలను శుభ్రంగా ఉంచుకునే ఇంటి చిట్కాలు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి ఒక చిట్కా ఏమిటంటే నాలుగు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి, రెండు చుక్కల లవండర్ లేదా జాస్మిన్ ఆయిల్, అర టీస్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ పొడి చేసిన ఎండు వేపాకులు తీసుకోవాలి. వీటిని గోరువెచ్చని నీటిలో కలిపి పేస్టులా చేయాలి. ఆ పేస్టును పొడిగా ఉన్న పాదాలకు అప్లై చేసి ఇరవై నిమిషాల నుంచి అరగంట పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత నీళ్లతో పాదాలను కడుక్కొని టవల్ తో పొడిగా తుడుచుకోవాలి. ఆతర్వాత ఆలివ్ ఆయిల్ తో పాదాలను మసాజ్ చేసుకోవాలి. ఇలా చేస్తే పాదాలు శుభ్రంగా, అందంగా మాత్రమే కాదు ఆరోగ్యంగా కూడా ఉంటాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News