సాధారణంగా మనిషి పుట్టాలంటే ఆడ.. మగ ఉండాలి. అండం, వీర్యకణం సంపర్కం చెందాలి. ఆ రెండూ ఫలదీకరిస్తే పిండం తయారవుతుంది. ఇన్నాళ్లూ మానవ పునరుత్పత్తి గురించి మనకు తెలిసిన విషయం ఇదే. కానీ సైన్స్ అభివృద్ధి చెందుతోంది. అసలు అండం, వీర్యకణాలతో పని లేకుండానే ప్రయోగశాలల్లో కృత్రిమంగా పిండాలను ఉత్పత్తి చేస్తున్నారు!!
శాస్త్ర విజ్ఞానం ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ ఉంటుంది. సరికొత్త ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. వీటిలో కొన్ని మనిషి జీవితాన్ని మరింత సుఖమయం చేస్తుంటే, మరికొన్ని మనిషి నైతిక విలువలనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. రెండువైపులా పదునున్న కత్తి లాంటి ఈ శాస్త్ర విజ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్న విచక్షణ మాత్రం ఎప్పటికీ మనిషి చేతుల్లోనే ఉంటుంది. ఈ చర్చ మొత్తానికి అసలు కారణం… అండం, వీర్యకణాలతో ఏమాత్రం అవసరం లేకుండానే ప్రయోగశాలల్లో కృత్రిమంగా పిండాన్ని తయారుచేయడం, అది ముమ్మూర్తులా సాధారణ మానవ పిండంలాగే ఉండటం!
ఇటీవల కొంత కాలం క్రితం జరిగిన అంతర్జాతీయ మూలకణ పరిశోధన సొసైటీ వార్షిక సమావేశంలో ఈ విప్లవాత్మక పరిశోధన వివరాలు బయటకు వచ్చాయి. ప్రస్తుతానికి వీటిని ఎంబ్రియో మోడల్స్ అనే చెబుతున్నారు. వీటిని పరిశోధన కోసం మాత్రమే తయారుచేస్తున్నామని అంటున్నారు. యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ప్రొఫెసర్ మాగ్దలీనా జెర్నికా-గోయెట్జ్ తన ప్రయోగశాలలో చేసిన ఓ పరిశోధన ఇందుకు దారి తీసింది. మూలకణాల ఆధారంగానే ఈ కృత్రిమ పిండాన్ని తయారుచేసినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం ఇంతవరకు ఎక్కడా ప్రచురించలేదు. కానీ, అండం… వీర్యకణాల కలయికతో కాకుండా కేవలం మూలకణం నుంచి మాత్రమే ఈ కృత్రిమ పిండాన్ని తయారుచేసినట్లు కచ్చితంగా చెబుతున్నారు.
మూలకణాలతో ప్రయోజనమేంటి?
మూలకణాలకు మనిషి శరీరంలో ఏ కణంగానైనా రూపాంతరం చెందే శక్తి ఉంటుంది. వాటిని సరైన పద్ధతిలో మార్చగలిగితే వాటినుంచి పిండాలను కూడా తయారుచేయొచ్చని ప్రొఫెసర్ మాగ్దలీనా నిరూపించారు. మూలకణాల నుంచి ఇప్పటికి ఎన్నోరకాల పరిశోధనలు జరిగినా, ఇప్పటివరకు పూర్తిస్థాయి పిండాన్ని రూపొందించడం మాత్రం ఇదే తొలిసారి. కృత్రిమం అని చెబుతున్నారే తప్ప.. ఈ పిండాల శరీరం మొత్తం యథాతథంగా మనిషి శరీరంలాగే ఉంటుంది. ఈ ప్రయోగంలో పూర్తిగా ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ ద్వారానే పిండాన్ని తయారుచేశామని ప్రొఫెసర్ మాగ్దలీనా ద గార్డియన్ పత్రికకు తెలిపారు. ఈ పిండానికి మెదడు అభివృద్ధి చెందుతోందని, గుండె కూడా కొట్టుకుంటోందని ఆమె నిరూపించారు.
చైనాలో విఫల ప్రయోగాలు
చైనా శాస్త్రవేత్తలు మనిషికి దగ్గరగా ఉండే కోతి జాతిలో ఇలాంటి ప్రయోగం ఒకటి చేశారు. వాళ్లు కృత్రిమంగా కోతి పిండాలను తయారుచేసి, దాన్ని ఆడ కోతుల గర్భంలో ప్రవేశపెట్టినా, వాటన్నింటికీ గర్భస్రావమైంది తప్ప, పిల్లలు పుట్టలేదు. దాంతో ఇప్పటివరకు ఇలాంటి కృత్రిమ పిండాలు విజయవంతం కావనే అభిప్రాయమే శాస్త్రజ్ఞులలో ఉంది. కానీ ఈ దిశగా కొత్త పరిశోధనలు జరుగుతున్న విషయం మాత్రం ఇప్పటివరకు ఎక్కడా బయటపడలేదు.
నిస్సంతులకు వరమే
నిజానికి ఐవీఎఫ్ (ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్) లాంటి ప్రక్రియలు కూడా చాలామందికి సరిగా పనిచేయవు. సంతాన భాగ్యం లేక చాలాకాలం ఎదురు చూసి.. చివరకు ఎవరో ఒకరిని దత్తత చేసుకోవడమో, లేదా జీవితాంతం పిల్లలు లేకుండా మిగిలిపోవడమో చాలామంది చేస్తుంటారు. అలాంటివారికి మాత్రం ఇది నిస్సందేహంగా పెద్ద వరమేనని ప్రొఫెసర్ బ్రిస్కో చెబుతున్నారు. నైతికత విషయంలో ఇది ఎంతవరకు సబబన్న ప్రశ్నలు తలెత్తుతున్నా.. శాస్త్ర పరిశోధనల విషయంలో అలాంటివి ప్రతిసారీ ఎదురవుతూనే ఉన్నాయన్నారు. ఈ విషయంలో కచ్చితమైన ప్రభుత్వ నియంత్రణలు, తగిన మార్గదర్శకాలు ఉంచి వాటిని కచ్చితంగా అమలుచేసేలా చూస్తే మాత్రం ఇది మంచిదేనని చెబుతున్నారు.
చాలా దేశాల్లో మానవ పిండ పరిశోధనలకు 14 రోజుల నియమాన్ని పాటిస్తారు. అంటే, మానవ అండం 14 రోజుల్లో ఒక పిండంగా రూపొందుతుంది. కానీ ఇప్పుడు తయారుచేస్తున్న ఎంబ్రియో మోడళ్లు చట్టబద్ధంగా చూస్తే పిండాలు కావు కాబట్టి వాటికి చట్టపరమైన నిబంధనలు వర్తించవన్న వాదనలూ వినిపిస్తున్నాయి. బర్మింగ్‌హామ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఇల్డెమ్ అకెర్మన్ ఈ విషయం గురించి మాట్లాడారు. “14 రోజుల నియమంతో సంబంధం లేకుండానే మనం ఈ మూలకణాలతో పిండాలను అభివృద్ధి చేయొచ్చని ఇప్పుడు తెలుస్తోంది. ఇది కచ్చితంగా మానవ పునరుత్పత్తి శాస్త్రంలో ఓ కొత్త అధ్యాయమే. ఇలా చేయగల సామర్థ్యం ఉన్నంత మాత్రాన అలా చేయడాన్ని సమర్థించలేం” అని ఆయన చెప్పారు.
చట్టం.. శాస్త్రం ఏమంటున్నాయి?
యూకేలోని న్యాయ, నైతిక నిపుణులంతా ఇప్పుడు ఈ అంశంపైనే చర్చ మొదలుపెట్టారు. ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న దాని గురించి కొన్ని మార్గదర్శకాలు సిద్ధం చేసే పనిలో వారు ఉన్నారు. మనిషి జీవితంలోని ప్రారంభదశల గురించిన అధ్యయనానికి ఈ కృత్రిమ పిండాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నది పరిశోధకుల మాట. సాధారణ పిండాలను బయటకు తీసి పరిశోధనలు చేయలేమని, అదే కృత్రిమ పిండాలైతే కొరత ఉండబోదని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్‌కు చెందిన ప్రొఫెసర్ రోజర్ స్టర్మీ చెప్పారు. ముఖ్యంగా గర్భస్రావాలు ఎందుకు అవుతున్నాయన్న విషయంపై పరిశోధనలు దీంతో మరింత ముందుకు వెళ్తాయన్నారు.