Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్Komarraju: విజ్ఞాన సర్వస్వ సృష్టికర్త కొమర్రాజు

Komarraju: విజ్ఞాన సర్వస్వ సృష్టికర్త కొమర్రాజు

తెలుగు సాహిత్య చరిత్ర గతిని మలుపు తిప్పారు

తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ సృష్టికర్త కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. విజ్ఞాన చంద్రికా మండలి పేరుతో ఒక విజ్ఞాన, పుస్తక భాండాగారాన్ని స్థాపించి, తెలుగువారికి చరిత్ర పరిశోధనలను పరిచయం చేసి, ఉన్నత, ఉత్తమ ప్రమాణాలతో చరిత్ర, విజ్ఞాన రచనలను తెలుగువారికి అందించిన పరిశోధకుడు, సాహితీవేత్త కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. కేవలం 46 ఏళ్ల వయసులో కన్నుమూసినప్పటికీ, తన కొద్దిపాటి జీవిత కాలంలో ఒక పెద్ద సంస్థకు సరిపడా సాహితీ కార్యక్రమాలను సాకారం చేసిన సాహితీ కృషీవలుడు ఆయన. అంతేకాదు, ఎందరో సాహితీ మూర్తులకు ఆయన సహచరుడు, ప్రోత్సాహకుడు. అంతకు మించి స్ఫూర్తి ప్రదాత. అజ్ఞానాంధకారంలో, నిద్రాణంగా ఉన్న తెలుగు జాతిని మేల్కొలిపిన అతి కొద్ది మంది సంస్కరణాభిలాషులలో లక్ష్మణ రావు ఒకరు.

- Advertisement -

ఇరవయ్యో శతాబ్దం తెలుగు సామాజిక వికాసానికి, సంస్కరణలకు సంబంధించినంత వరకూ ఒక మహాయుగమని చెప్పవచ్చు. దాదాపు ఒకే సమయంలో నలుగురు అపురూప, అద్వితీయ వ్యక్తులు తెలుగు సాహిత్యాన్ని ఆధునిక యుగం వైపు నడిపించారు. తెలుగు సాహిత్య చరిత్ర గతిని మలుపు తిప్పారు. తెలుగు భాషకు, తెలుగు సాహిత్యానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువచ్చారు. నవయుగ వైతాళికులు
ఈ మహానుభావులు. వీరిలో ఒకరైన కందుకూరి వీరేశలింగం పంతులు సంఘ సంస్కర్త, మూఢాచారాలను వ్యతిరేకించిన మేధావి. తొలి తెలుగు నవల, తొలి తెలుగు కవుల చరిత్ర, తొలి తెలుగు నాటకం, తొలి తెలుగు ఆత్మకథ ఆయనే అందించారు. ఆ తర్వాత గురజాడ అప్పారావు చిన్న కథలకు, వచన వ్యావహారిక నాటకానికి శ్రీకారం చుట్టారు. ఇక గిడుగు రామ్మూర్తి పంతులు తెలుగు రాతలోనే మార్పులు తెచ్చి, వ్యావహారిక సాహిత్యానికి తెలుగు భాషలో పట్టం కట్టిన వ్యక్తి. అటువంటి కోవకు చెందిన వ్యక్తి లక్ష్మణ రావు.

కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలులో 1877 మే 18న జన్మించిన లక్ష్మణ రావు మూడేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయి, తన సవతి అన్న పోషణలో పెరిగారు. ఎక్కువ కాలం భువనగిరిలో జీవితం గడిపారు. 1902లో నాగపూర్ లో ఎం.ఏ చేశారు. ఆ తర్వాత ఆయనకు మునగాల రాజా నాయని వెంకట రంగారావు సంస్థానంలో ఉద్యోగం లభించింది. రామాయణంలో చెప్పిన పర్ణశాల నాసికా త్రయంబకేశ్వరం వద్ద ఉందని అప్పట్లో బాల గంగాధర తిలక్ మహారాష్ట్రలోని వివిధ పత్రికల్లో వ్యాసాలు రాస్తుండేవారు. అయితే, పర్ణశాల నాసికా త్రయంబకేశ్వరం వద్ద లేదని, అది గోదావరి నది ఒడ్డున ఉందని లక్ష్మణ రావు నిరూపించారు. అప్పటి నుంచి బాలగంగాధర తిలక్, లక్ష్మణరావుల మధ్య పరిచయం పెరిగింది. అప్పటికి లక్ష్మణ రావు వయస్సు 22 ఏళ్లు మాత్రమే.

ఆయన 1901లో హైదరాబాద్ నగరంలో శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయాన్ని స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు. 1906లో విజ్ఞాన చంద్రికా మండలిని నెలకొల్పారు. తెలుగులో ఒక సంపూర్ణ విజ్ఞాన సర్వస్వాన్ని తయారు చేయడం ప్రారంభించారు. ఆ శ్రమలో ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతింది. 1923 జూలై 12న 46 ఏళ్ల వయసులోనే లక్ష్మణరావు మరణించారు. కందుకూరి వీరేశలింగం పంతులు మరణించిన ఇంటిలో, అదే గదిలో లక్ష్మణ రావు కూడా మరణించారు. మహారాష్ట్రలో ఆయన సమాచార్, విజ్ఞాన్ విస్తార్ అనే పత్రికలకు సంపాదకత్వం నిర్వహించారు. కేసరి, మహారాష్ట్ర వంటి పత్రికలకు వ్యాసాలు రాసేవారు. ప్రాచీన మహారాష్ట్ర కవి మోరోపంత్ రాసిన మహాభారతాన్ని చదివి, శుద్ధి చేసి, సరైన ప్రతిని తయారు చేసి, కర్ణ పర్వాన్ని ప్రకటించారు. ఆయన సంపాదకత్వం వహించిన మొదటి గ్రంథం
ఇది.

ఆయన మొదటి నుంచి ఆంధ్ర భాషతో, ఆంధ్ర ప్రాంతాలతో సాన్నిహిత్యం కొనసాగిస్తూనే వచ్చారు. నాగపూర్ లో ఉంటూనే తెలుగు పత్రికలకు వ్యాసాలు రాసేవారు. అప్పట్లో విజయవాడ క్రైస్తవ పాఠశాలలో ఉపాధ్యాయులైన రాయసం వెంకటశివుడు స్త్రీ విద్యా వ్యాప్తి కోసం నడిపిన తెలుగు జనానా పత్రికలో
ఆయన, ఆయన అక్కయ్య అచ్చమాంబ వ్యాసాలు రాసేవారు. ‘శివాజీ చరిత్రము’ ఆయన మొట్టమొదటి గ్రంథం. హిందూ మహాయుగం, ముస్లిం మహాయుగం వంటి ఆయన వ్యాసాలు ఆ తర్వాత ‘లక్ష్మణరాయ వ్యాసావళి’ పేరుతో ప్రచురితమయ్యాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News