BRS Party: గులాబీ దళపతి కేసీఆర్ అనుకున్నట్లే ఢిల్లీలో తమ పార్టీ జెండా ఎగరేశారు. తెలంగాణకు నేనే మహాత్మని అని చెప్పుకొనే స్థాయికి తెచ్చిన టీఆర్ఎస్ పార్టీని అర్ధాంతరంగా ముగించేసి బీఆర్ఎస్ జెండా ఎత్తుకున్నారు. అనుకున్నదే తడవుగా.. ఆలస్యం చేయకుండా ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభించి.. పూజలు, యాగాలు గావించి.. జాతీయ రాజకీయాలలో వేటకి సిద్ధమయ్యారు.
మరి కేసీఆర్ మరోసారి అద్భుతం చేస్తారా? కొట్లాడి తెలంగాణ తెచ్చినట్లే మరోసారి దేశాన్ని కదిలించేలా పోరాటం చేయగలరా? అసలు జరిగేపనే కాదన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినట్లే.. ఒక ప్రాంతీయ పార్టీ వెళ్లి.. దేశంలో అత్యంత బలమైన శక్తులుగా ఉన్న మోడీ-షా ద్వయాన్ని ఢీ కొట్టి జయించగలడా? తెలంగాణ ప్రజల గొంతును వినిపించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించినట్లే.. భిన్న మతాలు, భిన్న కులాల కలయిక గల భారత ప్రజల గొంతును కేసీఆర్ వినిపించగలరా?
తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ తెగింపు, పోరాట పటిమతో పాటు ఓ అద్భుతం జరిగింది. అందుకే అప్పుడు ఉద్యమం అంతగా ఉదృతంగా సాగినా, ఆనాటి కేంద్రం సానుకూలంగా స్పందించినా తెలంగాణ ప్రజలకు అదొక మరుపురాని అద్భుతం. బలమైన సీఎంగా ఉన్న రాజశేఖరరెడ్డి మరణం.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో రాజకీయ అనిశ్చితి.. టైం చూసి కేసీఆర్ ఉద్యమాన్ని రగిలించడం.. వాళ్ళు, వీళ్ళు అని లేకుండా అన్ని వర్గాలు ఈ ఉద్యమాన్ని భుజాల కెత్తుకోవడం.. వంటి కారణాలతో అప్పుడు కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రం అనే అద్భుతాన్ని ఆవిష్కరించారు.
మరి ఇప్పుడు అలాంటి అద్భుతాన్ని కేసీఆర్ జాతీయ స్థాయిలో రగిలించి, సృష్టించి, నడిపించి సాధించగలరా? ఒక్కటైతే నిజం. అప్పుడు తెలంగాణలో ఉన్నట్లే ఇప్పుడు దేశవ్యాప్తంగా కొంత పొలిటికల్ నీడ్ అయితే ఉంది. బీజేపీ బలమైన శక్తిగా ఉంటే దాన్ని ఢీ కొట్టేలా కాంగ్రెస్ ఆశించినస్థాయిలో పుంజుకోలేక ఇలా ఇతర పార్టీలకు అవకాశమిస్తుంది. అందుకే ఆ సత్తా గల పార్టీకి ఇక్కడ అవకాశం అయితే ఉంది. కానీ అది జరగాలంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. మరి కేసీఆర్ బీఆర్ఎస్ తో ఆ అద్భుతాన్ని చేస్తారా అనేది చూడాలి.