నవరత్నాలలో భాగంగా చిరు వ్యాపారులకు జగనన్న తోడు ద్వారా ఆర్థిక చేయూత ఇవ్వాలనే సద్దుదేశంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న తోడు పథకం 7వ విడతలో జిల్లాలోని 20,516 మంది లబ్ధిదారులకు రూ.57.01 లక్షల రూపాయలను వారి బ్యాంకు ఖాతాలకు జమ చేశామని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన పేర్కొన్నారు.
జగనన్న తోడు పథకం ఏడవ విడతలో భాగంగా చిరు వ్యాపారులు సాంప్రదాయ చేతివృత్తుల వారికి కొత్తగా బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాన్ని అందించడంతో పాటు, వడ్డీ రీఇంబర్స్మెంట్ ను తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. కర్నూలు కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు శాసన సభ్యులు డా.జె.సుధాకర్, బీసి కార్పొరేషన్ డైరెక్టర్ సాయినాథ్, లబ్దిదారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జగనన్న తోడు పథకం ద్వారా 7వ విడతలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 13,476 మంది లబ్ధిదారులకు రూ.37.45లక్షలు, పట్టణ ప్రాంతంలో 7,040 మంది లబ్ధిదారులకు రూ.19.56లక్షలు మొత్తంగా 20,516 మంది లబ్ధిదారులు జగనన్న తోడు ద్వారా లబ్ధి పొంది సకాలంలో చెల్లించిన వారికి వడ్డీ రాయితీ రూపంలో రూ.57.01 లక్షల రూపాయలు లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరిగిందన్నారు. చిరు వ్యాపారులు వడ్డీల ఊబిలో చిక్కుకోకుండా వడ్డీ భారం పూర్తిగా ప్రభుత్వమే భరిస్తూ వారికి అన్ని విధాలా తోడుగా నిలబడేందుకు జగనన్న తోడు పథకాన్ని రాష్ట్ర లబ్ధిదారులకు చేయూతను ఇవ్వడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం అందించిందని కలెక్టర్ పేర్కొన్నారు.
పాణ్యం శాసన సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు శాసనసభ్యులు డా.జె.సుధాకర్ మాట్లాడుతూ పాదయాత్రలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చిరు వ్యాపారులు పడుతున్న ఇబ్బందులను ఆర్థిక కష్టాలను గమనించి జగనన్న తోడు పథకాన్ని అమలు చేసి వారికి ఆర్థికంగా అండగా నిలిచారన్నారు. నిరుపేదలకు చేతివృత్తుల వ్యాపారాలు చేసుకునే వారికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని మూలధనాన్ని సమకూర్చడంతో పాటు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి నగదు అందజేశామన్నారు. ఇలాంటి కార్యక్రమాల లబ్ధిదారుల ఇళల్లో రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు నింపిందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు గ్రామీణ ప్రాంతంలోని 13,476 మంది లబ్ధిదారులకు రూ.37.45లక్షలు, పట్టణ ప్రాంతాలలోని 7,040 మంది లబ్ధిదారులకు రూ.19.56లక్షల మెగా చెక్కు లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ ఇంఛార్జి పిడి, మెప్నా పిడి నాగశివలీల, ఏపిడి శ్రీధర్ రావు, ఎల్డిఎం రామచంద్ర రావు, లబ్దిదారులు పాల్గొన్నారు.