Friday, September 20, 2024
HomeతెలంగాణShadnagar: మాకొద్దీ మైనింగ్ పరిశ్రమలు

Shadnagar: మాకొద్దీ మైనింగ్ పరిశ్రమలు

ప్రజలు వ్యతిరేకిస్తున్నా కాలుష్య పరిశ్రమలకు అనుమతులిస్తున్న మైనింగ్, పొల్యూషన్ శాఖలు

పచ్చని పంట పొలాలలో మైనింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేయవద్దని గ్రామస్తులు ముక్తకంఠంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పరిశ్రమల ఏర్పాటు కోసం గ్రామాలలో ప్రజాభిప్రాయసేకరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముక్తకంఠంతో పరిశ్రమ వద్దని గ్రామస్థులు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. తీరా గ్రామస్థుల అభీష్టంకు వ్యతిరేకంగా మైనింగ్ పరిశ్రమలను ఎలా ఏర్పాటు చేశారంటూ ఆయా గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైనింగ్ పరిశ్రమలు మాకొద్దని మైనింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేసి రైతుల పొట్టలు కొట్టొద్దంటూ గ్రామస్థులు కోరుతున్నారు.

- Advertisement -

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం వేములనర్వ గ్రామంలోని
సర్వే నెంబర్ 39/1P లో 14.57 హెక్టార్లలో ఎమ్. గోపాల్ క్వార్ట్జ్ మైన్ సంస్థకు మైనింగ్ లీజ్ కోసం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి 18 అక్టోబర్ 2021న ప్రజాభిప్రాయ సేకరణను ఏర్పాటు చేశారు. దానికి అప్పటి అదనపు కలెక్టర్ ఎస్. తిరుపతిరావు, పొల్యూషన్ బోర్డు ఈఈ దయానంద్ లు హాజరయ్యారు. గ్రామస్తులు ఇక్కడ మైనింగ్ పరిశ్రమ ఏర్పాటు చేయొద్దంటూ అధికారులకు తమ అభిప్రాయం తెలిపారు. మరి అధికారులు ఏమి నివేదిక అందజేశారో కాని అక్కడ దాదాపు 2సంవత్సరాల తర్వాత ఎమ్.గోపాల్ క్వార్ట్జ్ మైన్ సంస్థ తమ మైనింగ్ కార్యకలాపాలు సాగిస్తుండటంతో గ్రామస్థులు చిర్ర శ్రీను, మల్లేష్, ఆంజనేయులు, చందు, శివరాములు, బన్నీ, మల్లేష్ తదితరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొత్తూరు మండలం సిద్ధాపూర్ లో ఏడాది క్రితం ఓ కంపెనీ కోసం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ అపహాస్యం పాలయ్యింది. ప్రజాభిప్రాయ సేకరణలో 99 శాతం మంది వ్యతిరేకించారు. అయినా ఆ కంపెనీకి లీజును పునరుద్ధరించారు. కొండలను పిండి చేస్తూ ఆ కాంట్రాక్టర్ దర్జాగా మైనింగ్ చేపడుతున్నాడు. పరిసర ప్రాంత రైతులు, ఆయా గ్రామాల ప్రజలు ప్రజాప్రతినిధులు,స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసి వ్యతిరేకించిన కూడా సదరు కంపెనీ కి లీజు పునరుద్ధరించడం వెనుక మర్మమేమిటో అధికారులకే తెలియాలి. తాజాగా కొత్తూరు మండలంలోని సిద్దాపూర్ సర్వే నంబర్ 362లో 10.117 హెక్టార్ల లో మైనింగ్ కోసం గురువారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. ఇందు కోసం నోటీసులు జారీ చేశారు. కనీసం గురువారం జరిగే ప్రజాభిప్రాయలో ప్రజల అభిప్రాయాలకు ఏ మాత్రం విలువ ఉంటుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.

మైనింగ్, పొల్యూషన్ అధికారులు ఉన్నారా?
నియోజకవర్గ పరిధిలోని కేశంపేట, కొత్తూరు పరిసర ప్రాంతాల్లో యదేచ్చగా గుట్టలు తవ్వుతున్న మైనింగ్, పొల్యూషన్ అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. కేశంపేట, వేములనర్వ, ఎస్బి పల్లి, సిద్దాపూర్, కొడిచెర్ల, కొడిచెర్ల తండా పరిసర ప్రాంతాల్లో ఉన్న గుట్టలు ఖాళీ అవుతున్న మైనింగ్ అధికారులు ఏమిపట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News