చిన్న పిల్లలు అన్నాక అల్లరి చేయడం సహజం. అంగన్ వాడీల్లో, స్కూళ్లలోనూ చిన్నారులు అల్లరి చేస్తుంటారు. అల్లరి చేయకూడదని కేకలేస్తారు టీచర్లు. అంతేగాని.. వాళ్లని ఇష్టమొచ్చినట్లు హింసించరు కదా. కానీ ఓ అంగన్ వాడీ ఆయా ఓ చిన్నారిపట్ల అమానుషంగా ప్రవర్తించింది. అల్లరి చేస్తోందన్న కారణంతో మూడున్నరేళ్ల చిన్నారి ముఖంపై అగ్గిపుల్ల కాల్చి చురకలు పెట్టింది. ఈ ఘటన విశాఖపట్నంలోని సీతంపేట పరిధి రాజేంద్రనగర్లో జరిగింది. కనకమ్మవారి వీధిలో ఉన్న అంగన్ వాడీ కేంద్రంలో పిల్లలకు ఆటపాటలు నేర్పుతున్నారు.
ఆ సమయంలో ఓ చిన్నారి అల్లరి చేసింది. నచ్చజెప్పి, అలా చేయకూడదని మాటలతో చెప్పాల్సిన రేష్మా అనే ఆయా.. కోపంతో అగ్గిపుల్ల వెలిగించి చిన్నారి ముఖంపై చురకలు పెట్టింది. బాధ భరించలేక చిన్నారి ఏడుస్తూ కేకలేస్తున్నా ఆయా కనికరించలేదు. ఇంటికెళ్లాక చిన్నారి ముఖంపై కాలిన గాయాలను చూసి తల్లి షాకైంది. అదే అంగన్వాడీ కేంద్రం భవనంపై ఉన్న సీడీపీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఘటనపై స్పందించిన సీడీపీఓ.. సూపర్‌వైజర్‌ను బాధిత బాలిక ఇంటికి పంపి విచారణ చేస్తున్నట్టు చెప్పారు. బాలిక ముఖంపై ఉన్న గాయాలు అంగన్వాడీలో పెట్టినవేనని తేలితే.. ఆయాపై చర్యలు తీసుకుంటామన్నారు.