జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ పై వై.ఎస్.ఆర్.సి.పి ప్రభుత్వం పరువు నష్టం కేసు దాఖలు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. తమను, తమ విధానాలను ఎవరైనా, ఏ రాజకీయ పార్టీ అయినా నిలదీసినా, ప్రశ్నించినా వారిపై కేసులు పెట్టడం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విధానం కింద మారిపోయిందని ఆయన మండిపడ్డారు. ఆయన ఈ మేరకు ట్వీట్ చేస్తూ, పవన్ కల్యాణ్ పై వై.ఎస్.ఆర్.సి.పి ప్రభుత్వం పరువు నష్టం దావా వేయడం కంటే అవివేకపు, అరాచకపు చర్య మరొకటి ఉండదని, ప్రభుత్వ అనైతిక విధానాలకు అంతూపొంతూ ఉండడం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం వక్ర దృష్టితో చూస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
వాలంటీర్లు ప్రజల వద్ద నుంచి సమాచారాన్ని సేకరిస్తున్న తీరును పవన్ కల్యాణ్ ప్రశ్నించినప్పుడు, ఆయన సందేహాలకు సమాధానం చెప్పవలసింది పోయి, ఆయనపై చర్యలు తీసుకోవడం అన్యాయమని, అక్రమమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల నుంచి సేకరిస్తున్న సమాచారాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందనడంలో సందేహమే లేదని కూడా చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యవస్థలను జగన్ ప్రభుత్వం దుర్వినియోగం చేయడం, తమ స్వప్రయోజనాలకు వినియోగించడం జరుగుతూనే ఉందని ఆయన ఆరోపించారు. దీనిపై తప్పకుండా విచారణ జరగాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. తమను ప్రశ్నించిన వారిపై దాడులు చేయించడం, కేసు పెట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్న జగన్ ప్రభుత్వం తన స్థాయిని మరచి వ్యవహరిస్తోందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రభుత్వం ఇప్పటికైనా ప్రారంభించాలని ఆయన సూచించారు.