Kane Williamson : న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అతడి నిర్ణయం తెలిసి క్రికెట్ అభిమానులు, ముఖ్యంగా న్యూజిలాండ్ ఫ్యాన్స్ షాకైయ్యారు. ప్రస్తుతం కివీస్ జట్టుకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్ గా వ్యవహరిస్తున్న కేన్ మామ.. ఇకపై టెస్టులకు సారథ్యం వహించనని చెప్పాడు. కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రమే తాను నాయకుడిగా కొనసాగుతానని స్పష్టం చేశాడు. వచ్చే రెండేళ్లలలో రెండు ప్రపంచకప్‌లు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.
గతకొంతకాలంగా విలియమ్సన్ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. తన బ్యాటింగ్‌పై మరింత దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2016లో బ్రెండన్ మెక్‌కల్లమ్ నుంచి నాయకత్వ బాధ్యతలు అందుకున్నాడు కేన్ మామ. అతడి సారథ్యంలో కివీస్ ఇప్పటి వరకు 40 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. 22 టెస్టుల్లో ఆ జట్టు విజయం సాధించింది. 8 మ్యాచ్‌లు డ్రా కాగా.. 10 మ్యాచుల్లో ఓడిపోయింది. కేన్ మామ కెప్టెన్సీలోనే ఐసీసీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీని కివీస్ ముద్దాడింది.
కివీస్ టెస్టు కెప్టెన్సీని కేన్ విలియమ్సన్ వదులుకోవడంతో ఆ బాథ్యతలను సీనియర్ పేసర్ టిమ్ సౌథీకి అప్పగించింది. మరో సీనియర్ ఆటగాడు టామ్ లాథమ్ ఆ జట్టుకు వైస్ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు అని కివీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇక సౌథీ నేతృత్వంలోనే కివీస్ టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.