కాంగ్రెస్ పార్టీ లాంటి దుష్టశక్తులు ఎన్ని వచ్చిన రైతులను కాపాడుకునే నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలోని రైతు వేదికలో సిరిసేడు, మర్రివానిపల్లి, పాతర్లపల్లి, బోగంపాడు గ్రామాల రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… రైతే దేశానికి వెన్నుముక అనే సిద్ధాంతాన్ని నమ్మిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని రైతాంగ సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్నట్లు చెప్పారు. దేశమే గర్వించ దగ్గ స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తున్న అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అభివర్ణించారు.
తెలంగాణ ఉద్యమమే కరెంట్ కష్టాల మీద పుట్టింది
రేవంత్ రెడ్డి మాట్లాడినట్లు మూడు గంటల కరెంట్ కావాలా..? మత పిచ్చి లేపే బీజేపీ ప్రభుత్వం కావాలా..? మూడు పంటల ప్రభుత్వం కావాలా..? తేల్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందన్నారు. తాను అనునిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుండడాన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు తనపై అసత్య ఆరోపణలు చేస్తూ రాద్ధాంతం చేస్తున్నారని ప్రతిపక్ష నాయకులు చేస్తున్న చిల్లర మల్లర రాజకీయాలను ప్రజానీకం గమనిస్తున్నట్లు చెప్పారు. ప్రజాసేవ చేయాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్న తనను మానసికంగా దెబ్బతీసేందుకు ప్రతిపక్ష నాయకులు చేస్తున్న కుట్రలను ఇకనైనా మానుకోవాలని హితువు పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో హుజురాబాద్ లో బిఆర్ఎస్ జండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తనకు నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా ఒక్క చాన్స్ ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని అన్నారు. మరో సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ లాగా హుజురాబాద్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై గ్రామాల్లో అనునిత్యం చర్చ జరగాలని ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన రైతులకు, బిఆర్ఎస్ కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేష్, సర్పంచులు, రఫీ ఖాన్, కలాల రాజిరెడ్డి, జిల్లెల్ల తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు ఎక్కేటి సంజీవరెడ్డి, చిన్న రాయుడు, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోల్నేని సత్యనారాయణ రావు, జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ పోడేటి రామస్వామి, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.