Saturday, November 23, 2024
HomeదైవంSrivani Trust: శ్రీవాణి ట్రస్టు ద్వారా వెయ్యి కోట్లు

Srivani Trust: శ్రీవాణి ట్రస్టు ద్వారా వెయ్యి కోట్లు

శ్రీవాణి ట్రస్టు టికెట్లు వచ్చే 3 నెలల వరకూ పూర్తిగా అమ్ముడుపోయాయి

శ్రీవెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్టు (శ్రీవాణి ట్రస్టు) ద్వారా పొందిన విరాళాల మొత్తం త్వరలో వెయ్యి కోట్ల రూపాయలకు చేరే అవకాశం ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థం పూర్తయ్యే నాటికి శ్రీవాణి ట్రస్టు విరాళాలు తప్పకుండా వెయ్యి కోట్ల రూపాయలకు చేరుకోవడం జరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆశాభావంతో ఉన్నారు. ఈ ట్రస్టును ఏర్పాటు చేసిన నాటి నుంచి ఇప్పటి వరకూ భక్తులు వేల సంఖ్యలో దీనికి విరాళాలు ఇవ్వడం జరిగిందని, ఈ ఏడాది జూన్ చివరి వరకూ దీనికి మొత్తం 861 కోట్ల రూపాయలు అందాయని వారు తెలిపారు.

- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానం (టి.టి.డి), రాష్ట్ర దేవాదాయ శాఖ, సమరసత సేవా ఫౌండేషన్ కలిసి మొట్టమొదటిసారిగా ఈ భారీ విరాళాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ ట్రస్టు ఆన్ లైన్ ద్వారానే కాకుండా ఆఫ్ లైన్ ద్వారా కూడా విరాళాలు సేకరిస్తోంది. ఈ నిధులను ఫిక్సెడ్ డిపాజిట్ చేసి, దీనిపై వచ్చే వడ్డీతో ట్రస్టు ఆశయాలను నెరవేర్చడం జరుగుతోంది. మత మార్పిళ్లకు అవకాశం ఉన్న ప్రాంతాలలో ఈ ట్రస్టు ధర్మ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 2273 ఎస్సీ, ఎస్టీ, మత్స్య కార్మికుల ప్రాంతాల్లో భజన మందిరాలను ఏర్పాటు చేయాలని శ్రీవాణి ట్రస్టు సంకల్పించిందని అధికారులు
వెల్లడించారు.

ఇందులో దేవాదాయ శాఖ 1,953 భజన మందిరాలను, సమరసత సేవా ఫౌండేషన్ 320 భజన మందిరాలను నిర్మించడం జరుగుతుంది. ఒక్కొక్క మందిర నిర్మాణానికి పది లక్షల రూపాయల వంతున ఖర్చవుతుందని అంచనా. ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం వల్ల దళారుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని అధికారులు తెలిపారు. ఇది ఇలా ఉండగా, శ్రీవాణి ట్రస్టు టికెట్లు వచ్చే మూడు నెలల వరకూ పూర్తిగా అమ్ముడుపోయాయి. ఈ ట్రస్టుకు ఇస్తున్న విరాళాలు దుర్వినియోగం అవుతున్నాయంటూ ఆరోపణలు రావడంతో ఈ ట్రస్టుకు సంబంధించిన అధికారులు ఇటీవల విరాళాలకు సంబంధించి ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ ట్రస్టు ఆదాయపన్ను చట్టం సెక్షన్ 12 ఏ కింద రిజిస్టర్ అయింది.

టీటీడీ ట్రస్టు బోర్డు 2018 ఆగస్టు 28న ఒక తీర్మానం ద్వారా శ్రీవాణి ట్రస్టు ఆశయాలను వివరించింది. పురాతన ఆలయాల పునరుద్ధరణ, పునర్నిర్మాణం, కొత్త దేవాలయాల నిర్మాణం, ధర్మ ప్రచారంలో భాగంగా భజన మందిరాల ఏర్పాటు వంటివి ఈ ఆశయాలలో కొన్ని. అంతేకాక, గత జూన్ లో ట్రస్టు ఒక తీర్మానం చేస్తూ, టీటీడీ ద్వారా నిర్మాణం అయిన దేవాలయాల్లో అర్చకులకు నెలకు 5,000 రూపాయలు ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News