బెంగాలీ రచయిత శరత్ బాబు రచనలను తొలిసారిగా తెలుగులోకి అనువదించిన మహానుభావుడు శతావధాని వేలూరి శివరామ శాస్త్రి. గుజరాతీ భాషలో ఉన్న మహాత్మాగాంధీ ఆత్మ కథను మొదటిసారిగా తెలుగు చేసిన వ్యక్తి కూడా వేలూరి శివరామ శాస్త్రే. అంతేకాదు, ఫ్రెంచ్ భాషలో విక్టర్ హ్యూగో రాసిన ‘లే మిజరబుల్స్’ గ్రంథాన్ని తెలుగులో ‘దివ్య జీవనం’ అనువదించినవారు కూడా ఆయనే. అరవిందుల యోగ దర్శనాన్ని కూడా ఆయనే తెలుగులోకి అనువదించారు. ఆయన ఏ కథ రాసినా అవి తప్పకుండా మళ్లీ మళ్లీ చదివిస్తాయి. ఆయన రాసిన 45 కథలూ ఆణిముత్యాలు. విద్వాంసులు, పండితులు కథలు రాయలేరన్న అభిప్రాయాన్ని ఆయన పూర్తిగా వ్యతిరేకించేవారు. ఆయన జీవిత కాలంలో రెండు కథా సంకలనాలు కూడా వెలువడ్డాయి. ఇందులో మొదటి సంకలనం పేరు ‘కథాషట్కము’ కాగా, రెండవ సంకలనం పేరు ‘కథా సప్తకము.’ వేలూరి శివరామ శాస్త్రి కృష్ణాజిల్లా చిరువాడలో 1892లో విశాలాక్షి, వెంకటేశ్వరావధానులు అనే దంపతులకు జన్మించారు. చిన్నతనంలోనే వేదవేదాంగాల్లోనూ, షట్ శాస్త్రాల్లోనూ సాటి లేని మేటి అనిపించు కున్నారు. ఇంగ్లీషు, ఫ్రెంచి తదితర పాశ్చాత్య భాషలతో పాటు, గుజరాతీ, బెంగాలీ, హిందీ తదితర దేశీయ భాషల్లో కూడా పాండిత్యం సంపాదించారు. యోగం, సాంఖ్యం, వేదాంతం, జ్యోతిషం వంటి అంశాలలో ఆయనకు ఆయనే సాటి. వ్యాకరణ శాస్త్రంలో ఆయనను మించినవారు లేరని ప్రతీతి. వేలూరికి పద్ధెనిమిదేళ్ల వయసులో ఆయన గురువులైన తిరుపతి వెంకట కవులకు, కొప్పరపు కవులకు మధ్య వివాదం జరిగింది. ఆయన కూడా అందులో పాల్గొని కొప్పరపు కవులను ఢీకొన్నారు. మొదటిసారిగా ఆయన విద్వత్తు అప్పుడే బయటికి వెల్లడైంది. ఆ తర్వాత ఆయన వెనుతిరగ లేదు.
ఆ తర్వాత ఆయన తన గురువుల అడుగుజాడల్లోనే నడుస్తూ, వివిధ ప్రాంతాలలో అష్టావధానాలను, శతావధానాలను చేస్తూ తిరుగుతుండేవారు. గురువులకు తగ్గ శిష్యుడిగా పేరు పొందారు. కథకుడిగా కూడా ఆయన తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును కూడగట్టుకున్నారు. ఆయన ఇతివృత్తాలు ఎంతో వైవిధ్యంగా ఉంటాయి. యుగయుగాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు, ఆనాటి చారిత్రక, రాజకీయ ఉద్యమాలు, సామాజిక సమస్యలు, భావ సంఘర్షణలు వగైరాలన్నీ ఆయన కథలో కనిపిస్తాయి. వారి మొదటి కథ ‘కృతి’. మానవుడు తన ఉనికిని గుర్తించి, పంచభూతాలను ఎలా వశం చేసుకుని, జీవితాన్ని సుఖమయం చేసుకున్నాడో తెలిపే కథ ఇది. ఆయన తన కథలకు పెట్టే పేర్లు కూడా విలక్షణంగా ఉంటాయి. పద్మాక్షి, ఓరి నాయనా, చెలి, దత్తు, ఊరిబడి, నకల్ హైదరాబాద్, రాచపట్టు, సులతానీ మచ్చుకు కొన్ని.
స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ఎక్కడా ఎటువంటి మార్పూ రాలేదని మనం ఆలోచిస్తున్నాం. ఆయన మాత్రం నైతికంగా మానవుడు పెరగనిదే ఎన్ని చట్టాలు చేసినా ఉపయోగం లేదని ఎన్నో దశాబ్దాల క్రితమే తేల్చేశారు. ముక్తికి భక్తి ముఖ్యమనీ, దానికి కుల మతాల పక్షపాతం లేదనీ, అంతరాలు అసలే లేవనీ ఆయన ఒక కథలో స్పష్టం చేశారు. ఆయన ఏ విషయం చెప్పదలచుకున్నా తాపీగా, నిదానంగా, సాధ్యమైనంత సమగ్రంగా చెప్పడం అలవాటు. ఇతివృత్తానికి ప్రాధాన్యం కల్పిస్తూనే కథలలో ఒక విలక్షణను జొప్పిస్తారు. ఆ విలక్షణత కథా శీర్షికలలో, ప్రారంభ ఉపసంహారాలలో, పాత్రలలో, సన్నివేశాలలో, భాషలో సర్వత్రా గోచరిస్తుంది. పాత కొత్తల మేలు కలయికకు వేలూరివారి కథలు అక్షర రూపాలు. 1925-50 మధ్య కాలంలో ఆయన అభ్యుదయవాదులకు కొండంత బలం చేకూర్చారు. గ్రాంథికాన్ని వదిలి వ్యావహారికాన్ని చేపట్టారు. 1967లో ఆయన పరమపదించారు.
Telugu Sahithivanam: సాటి లేని మేటి సాహితీవేత్త వేలూరి
ఆయన ఏ కథ రాసినా అవి తప్పకుండా మళ్లీ మళ్లీ చదివిస్తాయి