Monday, November 25, 2024
Homeఇంటర్నేషనల్Poverty in America: అగ్రరాజ్యం సహా ప్రపంచవ్యాప్తంగా పేదరికంతో మరణాలు

Poverty in America: అగ్రరాజ్యం సహా ప్రపంచవ్యాప్తంగా పేదరికంతో మరణాలు

అమెరికా వర్సిటీల తరహా పరిశోధనలతో దారిద్య్ర నిర్మూలన మరింత సులభతరం

ప్రపంచంలో గుండె జబ్బులు, కేన్సర్, పొగతాగడం, మెదడు మందగించడం, మధుమేహం మనుషుల మరణాలకు కారణమౌతున్నట్టే పేదరికం కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో చావులకు దారితీస్తోంది. అనేక ఇతర అంశాల వల్ల జనం చనిపోతున్నారనే విషయంపై అమెరికాలో పరిశోధనలు ఇది వరకే జరిగాయి. అలాగే దారిద్య్రం ఈ అత్యంత ధనిక దేశంలో ఎంత మందిని కబళిస్తోందనే అంశంపై కాలిఫోర్నియా యూనివర్సిటీ–రివర్‌సైడ్‌ ప్రొఫెసర్‌ డేవిడ్‌ బ్రాడీ నేతృత్వంలో తాజాగా పరిశోధన చేశారు. అమెరికాలో దారిద్య్రం చాలా తక్కువ. డెబ్బయి ఎనభై ఏళ్ల క్రితమే సంపన్నదేశంగా అవతరించింది. అయినా, ఇంకా ఇక్కడి ప్రభుత్వం పేదరికాన్ని ఒక ప్రజారోగ్య సమస్యగా పరిగణించదు. పొగతాగడదానికి మరణాలకు సంబంధం ఉందని గ్రహించనట్టుగా, దారిద్య్రానికి చావుకు కూడా సంబంధం ఉందనే అంశంపై ఇప్పుడిప్పుడే సర్కార్లకు అవగాహన కలుగుతోంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఏడాదికి 4,80,000 మంది అమెరికన్లు పొగ తాగడం వల్ల కన్నుమూస్తున్నారు. ఊబకాయంతో 2,80,000 మంది, మితిమీరిన స్థాయిలో మాదకద్రవ్యాలు సేవించి 1,06,000 మంది మరణిస్తున్నారు. ఈ గణాంకాలన్నీ 2021కి సంబంధిచినవి. అమెరికా ప్రజలను వారి ఆయుష్షు నిండకుండానే చంపేస్తున్న కారణాలపై చేస్తున్న తాజా పరిశోధనల వల్ల జనం ప్రాణాలు కాపాడే ప్రచారోద్యమాలకు మేలు జరుగుతోంది. ప్రజారోగ్యంపై అమెరికన్లలో జాగరూకత పెంచడానికి అవి ఉపకరిస్తున్నాయి. అమెరికాలో పేదరికం పూర్తిగా అంతరించలేదనే వాస్తవం సభ్య ప్రపంచానికి ఆశ్చర్యం కలిగిస్తోంది. బ్రాడీ నాయకత్వంలో ఓహాయో స్టేట్‌ యూనివర్సిటీ సామాజికశాస్త్రవేత్త ప్రొ.హూయీ జెంగ్, యూనివర్సిటీ ఆఫ్‌ పోట్స్‌ డామ్‌ ప్రొఫెసర్‌ ఉల్రిచ్‌ కోహ్లర్‌ బృందం అమెరికాలో పేదరికం మరణాలు, పర్యవసానాలపై అధ్యయనం చేసింది. గుండె జబ్బులు, కేన్సర్, స్మోకింగ్‌ తర్వాత జనం ప్రాణాలు తీసే నాలుగో పెద్ద కారణం పేదరికమని ఈ బృందం సర్వేలో తేలింది. తక్కువ ఆదాయాలున్న ప్రజలను పీడించే దారిద్య్రం కారణంగా ఏటా అమెరికాలో 1,83,000 మంది చనిపోతున్నారు. వరుసగా పదేళ్లు దారిద్య్రం బారిన పడడం వల్ల ఏటా 2,95,000 మరణాలు సంభవిస్తున్నాయి. ఈ దేశంలో పేదలు నివసించే ప్రాంతాల్లో ప్రజారోగ్య సమస్యలు తీవ్రం కావడం, వాటి వల్ల మానసిక ఒత్తిడి పెరిగి దారిద్య్ర మరణాల సంఖ్య పెరుగుతోంది. అమెరికా సెన్సస్‌ బ్యూరో అనుబంధ నివేదిక లెక్కల ప్రకారం 2021లో దాదాపు 26 లక్షల మంది పేదరికంలో ఉన్నారు. మొత్తంమీద ఇన్నాళ్లకు దేశంలో లక్షలాది ప్రజల ప్రాణాలు ఆయువు నిండకుండానే పోవడానికి కారణమైన పేదరికంపై అమెరికా పాలకులు దృష్టి కేంద్రీకరిస్తున్నారు.

- Advertisement -

ఇండియాలోనూ ప్రజల ప్రాణాలు తీస్తున్న దారిద్య్రం
భారతదేశంలో కూడా ప్రజలు ఆయుష్షు తీరకుండానే బయటి కారణాల వల్ల ఎలా, ఎంత మంది మరణిస్తున్నారో ఎప్పటి నుంచో అధ్యయనం చేస్తున్నాయి. ప్రత్యేకించి దారిద్య్రం ప్రత్యక్ష ప్రభావం వల్ల ఎంత మంది కన్నుమూస్తున్నారో పరిశోధనలు చేసే ఆనవాయితీ దేశంలో లేదు. పేదరికం వల్ల ఎంత మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు? తగినంత ఆదాయం లేకపోవడంతో ఎంత మంది ఏఏ జబ్బులతో చనిపోతున్నారు? పేదరికం పోషహాకార లోపానికి ఎంత వరకు దారితీస్తోంది? దాని వల్ల ఎంత మంది దేశ ప్రజలు కన్నుమూస్తున్నారు? వంటి అంశాలపై ప్రభుత్వానికి అవగాహన ఉంది. కాని, విడిగా పేదరికం ప్రత్యక్షంగా ఎంత మంది ప్రజల చావుకు కారణమౌతోందని విషయం పరిశోధనాంశంగా మారలేదు. ఇండియాలో పేదరిక నిర్మూలనకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఏటా దేశంలో దారిద్య్ర రేఖ దిగువ నుంచి కోట్లాది మంది ప్రజలు పైకి వస్తున్నారు. ఆర్థిక సంస్కరణలతో సంపద సృష్టించడం ద్వారా పేదల సంఖ్యను గణనీయంగా తగ్గించగలుగుతున్నారు. అమెరికా తరహాలో భారత విశ్వవిద్యాలయాలు కూడా ప్రత్యకించి పేదరికం–మరణాలు అనే అంశంపై మరింత లోతుగా అధ్యయనం చేస్తే దారిద్య్ర నిర్మూలన కార్యక్రమాలు మరింత విజయవంతమౌతాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News