Sunday, November 24, 2024
Homeఫీచర్స్Perfect Look: పర్ఫెక్టుగా కనిపించాలంటే ఇలా చేయండి

Perfect Look: పర్ఫెక్టుగా కనిపించాలంటే ఇలా చేయండి

నీట్ అండ్ క్లీన్ గా, గ్రూమింగ్ పర్ఫెక్ట్ గా ఉండాల్సిందే

శరీరం అందంగా ఉండాలంటే…

- Advertisement -

పర్ఫెక్టు లుక్స్ కోసం కొన్ని శరీర జాగ్రత్తలు తప్పనిసరిగా అనుసరించాలి. ముఖ్యంగా స్త్రీలు పాటించాల్సిన కొన్ని బాడీ కేర్ టిప్స్ ఉన్నాయి. వాటిల్లో ఒకటి మోచేతులు, మోకాళ్లపై ఏర్పడ్డ నలుపును పోగొట్టుకోవాలి. ఇందుకు బాగా పనిచేసే నేచురల్ టిప్పు ఒకటి ఉంది.

తాజా నిమ్మరసాన్ని నల్లగా ఉన్న మోచేయి, మోకాలు ప్రాంతంలో పిండి సున్నితంగా రుద్దాలి. తర్వాత ఇరవై నిమిషాల పాటు దాన్ని అలాగే ఉంచాలి. ఆ తర్వాత ఒక టవల్ తీసుకుని వేడి నీళ్లతో తడిపి మోచేయి, మోకాలు దగ్గర ఉన్న నల్లటి ప్రదేశంలో దానితో గట్టిగా స్క్రైబ్ చేయాలి. మ్రుదువైన చర్మం కోసం ఇంకొక వంటింటి చిట్కా ఉంది. ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, ఒక టేబుల్ స్పూన్ గ్లిజరిన్, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మూడింటినీ తీసుకుని వాటన్నింటినీ బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ఒక సీసాలో పోసి భద్రం చేయాలి. దీన్ని నిత్యం కొద్దిగా చర్మంపై రాసి అరగంటసేపు అలాగే ఉంచి ఆ తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడానికి పగలు వీలు కాకపోతే రాత్రి పడుకోబోయే ముందు కూడా ఈ చిట్కా పాటించవచ్చు. దీనితో చర్మం మ్రుదువుగా తయారవడమే కాకుండా ఎంతో కాంతివంతంగా ఉంటుంది.

వేళ్ల గోళ్ల దగ్గర పులిపిర్లు ఉంటే ఒక పచ్చి బంగాళాదుంప ముక్క తీసుకుని దాని రసాన్ని వాటిపై అప్లై చేయాలి. తర్వాత ఒక కాటన్ గుడ్డను తీసుకుని ఆ ప్రాంతంలో సున్నితంగా మసాజ్ చేయాలి. పది నిమిషాల తర్వాత ఆ ప్రదేశాన్ని నీళ్లతో శుభ్రంగా కడిగేయాలి. అలాగే కళ్లు ఉబ్బి చూడడానికి బాగుండవు. ఇలాంటి సందర్భంలో రోజ్ వాటర్ తీసుకని అందులో కాటన్ బాల్ ముంచి దాన్ని కళ్లపై పెట్టి ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత కొంచెం సేపు ప్రశాంతంగా పడుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్ల వాపులు తగ్గుతాయి. అలసిన కళ్లకు సాంత్వన కూడా లభిస్తుంది. మీ చర్మం పట్టులా కనిపించడానికి ఐదు టీస్పూన్ల ఆలివ్ ఆయిల్ తీసుకుని అందులో 50 గ్రాముల బొప్పాయి గుజ్జును వేసి పేస్టులా చేయాలి.  దాన్ని చర్మం పొడిబారిన చోట అప్లై చేయాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే మీ చర్మం మ్రుదువుగా తయారవుతుంది. అలాగే కళ్ల కింద ఏర్పడ్డ ముడతలు మీ ముఖంలో ఎక్కువ వయసు కనిపించేట్టు చేస్తాయి. ఇవి పోవాలంటే నేచురల్ మాస్కు ఒకటి ఉంది. మూడు టీస్పూన్ల పచ్చిపాలు, మూడు టీస్పూన్ల తేనె తీసుకుని ఆ రెండింటినీ బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని గోరువెచ్చగా చేయాలి. ఆ తర్వాత దాన్ని కళ్ల చుట్టూతా అప్లై చేసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.  అనంతరం గోరువెచ్చటి నీటితో ఆ ప్రదేశాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. కళ్ల చుట్టూ ఏర్పడ్డ ముడతలు పోగొట్టడంలో ఈ మాస్కు చక్కటి పరిష్కారం.

బాడీ కేర్ టిప్స్ లో వెంట్రుకల సంరక్షణ కూడా చాలా ముఖ్యం. వెంట్రుకలకు నేచురల్ కండిషనర్ ను అప్లై చేసుకుంటే శిరోజాలు నల్లగా నిగ నిగలాడతాయి. ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటాయి. ఇందుకోసం చల్లటి పచ్చి పాలు కొన్ని తీసుకోవాలి. స్నానం చేయడానికి ముందు ఈ పాలను జుట్టుకు అప్లై చేసుకోవాలి. ఈ పనిని స్ప్రే బాటిల్ సహాయంతో, లేదా చేతివేళ్లతో కూడా చేయొచ్చు. బ్రష్ ఉపయోగించవచ్చు. ఇలా జుట్టుకు పాలను అప్లై చేసిన తర్వాత 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత మీరు నిత్యం వాడే షాంపుతో తలను శుభ్రంగా రుద్దుకోవాలి. పాలు శిరోజాలపై నేచురల్ కండిషనర్ లా బాగా పనిచేస్తుంది. అంతేకాదు మీ జుట్టును మ్రుదువుగా, సిల్కీగా చేస్తుంది. శరీరానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్తత్తల్లో చర్మంపై ఏర్పడ్డ నల్లటి మచ్చలను లేకుండా చూసుకోవడం మరొకటి. నల్లటి మచ్చలు పోవాలంటే ఒక కప్పు పెరుగు, ఒక గుడ్డు తీసుకుని రెండింటినీ బాగా కలిపి మిశ్రమంలా చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖంపై, ముఖ్యంగా నల్లటి మచ్చలపై అప్లై చేసుకుని ఒక గంటపాటు అలాగే వదిలేయాలి. తర్వాత మీ ముఖాన్ని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల మీ చర్మం తాజాగా ఉండడంతోపాటు ముఖంపై ఏర్పడ్డ నల్లమచ్చలు కూడా తగ్గుతాయి. దీంతో చర్మం సహజ కాంతితో మెరుస్తుంది.

శరీరానికి సంబంధించి తరచూ ఎదుర్కునే సమస్యల్లో చుండ్రు ఒకటి. తలలో చుండ్రు పోగొట్టుకోవడానికి కూడా నేచురల్ టిప్పు ఉంది. మందారపువ్వు తీసుకుని దాన్ని మెత్తగా చేసి అందులోంచి జ్యూసు తీయాలి. ఆ జ్యూనును మాడుపై ముఖ్యంగా చుండ్రు ఉన్న ప్రదేశంలో అప్లై చేసి ఒకటి రెండు గంటల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో తలను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల తలలోని చుండ్రు సమస్య తగ్గుతుంది. పాదాలు, చేతులు నాజూగ్గా ఉండేలా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం ఒక అరకప్పు పెరుగు, అర టీస్పూను వెనిగర్ తీసుకుని రెండింటినీ బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని చేతులకు, పాదాలకు పట్టించి బాగా మసాజ్ చేసి ఐదు నుంచి పది నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. తర్వాత రెగ్యులర్ వాటర్ తో చేతులు, పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి. ఈ బాడీ స్కిన్ కేర్ టిప్స్ క్రమం తప్పకుండా అనుసరిస్తే మీరు అందంతో పాటు ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News