అది కలెక్టరేట్ కార్యాలయం.. ఆ కార్యాలయంలో 23 శాఖలకు చెందిన వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు సుమారు 900 మంది వరకు ఉండగా అలాగే నిత్యం కలెక్టరేట్ కార్యాలయానికి 2000 మంది దాకా సందర్శకులు వస్తుంటారు. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం నిర్మించిన ఆ కార్యాలయానికి చిన్నపాటి మరమ్మతులు కూడా ఇంత వరకు చేపట్టలేదు. దీంతో చిన్నపాటి వర్షానికే కలెక్టరేట్ కార్యాలయం అంతా చిత్తడిగా మారుతోంది. ఆ భవనం, ఈ శాఖలు అనకుండా అన్ని శాఖల భవనాల్లో ఇదే తంతు. ముఖ్యంగా డిఅర్డీఏ, డ్వామా, జేసీ చాంబర్ నుండి పశుసంవర్ధకశాఖకు వెళ్లే దారిలోని కార్యాలయాల్లో లీకేజీల అధికంగా ఉన్నాయి. డిఅర్డీఏ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి బాత్ రూమ్ కు వెళ్లగా స్లాబ్ పెచ్చలు ఊడి పడడంతో కొద్ది క్షణాల్లో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఇలాంటి శిథిలావస్థకు చేరిన కార్యాలయాలు కలెక్టరేట్లో చాలా వరకే ఉన్నాయి.
కలెక్టరేట్ లోని కొన్ని కార్యాలయాలకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టినప్పటికీ యధావిధిగా లీకేజీలు ఉండటంతో ఉద్యోగులు అక్కడ పనిచేయలేకపోతున్నారు. అలాగే కార్యాలయంలో ఉండే కరెంటు తీగలు కూడా అస్తవ్యస్తంగా ఉండటంతో ఆ కరెంటు తీగల్లోకి నీరు ఇంకుతే మొత్తం కలెక్టరేట్ అంతా కరెంటు వ్యాపించే అవకాశం లేకపోలేదు ఇదే ఘటన జరిగితే కలెక్టరేట్లో ఉండే ఉద్యోగులతో పాటు, సందర్శకులు పిట్టల్లా రాలిపోతారు.
అలాగే కలెక్టరేట్ కార్యాలయం పైన పిచ్చి మొక్కలు, చెత్తాచెదారంతో నిండి ఉండటంతో వర్షపు నీరు కిందికి పోలేక కార్యాలయం పైన నీటి మడుగులను తలపిస్తున్నాయని ఆయా కార్యాలయ ఉద్యోగులు వాపోతున్నారు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే కలెక్టరేట్ కార్యాలయాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు.
జిల్లాకు నూతనంగా వచ్చిన కలెక్టర్ డాక్టర్ జి సృజన బాధ్యతలు చేపట్టిన వెంటనే కలెక్టరేట్ కార్యాలయం శుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ కలెక్టరేట్ కార్యాలయంలో లోపల, బయట ఎటువంటి అపరిశుభ్రతకు తావులేకుండా చర్యలు చేపట్టింది. అంతేకాకుండా ఒక్కొక్క బ్లాకు ఒక్కో ఉన్నతాధికారికి కేటాయించి కలెక్టరేట్ కార్యాలయం పరిశుభ్రంగా ఉండేలా జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టారు. కలెక్టరేట్ కార్యాలయాన్ని ఆధునికరించాలని గత నెలలో కలెక్టర్ సూచన మేరకు కలెక్టరేట్ కార్యాలయాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్వయంగా పరిశీలించి కార్యాలయ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
శిథిలావస్థకు చేరుకున్న భవనాలను తొలగించి కలెక్టరేట్ ముందు భాగం, సునయన ఆడిటోరియంను అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ఆర్కిటెక్ట్ వేణుగోపాల్ తో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించారు మంత్రి బుగ్గన. అనంతరం తాత్కాలిక మరమ్మత్తుల కోసం 8 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు చెబుతున్నప్పటికీ ఆ నిధులు కలెక్టరేట్ కార్యాలయ సుందరీకరణకు, మరమ్మత్తులకు ఏ మూలకు సరిపోతాయో, లేదో అధికారులు నెగ్గు తేల్చాల్సి ఉంది.