అక్టోబరు 2వ తేదీ నుండి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ నిర్వహించ తలపెట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో సుమారు 3లక్షల మ్యాచ్ లను నిర్వహించేలా అవసరమైన సన్నాహక ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి వెల్లడించారు. ఈమేరకు విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ‘ఆడుదాం ఆంధ్ర’పై సిఎస్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి ఎపెక్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర ద్వారా ముఖ్యంగా ఐదు అంశాల్లో అనగా క్రికెట్, బాడ్మింటన్,వాలీబాల్,కబడ్డి, కోకో క్రీడల్లో సుమారు 3 లక్షల మ్యాచ్లను నిర్వహించనున్నట్టు తెలిపారు.వీటికి అదనంగా 3 వేల మారథాన్,యోగా, టెన్నికాయిట్ ఈవెంట్లను కూడా నిర్వహిస్తామన్నారు.
ఆయా అంశాల్లో రాష్ట్ర స్థాయిలో 250 మ్యాచ్లు, 26 జిల్లాల్లో 312 మ్యాచ్లు,175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5250 మ్యాచ్ లు,680 మండలాల్లో లక్షా 42వేల మ్యాచ్లు,గ్రామ,వార్డు సచివాలయాల స్థాయిలో లక్షా 50 వేల మ్యాచ్ లను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు సిఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు.
నాకౌట్ విధానంలో గ్రామ,వార్డు స్థాయి క్రీడలను 7 రోజుల పాటు,మండల పోటీలను 16 రోజులు,నియోజకవర్గ స్థాయిలో 9 రోజులు,జిల్లా స్థాయిలో 9 రోజులు, రాష్ట్ర స్థాయిలో ఫైనల్స్ 5 రోజుల పాటు నిర్వహించేలా కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి వెల్లడించారు.
క్రికెట్,వాలీబాల్,కబడ్డి, కోకో క్రీడల్లో నియోజకవర్గ స్థాయిలో ప్రథమ,ద్వితీయ,తృతీయ విజేతలకు వరసగా 35 వేల రూ.లు,15వేలు,5వేల రూ.ల నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తామన్నారు. జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ,తృతీయ పోటీ విజేతలకు వరసగా 60 వేల రూ.లు,30వేల రూ.లు,10 వేల రూ.లు అందించనున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ, ద్వితీయ,తృతీయ విజేతలకు వరసగా 5 లక్షల రూ.లు,3 లక్షలు,2 లక్షల రూ.లను ఇవ్వనున్నారని తెలిపారు. అదే విధంగా బాడ్మింటన్ కు సంబంధించి నియోజకవర్గ స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ పోటీల విజేతలకు వరసగా 20 వేలు,10 వేలు,5వేలు, జిల్లా స్థాయిలో వరుసగా 35 వేలు,20 వేలు,10 వేల రూపాయలను అందించనున్నారు. రాష్ట్ర స్థాయి విజేతలకు వరసగా 2 లక్షలు,1లక్ష రూ.లు,50 వేల రూపాయల నగదు ప్రోత్సాహకాలను, షీల్డులను బహూకరిస్తారని సిఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో వివిధ ప్రముఖ క్రీడాకారులు అంబటి రాయుడు, కరణం మల్లేశ్వరి, పివి సింధు, డి.హారిక, శ్రీకాంత్, వి.జ్యోతి సురేఖ వంటి క్రీడాకారులను స్పోర్ట్స్ అంబాసిడర్లుగా భాగస్వాములుగా చేసేందుకు వారితో వ్యక్తిగతంగా మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ క్రీడల శాఖ అధికారులను ఆదేశించారు. క్రీడలను పాఠ్యాంశాల్లో ఒక భాగంగా చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆదిశగా చర్యలు చేపట్టడం జరిగుతుందని సిఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు.
అనంతరం 2023-28 క్రీడా విధానంపై సిఎస్ ఈఎపెక్స్ కమిటీ సమావేశంలో చర్చించారు.ముఖ్యంగా మండల స్థాయిలో కనీసం 5 ఎకరాల విస్తీర్ణం కలిగిన పాఠశాలల్లో క్రీడా పరమైన మౌలిక సదుపాయాల కల్పనకు వెంటనే అలాంటి పాఠశాలను గుర్తించి తగిన ప్రతిపాదనలు సిద్దం చేయాలని సిఎస్ జవహర్ రెడ్డి క్రీడలు,విద్యా శాఖలో అధికారులను ఆదేశించారు.ఇంకా స్కూల్ గేమ్సు తదితర అంశాలపై సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అధికారులతో చర్చించారు. అంతకుముందు రాష్ట్ర యువజన సర్వీసులు,క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ మోహన్ ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలపై రూపొందించిన కార్యాచరణ నివేదికను, నూతన క్రీడా విధానం గురించి వివరించారు.
ఈసమావేశంలో రాష్ట్ర విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్,సాప్ ఎండి హర్ష వర్ధన్, బిసి సంక్షేమ శాఖ కమిషనర్ అర్జునరావు,గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ మురళి,రాష్ట్ర సమాచార శాఖ అదనపు డైరెక్టర్ ఎల్.స్వర్ణలత, యువజన సంక్షేమ శాఖ డైరెక్టర్ శారదా దేవి,అదనపు సిసిఎల్ఏ ఇంతియాజ్ తదితర అధికారులు పాల్గొన్నారు. అలాగే వీడియో లింక్ ద్వారా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కృష్ణబాబు,బి.రాజశేఖర్, ముఖ్య కార్యదర్శులు శ్యామల రావు, జయలక్ష్మి పాల్గొన్నారు.