Saturday, October 5, 2024
Homeనేషనల్Nirbhaya Case: యావత్ దేశాన్ని కదిలించిన నిర్భయకు పదేళ్లు.. కానీ మార్పెక్కడ?

Nirbhaya Case: యావత్ దేశాన్ని కదిలించిన నిర్భయకు పదేళ్లు.. కానీ మార్పెక్కడ?

Nirbhaya Case: భారతదేశంలో ప్రతి ఒక్కరిని కదిలించి కన్నీళ్లు పెట్టించిన ‘నిర్భయ’ ఘటనకు సరిగ్గా నేటితో పదేళ్లు పూర్తయింది. ఇన్నేళ్ళైనా ఆ నాటి రాత్రి నిర్భయ అనుభవించిన నరకాన్ని ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు.. మానవ మనుగడ ఉన్నంతకాలం ఆ ఘటనను మర్చిపోలేరు కూడా. అంత క్రూరాతి క్రూరంగా నిర్భయకు నరకం చూపించి చంపేశారు. ఈ ఘటన యావత్ భారతావని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఈ కేసు పార్లమెంట్ ను కుదిపేయడంతో ఓ చట్టమే చేశారు.

- Advertisement -

పారామెడికల్‌ స్టూడెంట్ అయిన నిర్భయ 16వ తేదీ అర్ధరాత్రి తన స్నేహితుడితో కలిసి ఓ ప్రైవేట్ బస్సు ఎక్కింది. అందులో ఉన్న ఆరుగురు కామాంధులు స్నేహితుడిని తీవ్రంగా కొట్టి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బస్సు ఢిల్లీ వీధుల్లో తిప్పుతూ ఒకరి తర్వాత ఒకరు ఆ అమాయకురాలిపై పైశాచికంగా లైంగిక దాడికి పాల్పడారు. జననాంగాల్లో ఇనుప రాడ్డులు జొప్పించడంతో బాధితురాలి పేగులు చిధ్రమయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో విలవిల్లాడుతున్న ఆమెను ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డపై విసిరేసి పరారయ్యారు.

ముందుగా ఢిల్లీలో చికిత్స పొందిన నిర్భయను ఆ తర్వాత సింగపూర్‌‌ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. దేశ రాజధానిలో జరిగిన ఈ ఘోర ఘటన దేశం మొత్తాన్ని కదిలించింది. దేశ నలుమూలలా ఆందోళనలు, ర్యాలీలు ఒక ఎత్తయితే ఢిల్లీ వేదికగా సాగిన పోరాటం మరో స్వాతంత్య్ర సంగ్రామాన్ని తలపించింది. ఈ ఉద్యమానికి యువతే మార్గనిర్దేశం చేసింది. అనేక యూనివర్సిటీలు, కాలేజీల నుంచి వేల సంఖ్యలో వచ్చిన యువతీ యువకులు ఇండియాగేట్‌పై దండెత్తారు. భారతదేశ చరిత్రలోనే తొలిసారి రాష్ట్రపతి భవన్‌ను ముట్టడించిన ఘటన ఇదే.

అమాయకపు అబలలపై జరుగుతున్న దాడులకు అడ్డుకట్ట వేయాలని..నిర్భయ లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదని నాటి యూపీఏ ప్రభుత్వం నిర్భయ పేరుతో చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ.. ఎన్ని చట్టాలు తెచ్చినా మృగాళ్లలో మార్పు కనిపించడం లేదు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారత్‌లో రోజుకు సగటున 90 అత్యాచార కేసులు నమోదవుతున్నాయంటే ఇక్కడ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అత్యాచార కేసుల సంఖ్య పెరుగుతున్నా ఈ కేసుల్లో నిందితులలో చాలా తక్కువమందికి శిక్షలు పడుతున్నాయి.

ఎన్ని చట్టాలు తెచ్చినా.. కఠిన శిక్షలు విధించినా మార్పు శూన్యం. మహిళలపై
దాడులు, అత్యాచారాలు ఎప్పటిలానే కొనసాగుతున్నాయి. అయితే, నిర్భయ ఘటన తర్వాత లైంగిక వేధింపుల గురించి, అత్యాచారాల గురించి బాధితులు ఇప్పుడు ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. గతేడాది దేశ రాజధాని దిల్లీలో సగటున రోజుకు ఇద్దరు మైనర్లు అత్యాచారానికి గురైనట్లు నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ పేర్కొంది. 2021లో దిల్లీలో మహిళలపై 13వేలకు పైగా నేరాలు జరిగగా.. 2020తో పోలిస్తే ఇది 40 శాతం ఎక్కువ. రెండు రోజుల క్రితం కూడా 17 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడి జరగడం మన సమాజ పరిస్థితికి అడ్డం పడుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News