రాజుల్ మత్తుల్ వారి సేవ నరకప్రాయంబు అంటూ నిందాస్తుతి చేశాడు. మధ్యయుగాలలోని ఓ ప్రబంధ కవి. రాజును రాజరికాన్ని, రాజ్యంలోని స్థితిగతులను రాజుల ముందు పొగిడి వారి మెప్పుపొందే అవకాశం వున్నా, వాస్తవాన్ని వాస్తవంగా చెప్పే ధైర్యం కొద్దిమందికే వుంటుంది. అలాంటివారిలో మరొక ప్రసిద్ధ కవి బమ్మెర పోతన. నేటి వరంగల్లు నాటి ఓరుగల్లు కేం ద్రంగా చేసుకొని పాలించిన కాకతీయుల కాలం నాటి వాడే ఐనా రాజులు ఇచ్చే అగ్రహారాలు, వజ్రపు హారాలు వదులుకొని కవిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని ఎవరిపరo చేయ కుండా సత్కవుల్ హాలికులైన నేమి? అంటూ తనకున్న భూ మిని సేధ్యం చేసుకుంటూ కవితా సేధ్యాన్ని చేసి భాగవతం రచించి చిరకీర్తిని పొందాడు. పైన చెప్పినట్లుగా మొదటి వ్యక్తి (దూర్జటి) రాజుల యొక్క ఆస్థానంలో వుంటూ రాజు ద్వారా కల్పించబడిన విలాసాలు, ఉన్నతమైన గౌరవాన్ని పొందినప్పటికి, రాజు నిజస్వరూపాన్ని నిందిస్తూ చెప్పటం అంటే ఆ కాలంలో గొప్ప విషయం కాకపోతే ఏంటి?
ఇక మధ్యయుగాల విషయం పక్కనపెడ్తే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఒకసారి అవలోకిద్ధాo స్వాతంత్య్రానికి పూర్వం దేశాన్ని సంస్థానాదీషులు పరిపాలించారు. అలానే ఎక్కువ ప్రాంతాన్ని బ్రిటిష్ వారు పాలించారు. వెరసి పాలకులు ఎవరైనా సామాన్య ప్రజానికంపై పన్నుల భారం మోపడం, ప్రజల్ని హింసించటం, ప్రశ్నిస్తున్న కవులను, కళాకారులను, ఉద్యమకారులను అకారణంగా జైల్లో బంధించి చిత్రహింసలు పెట్టడం లేదా ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేసి భవిష్యత్తులో ఎవరు తమ పాలనను, అధికారాలను ప్రశ్నించకుండా ఉండాలని చీకటి కారాగారాల్లో లేదా బహిరంగంగా ఉరివేసేవారు. సరిగ్గా అదే లక్షణాలు పునికిపుచ్చుకున్న రాజు నిజాం. దక్కన్ ప్రాంతాన్ని గోల్కొండ కేంద్రంగా పాలన సాగిస్తూ ఆనాడు చేసిన అరాచకాలు, దురాగతాలు అన్ని ఇన్ని కావు అలాం టి వారిని ప్రశ్నించటం అన్నా వారి పాలనకు వ్యతిరేకంగా గొంతు వినిపించటం అన్నా ప్రాణాలను తెగిస్తేనే తప్ప ఇంకొకటి సాధ్యం కాదు, అలాంటి కోవకు చెందినవారే దాశరధి కృష్ణమాచార్యులు. నిజాం ఉక్కు పిడికిట్లో బంధీ ఐన తెలంగాణ సమాజాన్ని, తనతోటి ప్రజల ఆర్తనాదాన్ని, ఆకలికేకలను, స్వయంగా చూసి చలించి ఉక్కు పిడికిలి బిగించి జంగుసైరనూదినాడు. నిజాం రాజు తనను నిజామాబాద్ జైలులో బందిస్తే జైలు గోడలపై బొగ్గుతో నిజాంకు వ్యతిరేకంగా ఓ నిజాం పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకేన్నడేని అంటూ నిరసన గళం వినిపించి విప్లవ శంఖం ఊదినాడు. అలాంటి దిక్కార మరియు తిరు గుబాటు కవి రచించిన అగ్నిధార కవితా ఖండికలోని కొన్ని సాహిత్య విషయాలు మరికొన్ని చారిత్రక వాస్తవాలు తెల్పుకుందాం …
ఇది నిదాఘము; ఇందు సహింపరాని
వేడి యేడ్పించుచున్నది; పాడువడిన
గోడలందున జైలులో పాడినాడ
వాడిపోనున్న పూమొగ్గపైన పాట;
ఆయాసపడు జైలులో యెన్ని ప్రజల రా
జ్యము లున్నవో! యని యరసినాను;
నిరుపేదవాని నెత్తురు చుక్కలో నెన్ని
విప్లవాలో! యని వెదకినాను;
నిజాం నిరంకుశత్వాన్ని ప్రశ్నించినందుకు ప్రతీకారం గా ఇందూరు జైలులో (నిజామాబాద్ పూర్వనామం) బం ధీ చేస్తాడు దాశరధి గారిని, బంధీ అయినది శరీరమే కానీ మనస్సు కాదంటూ నిప్పులు చెరిగే కవిత్వాన్ని బొగ్గుతో గోడలపై వ్రాసి నన్ను బంధిస్తే తన గళం ఇంకా పదునెక్కు తుందని గొంతుచించుకొని అరిచాడు. జైలులోని పరిస్థితు లను వివరిస్తు సహింపరాని వేడి ఏడ్పిస్తు ఉండగా, పాడు బడిన గోడలు, మొత్తుకున్నాను, ఎడ్చాను నా స్వేచ్ఛకు ఆంక్షలు విధించిన ఓ నిజాం పిశాచమా నన్నే నువ్వు బంధీని చేస్తే సామాన్యులు పరిస్థితి ఏమిటి? నిరుపేద వాని నెత్తురు చుక్కలో ఎన్ని విప్లవాలో అని వెదికాను అంటూనే వెన్నెలలు లేవు, పున్నమకన్నే లేదు, పైడి వెన్నెల నెలవంక జాడలేదు, చుక్కలే లేవు, ఆకాశ శోకవీధి, ధూమదామమ్ము దు:ఖ సంగ్రామ భూమి. అంటూ తెలంగాణ ప్రాంతం మొత్తం చీకట్లో ఉన్నట్లుగా, యుద్ధ భూమిని తలపిస్తున్న ట్లుగా వుంది అంటూ జైలులోనే నిరసన గళం వినిపించి నిరసన వ్యక్తం చేశాడు.
ఓసి కూలిదానా! అరుణోదయాన
మట్టి తట్ట నెట్టిన బెట్టి మరుగులేని
యెత్తు రొమ్మును పొంగించి యెందుకొరకు
ఉస్సురనెదవు? ఆకాశ ముడికిపోవ?
పై వాక్యాలు చార్మినారు పరిసరాలలో రాతికట్టడాల నిర్మాణ సమయములో ఓ మహిళా కూలిని చూసి చలించి వ్రాసిన ఉస్సురనెదవు కవితలోని వాక్యాలు అవి. హైదరా బాద్ నగర నిర్మాణంలో పాలమూరు కూలీల శ్రమ వెల కట్టలేనిది. ఇప్పుడు మనకు భౌతికంగా కనిపిస్తున్న అనేక కట్టడాలు వారి శ్రమతో రూపుదిద్దుకొన్నవే. నాకు ఈ కవిత ను చదవగానే శ్రీశ్రీ గారి దేశ చరిత్రలు కవితలోని నైలునది నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది? తాజ్ మహాల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరు? అన్న వాక్యాలు గుర్తుకు వచ్చాయి. వాస్తవంగా తాజ్ మహాల్ నిర్మాణం (1632-1653) జరిగింది, కానీ 1590 లోనే చార్మినార్ నిర్మాణం జరిగిందనేది చరిత్ర చెప్పిన సత్యమే అలానే దీని నిర్మాణంలో కూడా పాలమూరు కూలీల శ్రమదాగి వుంద నేది కాదనలేని వాస్తవం. ఇక్కడ దీనికి సంబంధించిన విషయం మరొకటి ప్రస్తావించాలి. అలిశెట్టి ప్రభాకర్ గారు వలస కూలీలను ఉద్దేశించి నాలుగు మాటల్లోనే గొప్ప అర్ధం దాగి ఉండేలా పార్లమెంట్ భవనమైన పాలరాతి బొమ్మైన వాడు కడితేనే ఆకారం, వాడు చుడితేనే శ్రీకారం అంటాడు దీనిని బట్టి వలస కార్మికుల నైపుణ్యం ఎలాం టిదో అర్ధం చేసుకోవచ్చు.
అనాదిగా సాగుతోంది
అనంత సంగ్రామం
అనాధుడికి, ఆగర్భ
శ్రీనాధుడికీ మధ్య.
సేద్యం చేసే రైతుకు
భూమి లేదు, పుట్రలేదు
రైతుల రక్తం త్రాగే
జమీందార్ల కేస్టేట్లు
అనంత సంగ్రామం శ్రీర్షికతో వున్న కవితలోని వాక్యాలు అవి. యుద్ధం ఇంకా మిగిలేవుంది అన్నట్లుగా ఆదిమ కాలం నుండి నేటి ఆధునిక కాలం వరకు అనేక సంఘర్షణలకు పరిష్కారం లభించట్లేదు, పెద్దచేప చిన్న చేపను మింగుతున్నట్లుగా, వున్నవాడు లేనివాడిని దోచు కుంటే, కర్షకుడికి భూమి లేకుండా, విలాసంగా గడిపే వారికి వందల ఎకరాలు (ఎస్టేట్లు) వుంటే తప్పకుండా సంగ్రామం లేదా సంఘర్షణ మొదలైతది ఇది చరిత్ర చెప్పిన వాస్తవిక రూపమే.
ఇదే మాట ఇదే మాట
పదే పదే అనేస్తాను
ఖదo తొక్కి పదం పాడి
ఇదే మాట అనేస్తాను.
దగాకోరు బటాచోరు
రజాకారు పోషకుడవు.
వూళ్ళ కూళ్ళు అగ్గిపెట్టి
ఇళ్ళన్నీ కొల్లగొట్టి
తల్లి పిల్ల కడుపుకొట్టి
నిక్కిన దుర్మార్గమంత
దిగిపోవోయ్ తెగిపోవోయ్
తెగిపోవోయ్ దిగిపోవోయ్
ఇదే మాట ఇదే మాట
పదే పదే అనేస్తాను.
అగ్నిధార కావ్యoలోని చివరి కవిత ఇది పదే పదే అనేస్తాను శీర్షికతో వున్న కవితలోనివి పై వాక్యాలు అవి. ఈ కవితను చదివితే శ్రీశ్రీ గారి జగన్నాధుని రధచక్రాలు కవిత గుర్తుకు వచ్చింది. లయబద్ధంగా అలానే వున్నట్లని పించింది. చరిత్రలో నియంతలు హిట్లర్, ముస్సోలిని, ఘజనీలు, ఘోరీలు, ఎంతోమంది కాల గర్భంలో కలిసి పోయారు నువ్వేంత నీకుపోయే కాలం వచ్చింది, అందుకే ఈ మాట పదే పదే అనేస్తాను. ఇక చాలు నీ అసమర్ధ పాలన అంటూ కడిగిపారేశారు ఈ కవితలో. కవి ఎప్పుడు పాలకపక్షం కాకుండా ప్రజలపక్షం నిలబడాలి, అన్నార్తుల వైపు, అనాధల వైపు, ఆకలి కేకల వైపు నిలబడాలి, పాల కులు ఎరగావేసే పదవులకు, తాయిలాలకు ఆశపడకుండా నిక్సాన, నిష్కల్శశమైన వ్యక్తిత్వం కల్గి ఉండాలనేది నా అభిప్రాయం. శ్రీశ్రీ మరియు దాశరధి గారు ఇద్దరు సమ కాలికులే ఐనప్పటికి వీరి కవిత్వమే వీరిద్దరిని పతాక స్థాయి కి చేర్చింది, అందుకు ఉదాహరణే తిమరంతో సమరం రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావటం. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూనే కోట్ల మంది వైపు నిలబడి నిజాం నిరంకుశత్వాన్ని ప్రశ్నించిన ధీరుడు దాశరధి.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఊరు ఊరునా వాడవాడలా అగ్నిధార కావ్యంలోని వాక్యాలు తెలంగాణ సమాజంలోని ప్రతి గొంతుకను పిడికిలెత్తి అరిచేలా చేసింది. స్వరాష్ట్రం సిద్ధించాక దాశరధి పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా లబ్ది ప్రతిష్టులకు అవార్డులు ఇచ్చి సన్మానించి దాశరధి గారి కీర్తిని దశదిశలా వ్యాపింప జేస్తోంది ప్రభుత్వం అధికారికంగా.
డాక్టర్ మహ్మద్ హసన్
సహాయ ఆచార్యులు
9908059234.
Poor C/o movements: పేదవాని నెత్తురు చుక్కలో ఎన్ని విప్లవాలో
ఓ నిజాం పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకేన్నడేని