ఉత్తర కేరళలోని కోళికోడ్ నగరంలో గత జూలై 15న మార్క్సిస్టు పార్టీ యూనిఫామ్ సివిల్ కోడ్‌కు వ్యతిరేకంగా ఒక పెద్ద సెమినార్ నిర్వహించింది. దేశవ్యాప్తంగా సుమారు 12 వేల మంది నాయకులు ఈ సెమినార్ కు హాజరయ్యారు. ఈ అంశంపై మార్క్సిస్టు పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన సదస్సుల్లో ఇది మొదటిది. మార్క్సిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి ఈ సదస్సును ప్రారంభిస్తూ, హిందువులు, ముస్లింల మధ్య విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటోందని, లౌకికవాద, ప్రజాస్వామిక గణతంత్ర భారతదేశాన్ని ఒక అసహన ఫాసిస్ట్ హిందుత్వ దేశంగా మార్చడానికి ప్రయత్నిస్తోందని తీవ్రంగా ఆరోపించారు. ఆ మరునాడు సి.పి.ఐ(ఎం) అధికార వార్తాపత్రిక ‘దేశాభిమాని’ తాము ఈ ప్రయత్నాన్ని ఐక్యంగా ఎదుర్కుంటామనే శీర్షికతో ఏడు కాలాల వార్త రాసింది.
నిజానికి, ఈ సెమినార్ ఘోరంగా విఫలం అయింది. ఈ సెమినార్ లో పలువురు మార్క్సిస్టు పార్టీ నాయకులు, ఈ పార్టీ నాయకత్వంలో కేరళలో అధికారంలో ఉన్న ఎల్.డి.ఎఫ్ నాయకులు కూడా ఎక్కడా కనిపించలేదు. ఇక ఈ సెమినార్ లో పాల్గొన్న కొందరు ముస్లిం మహిళా నాయకులకు వేదిక మీద స్థానం కల్పించలేదు. ముస్లిం మహిళా నేతలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు. యూనిఫామ్ సివిల్ కోడ్ కారణంగా ఇబ్బంది పడేది ఎక్కువగా ముస్లింలు, ముస్లిం మహిళలే అయినప్పటికీ వారిని దూరం పెట్టడం ఆశ్చర్యం కలిగించింది. సీపీఎం కేంద్ర సమితి సభ్యుడు, ఎల్.డి.ఎఫ్ కన్వీనర్ అయిన ఇ.పి. జయరాజన్ ఈ సెమినార్ లో పాల్గొనలేదు. ఎల్.డి.ఎఫ్ లో అతి ప్రధానమైన భాగస్వామి అయిన సి.పి.ఐ నాయకులను కూడా సెమినార్ కు ఆహ్వానించలేదు. ఇందులో జయరాజన్ రాష్ట్రంలో లేరు. కాగా, ఎల్.డి.ఎఫ్ సమావేశంలో మార్క్సిస్టు పార్టీ ఈ అంశం గురించి చర్చించనే లేదని సి.పి.ఐ నాయకులు స్పష్టం చేశారు.
గత జూన్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్ లో బూత్ స్థాయి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మొదటిసారిగా ప్రస్తావించారు. దీనవల్ల దేశంలోని మహిళలందరికీ సమానహక్కులు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఈ అంశం మీద చర్చలు ప్రారంభమయ్యాయి. కాగా, దేశవ్యాప్తంగా మార్క్సిస్టు పార్టీ నాయకులు దీనిని అవకాశంగా తీసుకుని ముస్లింలకు చేరువ కావాలని, 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో దీనిని ఒక రాజకీయ అంశంగా చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ యూనిఫామ్ సివిల్ కో్‌డ ముసాయిదా ఇంకా వెలుగు చూడనప్పటికీ, కేరళలోని మార్క్సిస్టు పార్టీ నాయకులు దీనిపై చర్చలు, సదస్సులు నిర్వహించడం జరుగుతోంది. దీనివల్ల ముస్లింల ఉనికి ప్రమాదంలో పడిందని, వారిని దీని నుంచి కాపాడగలిగేది మార్క్సిస్టు పార్టీ మాత్రమేననే ప్రచారం కూడా జరుగుతోంది.
విచిత్రమేమిటంటే, మార్క్సిస్టు పార్టీకి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఒక ప్రధానమైన మిత్రపక్షం. ఈ పార్టీని సెమినార్ కు ఆహ్వానించడం కూడా జరిగింది. అయితే, ఈ పార్టీ ఆ ఆహ్వానాన్ని నిర్మొహమాటంగా తిరస్కరించింది. కేరళలో హిందువులు, ముస్లింల మధ్య మైత్రీ సంబంధాలను పెంచి పోషిస్తున్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ చాలా ఏళ్లుగా మార్క్సిస్టు పార్టీకి మిత్ర పక్షంగా ఉంటోంది. ఈ పార్టీ కొంత కాలం పాటు ఎల్.డి.ఎఫ్ ప్రభుత్వంలో కూడా కొనసాగింది. ఇంతకన్నా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, మొదటి నుంచి మార్క్సిస్టు పార్టీకి కొండంత అండగా ఉండడమే కాకుండా, పునాదుల నుంచి పార్టీని పటిష్ఠం చేసిన కేరళ మాజీ ముఖ్యమంత్రి ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్ 1986లో అనేక సభలు, సమావేశాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ ను సమర్థిస్తూ ప్రసంగాలు చేశారు. దాంతో ప్రస్తుత మార్క్సిస్టు పార్టీ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. అంతేకాదు, ఆయన హిందువుల ఓట్లను ఆకట్టుకోవడానికి షరియాను తిరస్కరించడం కూడా జరిగింది.
ఈ సెమినార్ కు మార్క్సిస్టు పార్టీ ‘సమస్త’ అనే సంస్థను ఆహ్వానించింది. ఈ సంస్థ కేరళలో ఒక సున్నీ-షఫీ సంస్థ. ఈ ప్రయత్నం బెడిసికొట్టింది. ఈ సంస్థ మహిళల హక్కులకు పూర్తి వ్యతిరేకి. ఈ సంస్థను సెమినార్ కు ఆహ్వానించడం ఎవరికీ నచ్చలేదు. సెమినార్ లో ముస్లిం మహిళలకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై పలు ముస్లిం సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మార్క్సిస్టు పార్టీ నాయకులకు ముస్లిం నాయకులే తప్ప ముస్లిం మహిళలు పట్టడం లేదని అవి ఆరోపించాయి. యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మోదీ ప్రస్తావించిన వెంటనే ముస్లింలను వెనకేసుకు వచ్చిన మార్క్సిస్టు పార్టీకి ఈ సెమినార్ ప్రయత్నం కలిసి వచ్చినట్టు లేదు.
Failure Seminar: పని చేయని ప్రయత్నం
యూనిఫామ్ సివిల్ కోడ్ ను సమర్థిస్తూ ప్రసంగాలు చేసిన నంబూద్రిప్రాద్