Agni V missile: భారత రక్షణ శాఖ అగ్ని–5 క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. అణు సామర్ధ్యం కలిగిన ఈ క్షిపణిని ప్రయోగించడం ఇది తొమ్మిదోసారి. అయితే, ఈసారి రాత్రిపూట పరీక్ష నిర్వహించినట్లు, ఈ పరీక్ష విజయవంతమైనట్లు కేంద్ర రక్షణ శాఖ తెలిపింది.
కాగా, చైనాతో సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డ వేళ ఇండియా ఈ ప్రయోగం నిర్వహించం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత సత్తాను తెలియజేసేలా ఒడిశా తీరం నుంచి ఈ క్షిపణిని ప్రయోగించింది భారత రక్షణశాఖ. ఇది అణ్వాయుధాలను మోసుకెళ్లగలదు. ఈ క్షిపణి 5,400 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని చేధించగలదు. అంటే ఆసియా ఖండం మొత్తం దీని పరిధిలోకి వస్తుంది. చైనాలోని ఉత్తర ప్రాంతంతోపాటు యూరప్‌లోని కొంత ప్రాంతం కూడా ఈ క్షిపణి పరిధిలోనే ఉంటుంది.
ఇది 1.5 టన్నుల బరువు కలిగిన అణ్వాయుధాల్ని మోసుకెళ్లగలదు. భారత అణు సామర్ధ్యాన్ని పెంచే లక్ష్యంతోనే దీన్ని అభివద్ధి చేశారు. మొదటిసారి ఈ క్షిపణిని 2012లో ప్రయోగించగా, చివరగా గత ఏడాది అక్టోబర్‌లో ప్రయోగించారు. త్వరలో దీనికి సంబంధించిన సబ్‌మెరైన్ వెర్షన్ ‘కే–5’ కూడా అందుబాటులోకి రానుంది. సరికొత్త టెక్నాలజీ, ఎక్విప్‌మెంట్‌తో ఈ క్షిపణిని తయారు చేసింది రక్షణ శాఖ.