జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రోజుల దగ్గర పడ్డాయని తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజలే ఆయనకు ఉద్వాసన పలకడం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క రైతు మీద రూ. 2.4 లక్షల రూపాయల రుణ భారం పడేసిందని, రాష్ట్రంలో రైతులు అతి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి
రైతుల గోడు కానీ, సామాన్య ప్రజల గోడు కానీ ఏమాత్రం పట్టడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
వ్యవసాయ రంగం రానురానూ సంక్షోభంలో కూరుకుపోతోందని, ఈ సంక్షోభానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం మరి కొంత కాలం కొనసాగితే రైతులు ఇక జీవితంలో కోలుకోలేరని, వ్యవసాయ రంగం మామూలు స్థితికి రావడానికి ఎంత కాలం పడుతుందో కూడా చెప్పలేమని చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాభావం వల్ల రైతు జీవితం క్రమంగా దుర్భరమవుతున్నప్పటికీ, ప్రభుత్వం రైతులను ఆదుకునే ప్రయత్నం చేయకపోవడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. వ్యవసాయ సంక్షోభం మీద ప్రభుత్వం వెంటనే ఒక శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈసారి తమ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని అంటూ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్నదాత పథకం కింద ఒక్కో రైతుకు 20 వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని ఆయన ప్రకటించారు.