అమెరికాకు చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ S2 ఇంటిగ్రేటర్స్ మహబూబ్ నగర్ ఐటీ టవర్ లో సాఫ్ట్‌వేర్ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ఆ సంస్థకు చెందిన ప్రతినిధులు శ్రీకాంత్ లింగిడి, శ్రీనివాసన్ సంతాన… రాష్ట్ర మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తో హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో సమావేశమయ్యారు. మహబూబ్‌నగర్‌లో 100 మందికి సాఫ్ట్ వేర్ ఉద్యోగ అవకాశాలను కల్పించేలా పరిశ్రమను త్వరలో నెలకొల్పుతామని వారు వెల్లడించారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని… స్థానికంగా అర్హత కలిగిన యువతకు ఉద్యోగాల్లో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి డా వి శ్రీనివాస్ గౌడ్ అమెరికా ప్రతినిధులను కోరారు. కచ్చితంగా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు ప్రాధాన్యత ఉంటుందని ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులను మంత్రి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పట్నం నరేందర్ రెడ్డి, అబ్రహం, బొల్లం మల్లయ్య యాదవ్ ఉన్నారు.
అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువలో…
అంతర్జాతీయ విమానాశ్రయానికి అందుబాటులో ఉండడం, జాతీయ రహదారులు, స్థానికంగా సౌకర్యాలు అద్భుతంగా ఉండటం వల్ల మహబూబ్ నగర్ ఐటీ టవర్ లో తమ సాఫ్ట్వేర్ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు S2 ఇంటిగ్రేటర్స్ సంస్థ ప్రతినిధి శ్రీకాంత్ లింగిడి తెలిపారు. అమెరికాకు చెందిన అనేక సాఫ్ట్వేర్ పరిశ్రమలు సైతం ఇక్కడ సంస్థలను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆయన వివరించారు.
మహబూబ్ నగర్ కు ఉజ్వల భవిష్యత్తు…
- మంత్రి డా వి శ్రీనివాస్ గౌడ్
ఒకప్పుడు మహబూబ్ నగర్ అంటే కనీసం తాగునీటికి కూడా 14 రోజులు ఎదురు చూసే పరిస్థితి ఉండేదని… తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పురావస్తు, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వెనుకబడిన జిల్లాగా పేరున్న రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పురావస్తు, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొన్న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఐటీ మంత్రి కేటీఆర్ కృషి వల్ల ఏర్పాటుచేసిన ఐటీ టవర్ లో అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్ పరిశ్రమలు నెలకొల్పుతుండడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఇప్పటికే రూ.10 వేల కోట్ల పెట్టుబడితో అమర్ రాజా లిథియం గిగా పరిశ్రమ ప్రారంభం అవుతోందని, అనేక ఐటీ పరిశ్రమలు మహబూబ్ నగర్ వచ్చేందుకు ఉత్సాహంగా ఉన్నాయని త్వరలో మరిన్ని పరిశ్రమలు కూడా ఇక్కడ ఏర్పాటు కానున్నాయని ఆయన తెలిపారు. ఒకప్పుడు లక్షలాదిగా వలస వెళ్లిన పాలమూరు నేడు ఐటి ఉద్యోగాల కల్పన స్థాయికి ఎదగడం మన అభివృద్ధికి నిదర్శనం అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. స్థానికంగానే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కల్పనతో యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండబోదన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ వల్లే సాధ్యమైందని ఆయన వివరించారు.