Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్UCC: ఉమ్మడి పౌరస్మృతి

UCC: ఉమ్మడి పౌరస్మృతి

ఓటు రాజకీయంలో ఇలాంటివన్నీ పాచికలు

సమస్యలేమీ లేనట్లు ఈమధ్యకాలంలో దేశంలో అత్యధికమంది చర్చిస్తున్న సమస్య, భావోద్వేగాలను ప్రభావితం చేస్తున్న అంశం ఉమ్మడి పౌరస్మృతి. ఉమ్మడి పౌరస్మృతి ఆలోచన ముఖ్యంగా భిన్న మతాలు, ఆచారాలతో మిళితమైన దేశాల్లో తరచుగా వినిపించే మాట. ఆయా మతాల లేదా ఆచారాలతో ప్రమేయం లేకుండా దేశంలోని ప్రజలందరికీ వర్తించేలా ఏకరూప చట్టాన్ని అమలుచేయడాన్నే ఉమ్మడి పౌరస్మృతి అంటారు. ప్రజా స్వామ్యాన్ని అనుసరిస్తున్న ప్రగతిశీల సమాజంలో ఉమ్మడి పౌరస్మృతి ఉండటం ఆహ్వానించదగ్గ అంశమన్నది కాదన లేని సత్యం. ప్రపంచంలో అనేక దేశాల్లో అనేక రూపాల్లో ఉమ్మడి పౌరస్మృతి అమలులో ఉన్నదనేది వాస్తవం. కాని ఆయా దేశాలు తాము రూపొందించిన ఉమ్మడి పౌరస్మృతిలో మతపరమైన, సంస్కృతిపరమైన విషయాల్లో ఎన్నో మినహాయింపులు ఇచ్చాయన్న విషయం చాలా మందికి తెలియదు. 90% జనాబా ఒకే మతాన్ని, ఒకే సంస్కృతిని అనుసరిస్తున్న ఆయా అభివృద్ధి చెందిన దేశాల్లోనే 100% ఉమ్మడి పౌరస్మృతి అమలుకావడం లేదు, అటువంటిది భిన్న నాగరికతలు, సంస్కృతులు, సంప్రదాయాలు, మతా లూ, భాషలతో విలసిల్లుతున్న భారతదేశంలో ఉన్నఫళంగా ఉమ్మడి పౌరస్మృతి అమలులోకి రావాలని కోరుకోవడం అత్యాశ కాకుండా మరేమౌతుంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని కొనసాగిస్తున్న అద్భుతమైన కూర్పు మనదేశం. హరివిల్లు లాంటి భారతదేశాన్ని ఒకే రంగులోకి కుర్చాలని తొందర పడటం వలన ప్రయోజనం కన్నా అనవసరమైన ఘర్షణలకే అవకాశం ఎక్కువ.
ఐర్‌ల్యాండ్‌ రాజ్యాంగం నుండి గ్రహించి, భారత రాజ్యాంగంలోని పార్ట్‌4లో ఆర్టికల్స్‌ 36 నుండి 51 వరకు ఆదేశిక సూత్రాలను నిర్దేశించారు మన రాజ్యంగా నిర్మాతలు, అందులో ఆర్టికల్‌ 44 లో ఉమ్మడి పౌరస్మృతి ఉండా లని అభిలషించారు. దీని ఉద్దేశం చట్టాల కూర్పులో ఆయా ప్రభుత్వాలు సమానత్వం పాటించాలి. ఈ ఆదేశిక సూత్రాలను దృష్టిలో ఉంచుకొనే ఆయా ప్రభుత్వాలు నూతన చట్టాలను రూపొందించాలి. ఉమ్మడి పౌరస్మ్రుతిని అమలు చేస్తున్న దేశాల్లో సైతం వివాహాలు, విడాకులు వంటి అంశాల్లో మతాల ఆధారంగా ప్రత్యేక వెసులుబాటులు ఉన్న సందర్భాలు కోకొల్లలు. ప్రపంచంలో అత్యంత ధనవంతమైన దేశం, ప్రజాస్వామ్యం వెల్లివిరిసే దేశం, స్వేచ్చకు ప్రతిరూపమైన అమెరికా దేశంలో ఉమ్మడి పౌరస్మృతి లేదు, అక్కడి 54 రాష్ట్రాలలో రాష్ట్రానికోరకమైన భిన్న చట్టా లున్నాయి. బ్రిటన్‌ లో ఉమ్మడి పౌరస్మృతి లేదు, కుటంబ చట్టాలు రాష్ట్రాల వారిగా విభిన్నంగా ఉంటాయి. రష్యాలో ఉమ్మడి పౌరస్మృతి లేదు. జర్మనీలో ఉమ్మడి పౌరస్మృతి అమలులో ఉన్నది. బీజీబీ అని పిలువబడే ఈ చట్టం ఆస్తి పంపకాలు, వివాహం, విడాకులు, టార్ట్‌ (సివిల్‌ హక్కులు) లతో కూడిన సమగ్ర చట్టం. అయినాకూడా జర్మనీలో మత పరమైన, సివిల్‌ వివాహాలు రెండూ ఆమోదయోగ్యమే, ఒకవేళ సమస్య ఉత్పన్నం అయితే కామన్‌లా మతపరమైన ఒప్పందాల మీద చెల్లుబాటు అవుతుంది. ఫ్రాన్స్‌లో వివాహం, విడాకులు, అనువంశ ఆస్తుల పంపిణీ, పిల్లల పెంపకానికి సంబందించిన అంశాలలో ఏకరూప చట్టం ఉంటుంది, కాని అక్కడ కూడా వివాహసంబందమైన విషయాల్లో మతాచారాలను గౌరవించే ప్రోవిజన్స్‌ ఉన్నాయి. ఇజ్రాయిల్‌లో పాక్షిక ఉమ్మడి పౌరస్మృతి అమలులో ఉన్నది. అక్కడి యూదు పౌరులకు వారి సంస్కృతి, కుటుంబ ఆచారాలకు సంబందించిన చట్టాలు ప్రత్యేకంగా ఉన్నాయి. శ్రీలంకలో వేరు వేరు ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. వివిధ దేశాలలోని ఉమ్మడి పౌరస్మృతులను పరిశీలిస్తే అర్థమయ్యే విషయం ఒక్కటే, ఏ దేశంలో అయినా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలి అనుకుంటే ముందుగా అక్కడి వివిధ వర్గాల ప్రజలలో వారి సాంసృతిక వారసత్వానికి, ఆచారాలకు దూరమౌతున్నామన్న భయాన్ని పారద్రోలాలి.
ఉమ్మడి పౌరస్మృతి చట్టం వలన దేశంలో ఏదో గొప్ప మార్పు వస్తుందన్న భ్రమలు కల్పిస్తున్నారు. అదంతా దేశంలో ఉన్న అసలు సమస్యలను పక్కదారి పట్టించడానికి చేస్తున్న ప్రయత్నాలనే చెప్పాలి. పెరుగుతున్న దరలు, తరుగు తున్న రూపాయి విలువ, పరిష్కారం కాని సరిహద్దు సమస్యలు, పెరుగుతున్న నిరుద్యోగం, అంతులేని అత్యాచారాలు, అఘాయిత్యాలు వీటి ముందు ఉమ్మడి పౌరస్మృతి తక్షణం రూపొందించుకోవలసిన పెద్ద సమస్య కానేకాదు. ప్రాథమిక హక్కులను కాపాడలేనివాళ్ళు ప్రాథమిక సూత్రాల అమలు గురించి మాట్లాడటం అమ్మకు పెట్టనోడు చిన్నమ్మ గురించి మాట్లాడినట్టు ఉంటుంది. పేరుకే అందరిదీ ఒకే మతమైనా దక్షిణ, తూర్పు, ఉత్తర భారతీయ హిందువుల సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి, ఉమ్మడి పౌర స్మృతితో వారిని మెప్పించడం అంత సులువేమీ కాదు. దేశంలో అనేక ప్రాంతాల్లో అమలులో ఉన్న ఏజెన్సీ చట్టాలు సివిల్‌ చట్టాలలో విలీనం అవుతాయా, గిరిజనులు అంగీకరిస్తారా, అలాచేయడం వారికి అన్యాయం చేయడం కాదా? మతాచారాలు వద్దు రిజిస్ట్రేషన్‌ మాత్రమే అన్ని వివాహాలకు తప్పనిసరి అంటారా, తాళి లేకుండా, వేద మంత్రాలు లేకుండా, సప్తపది లేకుండా, కన్యాదానం లేకుండా పెండ్లిని ఎంతమంది హిందువులు ఆహ్వానిస్తారు. అలా కాదు హిందూ ఆచారాల ప్రకారం వివాహం అయినా సరే ఒప్పుకుంటాం అంటారా, తరువాత రిజిష్ట్రేషన్‌ చేసుకుంటే సరిపోతుంది అంటారా, అలాంటప్పుడు క్రిష్టియన్‌, ఇస్లాం, బుద్ధిష్ట్‌ తదితర మతాలకు కూడా ఇటు వంటి వెసులుబాటు ఇవ్వాల్సి ఉంటుంది కదా, ఇక ఉమ్మ డి పౌరస్మృతి ఎలా? ఉమ్మడి పౌరస్మృతి ఫరిదిలోకి ఏజెన్సీ ప్రాంతాలు సహజంగా రావాలి కదా. ఒకేదేశం ఒకేచట్టం అన్నప్పుడు మైదాన ప్రాంతాలకు ఒక న్యాయం, ఆటవీ ప్రాంతాలకు ఒక న్యాయం ఉండొద్దు కదా. అంటే ఇంత కాలం ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆస్తుల మీద గిరిజనులకు ఉన్న ప్రత్యేక చట్టాలు, హక్కులు రాబోయే ఉమ్మడి పౌర స్మృతి పరిధిలోకి వెళ్లిపోతాయన్నమాట. రెవెన్యూ కోర్టులు, ట్రిబ్యునల్స్‌ స్థానంలో సివిల్‌ న్యాయస్థానాలు ప్రవేశిస్తాయి. మరి 25% ఉన్న గిరిజన ప్రత్యేక హక్కులు హరించుకు పోవా? ఎక్షైజ్‌ చట్టం గిరిజనులకు కొన్ని ప్రత్యేక హక్కులను కల్పించింది. ఇకమీదట గిరిజనులు, మిగతావారికి అందరికీ ఒకే రూలు వర్తిస్తుందా? ఇది వారి ప్రత్యేక హక్కును హరించడం కాదా? ఒకవేళ వారికి మినహాయింపు ఇస్తే అదేవిధమైన మినహాయింపును మిగతా వర్గాలు అడగవా?
మనలో కొందరికి ముస్లీం/ఇస్లాం పట్ల విద్వేషం ఎంతలా పెరిగింది అంటే వారికి వ్యతిరేకమైనది అనిపించే ప్రతి చట్టాన్ని, చర్యనీ ఆహ్వానిస్తారు. చివరికి తమకు, తమ ధర్మానికి అసౌకర్యాన్ని కలిగించేది అయినా సరే. ముస్లీం మహిళలు రోడ్డేక్క లేదు, ఉద్యమం చేయడం లేదు అయినా వాళ్ళ తరుపున మనలో కొందరు వకాల్తా పుచ్చుకుంటున్నారు, అదే కోవలో మెడలో తాళి కట్టడం ఎందుకు? పశు వులా అని ఎవరైనా ప్రశ్నిస్తే , కన్యాదానం చేస్తున్నారు, వాళ్ళేమైనా వస్తువులా అని ప్రశ్నిస్తే, మనం ఎలా స్పందిస్తాం. ఒకప్పుడు మనింటి పిల్లను సతి పేరుతొ మనమే తగలబెట్టుకోలేదా, కన్య పేరుతో ఎనిమిదేండ్లకే పెండ్లిచేసి అత్తగారింటికి పంపలేదా, ఇంకా అనేక ఆచారాలలో మనం మాత్రం మనింటి ఆడవాళ్ళను కట్టుబాట్ల చట్రంలో బందించడం లేదా, మాటకు ముందోసారి, మాటకు వెనుకోసారి ఆడపిల్లలాగా మాట్లాడు, ప్రవర్తించు, ఆడపిల్ల లక్షణం ఒక్కటైనా లేదు అంటూ వాళ్ళను అదుపులో ఉంచడం లేదా. అవలక్షణాలు, లోపాలు లేని మతమేదైనా ప్రపంచంలో ఉన్నదా! మహిళల పట్ల వివక్ష ఒక సామాజిక సమస్య. హిందూ, ముస్లీం, క్రిష్టియన్‌, సిఖ్‌తో సహా అన్ని మతాలూ పాటిస్తున్న సామాజిక వివక్ష, అందుకు ఒక్క మతాన్ని మాత్రమే వేలెత్తి చూపడం దేనికి?
భారతదేశంలో పోక్సో చట్టం వచ్చిన తరువాత 18 సంవత్సరాలు నిండని ప్రతి మహిళా బాలికలానే పరిగణిం చబడుతుంది. ఫలితంగా అన్ని మతాలవారూ 18 సంవత్స రాల వరకు ఆడపిల్లకు పెండ్లి చేయడం లేదనే చెప్పాలి. గృహహింస చట్టం ఈదేశంలోని మహిళలందరికీ వర్తిస్తుంది. 125 సి.ఆర్‌.పీ సి ఫరిది అతి విస్తారమైనది. 498- ఏ కింద వరకట్న భాదితులందరూ మతంతో ప్రమేయం లేకుండా కోర్టులను ఆశ్రయించవచ్చు. కోర్టుల ద్వారా పొందే విడాకుల చట్టంలో హిందూ, ముస్లిం చట్టాలు దాదాపు ఒకే విధమైన ప్రొవిజన్స్‌ కలిగి ఉన్నాయనే చెప్పాలి. ఆస్తి హక్కులు ముస్లీం షరియత్‌లో ఆడవాళ్ళకు సముచిత స్తానముందనే చెప్పాలి, ఆదార్‌ వచ్చిన తరువాత బురఖా ధరించే మహిళలు కూడా ఫోటోలు దిగుతున్నారు. ఉమ్మడి స్మ్రుతికోసం ఆర్‌.ఎస్‌.ఎస్‌ ఇవాళ ఇవాళ ఇస్తున్న పిలుపు 40 సం.ల నాటి డిమాండ్‌. ఆనాడు గృహ హింస చట్టం అమలులో లేదు, 498- ఏ వరకట్న చట్టం, అమలులో లేదు, 125 సి.ఆర్‌.పీసీ ఆదరణలో లేదు, పోక్సో చట్టాలు రాలేదు. నాటి ప్రభుత్వాలు మెల్లెమెల్లగా నొప్పించకుండా సమాజంలోకి ఉమ్మడి పౌరస్మృతిని వివిధ చట్టాల రూపంలో చొప్పింఛాయనే చెప్పాలి. ట్రిపుల్‌ తలాఖ్‌ రద్దు చట్టంతో ఆ ప్రయత్నం దాదాపు పరిపూర్ణం అయిందనే చెప్పాలి. 494 ఐ.పీ.సి దేశంలోని అన్ని వర్గాలకు వర్తిస్తుందన్న సవరణ తేగలిగితే, టార్ట్‌( సివిల్‌ హక్కులు) మీద భారతదేశంలో విస్పష్ట చట్టం చేయగలిగితే ఇక ప్రత్యేక ఉమ్మడిస్మృతి చట్టం అవసరం లేదనే చెప్పాలి.
భారతదేశమనే ఇల్లు అనేక మతాలూ, ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు మేళవించిన ఒక అందమైన కూర్పు. ఈ ఇంటిని ఇంకా అందంగా అలంకరించాల్సిన అవసరం కచ్ఛితంగా ఉన్నది, కానీ అంతకన్నా ముందు ఈ ఇంటిలో పరిష్కరించుకోవలసిన సమస్యలెన్నో ఉన్నాయి, నమ్మకం కలిగించాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. రాజ్యాంగ నిర్మాతలు ఎప్పుడో చెప్పినమాట ఆదేశిక సూత్రాలు అమలు కాకపోయినా వ్యవస్థ కూలిపోదు, కానీ ప్రాథమిక హక్కులు అమలుకాకపోతే మాత్రం వ్యవస్థ అతలాకుతలం అవుతుంది, అందుకే ప్రాథమిక హక్కులకు కోర్టుల ప్రత్యేక రక్షణ కల్పించారు. ఇవాళ దేశంలో ప్రాథమిక హక్కులు అడుగడుగునా అనేక రూపాల్లో అణచి వేయబడుతున్నాయి. హిందూ ముస్లీం సమస్య ఇంకా రావణ కాష్టంలా మండుతూనే ఉన్నది. ఆదివాసీలు, లింగాయతులు మాది ప్రత్యేక మతం అంటూ కొత్త రాగాలు పలుకుతున్నారు. ఇన్ని సమస్యలతో సతమతమౌతున్న ఇంటిలోకి కొత్త సమస్యకు స్వాగతం పలకడం ప్రగతిశీల ఆలోచన ఎలా అవుతుందో ఏలినవారే సెలవివ్వాలి.
కోర్టులద్వారా అమలుచేయడానికి వీలులేని ఆదేశిక సూత్రాల ప్రాముఖ్యతను ఉద్దేశించి బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రాజ్యాంగ సభలో మాట్లాడుతూ చెప్పిన మాటలు రాజ్యాంగ ముసాయిదా తయారు చేసింది దేశంలో ఏదో ఒకపార్టీని మాత్రమే అధికారంలోకి తెచ్చే ఉద్దేశంతో ఎంత మాత్రం కాదు, ఎవరు అధికారంలో ఉండాలన్న నిర్ణయం ఎప్పుడు ప్రజలదే, కానీ ఎవరు అధికారాన్ని చేజిక్కించుకున్నా తనకు నచ్చింది మాత్రమే చేసే స్వేచ్చ ఉండదు, ఆదేశిక సూత్రాలు అధికారంలో ఉన్న పార్టీని నియంత్రించే సాధనాలు, తమ ఇష్టానుసారంగా చట్టాలను చేసే పార్టీలు కోర్టుముందు జవాబుదారీ కాకపోవచ్చు, కానీ ఓట్లేసే ప్రజల ముందు కచ్ఛితంగా పరీక్షించబడతారు, వారికి సమాధానం చెప్పితీరాల్సి ఉంటుంది, సానుకూల ఆలోచనలున్న పార్టీ అధికారం చేజిక్కించుకున్నప్పుడు మాత్రమే ఆదేశిక సూత్రాల ప్రాముఖ్యం తెలుస్తుంది. అంటే ఆదేశిక సూత్రాలు ఆయా ప్రభుత్వాలకు చట్టాల అమలులో ఉద్దేశించిన నైతిక విలువలు మాత్రమే అనేది రాజ్యంగ నిర్మాతల ఉవాచ.
నిజంగా పాలకులు ఉమ్మడి పౌరస్మృతిని దేశంలో అమలు చేయాలని భావిస్తే కేవలం రెండు చిన్న సవరణలతో దాని ఫలితాన్ని దేశవ్యాప్తం చేయోచ్చు. 1. మతపర మైన చట్టాల స్థానంలో జనరల్‌లా ( సాధారణ చట్టాన్ని) ఇరువర్గాలలో ఏ ఒక్కరైనా కోరుకొనే స్వేచ్చను ఇవ్వడం 2. రెండో వివాహాన్ని నేరంగా పరిగణిస్తూ చేసిన 494 ఐ.పీ.సి నిబందన మతంతో ప్రమేయం లేకుండా భారతీయులందరికీ వర్తిస్తుంది, భాదిత భార్యాభర్తలలో ఎవరైనా పర్సనల్‌ లా కాకుండా భారతీయ శిక్షాస్మృతిని అమలు చేయాలని కోరవచ్చు, ఈ రెండు సవరణలు తేగలిగితే ఇప్పుడు దేశంలో అమలులో ఉన్న గృహహింస, ట్రిపుల్‌ తలాఖ్‌ రద్దు, 125 సి.ఆర్‌.పీ.సి, పోక్సో చట్టం సహాయంతో అనధికార, పరోక్ష ఉమ్మడి పౌరస్మృతి సహజంగా అమలు లోకి వచ్చేస్తుంది. ఈమధ్యకాలంలో అలహాబాద్‌ హైకోర్టు ఈవిషయమై తనముందుకు వచ్చిన ఒక రిట్‌ పెటిషన్‌ మీద స్పందిస్తూ 494 వర్తింపు మీద అభిప్రాయాన్ని చెప్పా లని ప్రభుత్వానికి నోటీసు ఇవ్వడం జరిగింది, అందులో గనుక కేంద్రం సానుకూలంగా స్పందిస్తే కాగలకార్యం గంధర్వులు చేసినట్లు అవుతుంది కదా. ఏకసమయంలో నలుగురిని చట్టబద్దంగా వివాహం చేసుకొనే అవకాశం కల్పించడం ఖశ్చితంగా ఖండించాల్సిన విషయమే, ఆధునిక యుగంలో అవాంచనీయమే, అయితే సమస్యను పరిష్కరించే దగ్గరి మార్గాలను వెతుకులాదకుండా, కేవలం ఆ ఒక్క సమస్యను భూతద్దంలో చూపుతూ ఒక వర్గాన్ని వెలేయడం, వేలెత్తి చూపడం, కించపరచడం అనైతికమే అవుతుంది. ఉమ్మడి పౌరస్మృతిని ముస్లీంలు, క్రిష్టియన్లు వ్యతిరేకిస్తున్నారు అనడం కన్నా హిందుత్వ వాదులమని చెప్పుకుంటున్న కొన్నివర్గాలు తీవ్రంగా కోరుకుంటున్నాయి అనడమే సందర్భోచితం. నిజానికి ఉమ్మడి పౌరస్మృతి తేవడం వలన క్రిష్టియన్‌ విడాకులకు ఇంతకాలం అడ్డుగా ఉన్న తెరలోలగిపోతుంది, ముస్లీం దంపతులు దత్తత ఇవ్వ డానికి, తీసుకోవడానికి అడ్డుగా ఉన్న తెర తొలగిపోతుంది. చివరిగా దేశంలోని అన్ని మాతాలను, ఆయా మతాలలోని విభిన వర్గాలను (షియా, సున్నీ తదితర ముస్లిం, శైవ, వైష్ణవ తదితర హిందూ, ఆంగ్లికన్‌, క్యాథలిక్‌ తదితర క్రిష్టి యన్‌), దేశంలోని నాలుగు ప్రాంతాలలో ఉన్న విభిన ఆచారాల ప్రతినిదులతో, నిపుణులతో కూడిన కమిటీ వేసి ఉమ్మడి పౌరస్మృతి కోసం ప్రయత్నిస్తే అది నిజాయితీతో కూడిన ముందడుగు అనొచ్చు, లేకుంటే అది ఓటు రాజకీయంలో పాచిక అనే చెప్పాలి. నా ఆరాటం అధికార వర్గానికి భక్తులుగా ఉండే, మత విద్వేషంతో ఊగిపోయే 4% ప్రజలను ఒప్పించడం కోసం కాదు, తమ హక్కులు, భాద్యతలను మరచిపోయి, బద్దకంగా నిద్రపోతున్న 90 % మందిని మేల్కొల్పడానికి మాత్రమే.

  • చందుపట్ల రమణకుమార్‌ రెడ్డి.
    న్యాయవాది, 9440449392
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News