Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్World nature conservation Day: పర్యావరణ ప్రకృతి పరిరక్షణ మనందరి బాధ్యత

World nature conservation Day: పర్యావరణ ప్రకృతి పరిరక్షణ మనందరి బాధ్యత

మన చర్యలతో భవిష్యత్‌ తరాలకు శాపంగా పరిణమించే ప్రమాదం

విశ్వంలో జీవరాశుల మనుగడకు మూలాధారం అయిన భూమి, గాలి, నీరు, నింగి, నిప్పు, నేల అనే పంచభూతాలను ప్రకృతే ఈ విశ్వానికి అందించింది. పంచ భూతాల నిష్పత్తిలో సమతుల్యత లోపించి మానవ జీవనం అస్తవ్యస్తమౌతుంది. మానవాళి పలు విపత్తులకు గురవుతుంది. ప్రకృతి వాతావరణ పర్యావరణ సమతుల్యత మానవ మనుగడకు అవసరం. ఆధునికీకరణ ‘పారిశ్రామికీకరణ, పట్టణీకరణ’ శీఘ్రంగా విస్తరిస్తున్న కార్పొటీకరణ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సంభవిస్తున్న పరిణామాలు మానవుని స్వార్థపరత్వం ప్రకృతి విద్వంసం దిశగా కొనసాగడం శోచనీయం.
ప్రకృతి విధ్వంసం
మానవుడు తన భౌతిక అవసరాల కోసం తరతరాల ప్రకృతిని విద్వంసం చేస్తున్నాడు. ప్రకృతి మీద ఆధిపత్యం సాదిస్తున్ననానే మాయలో పడి మానవ మనుగడకు ఆధారమైన ప్రకృతి రక్షిస్తే అది మనలను రక్షిస్తుంది అన్న వాస్తవాన్ని మరిచిపోవడం వల్ల మానవ జాతి అనేక విపత్తులు ఎదుర్కోవడం గమనార్హం. ప్రకృతి రక్షితే మానవ రక్షిత అన్న సత్యాన్ని మరువ కూడదు. మానవుడు చేసే చర్యలు భవిష్యత్‌ తరాలకు శాపంగా పరిణమించే ప్రమాదాన్ని గుర్తించకపోవడం శోచనీయం.
మానవ తప్పిదాలు ప్రకృతి విద్వంసం
19వ శతాబ్దం నుండి మానవ తప్పిదాల వల్ల ప్రకృతి విధ్వంసానికి గురౌతుంది. ప్రకృతిలో మానవుడు తప్ప మిగతా జీవరాశి (జీవులు) ప్రకృతి చెప్పినట్లు ప్రవర్తిస్తు న్నాయి. ప్రకృతికి భిన్నంగా నడిచే మానవుడు చేసే ప్రతి కూల చర్యల వలన ఏపాపం ఎరుగని మూగ జీవాలు భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. మానవుడు సాధించిన శాస్త్ర సాంకేతిక ప్రగతి, జీవావరణ రంగాల్లో సాధించిన ప్రగతి దానివల్ల కలిగిన మార్పులు మాత్రం ప్రకృతి స్వచ్ఛతకు ఉనికికి ముప్పుగా పరిమించాయి. ఒక పక్క వ్యవసాయ రంగములో హరిత విప్లవం తర్వాత అధిక దిగుబడులు పెంచేందుకు అధిక ఉత్పాదకత పేరున విచ్ఛల విడిగా వినియోగించిన రసాయనిక ఎరువులు, క్రిమిసంహరక మందుల వాడకం ఎక్కువైంది దీనివల్ల పంట దిగుబడి పెరిగింది కాని గాలి, నీరు, నేల కలుషితమైనాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. వ్యవసాయ రంగంలో ఉపయోగిస్తున్న క్రిమిసంహారక మందులు (అనేక వ్యాధులకు) రోగ కారకాలు అవుతూ ప్రజారోగ్యనికి ప్రమాదకరంగా పరిణమించింది. మరోపక్క అతి నీల లోహిత కిరణాల నుండి మానవులను కాపాడే ‘ఓజోన్‌ పొరలో’ మానవాళి స్వార్థం వల్ల ఏర్పడిన రంధ్రాలు రాను రాను విస్తరిస్తున్నాయి. వీటికి తోడు పట్టణీకరణ ‘పారిశ్రామిక విప్లవం జనాభా పెరుగుదల’- ‘రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం’ అడవుల నరికివేత సహజ వనరుల విద్వంసం ఇసుక మాఫియా మితిమీరిన ప్లాస్టిక్‌ వాడకం ప్రకృతిని నాశనం చేస్తున్నాయి.
కేంద్ర, రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలు అభివృద్ధి పేరున భారీ ప్రాజెక్టులను కాలుష్య కారక పరిశ్రమలను స్థాపిస్తు పర్యావరణం జీవావరణం ప్రకృతి విద్వంసానికి పాల్పడడం గమనార్హం. దీనివల్ల అనేక సంఖ్యలో వృక్ష జాతులు జంతు జాతులు అంతరించాయి. మరికొన్ని అంతరించిపోతున్న జాబితాలోకి చేరాయి.
ప్రకృతి రక్షణ సుస్థిరాభివృద్ధి
మానవుడు ఉన్నన్ని రోజులు ప్రకృతి వనరులను ఉపయోగించుకోవాలి. తర్వాత తరానికి అందించాలి. ప్రకృతి వనరులు తరతరాల వారసత్వ సంపద వాటిని రక్షించాలి. భావి తరాల కోసం వీటిని భద్రపరచాలి. విద్వంసం చేయకూడదు. వనరులను అనుభవించే హక్కు మాత్రమే వుంది. సమస్త జీవకోటితో నిండిన ప్రకృతిని సమిష్టిగా పంచుకోవాలి. గడచిన తరాలు ప్రకృతి వనరులను పొదుపుగా వాడుకున్నారు. ప్రకృతి పర్యావరణాన్ని సంతులిన పద్ధతిలో ఉపయోగించారు.
ప్రకృతి దేవత
భారతదేశములో ప్రకృతిని దేవతగా ఆరాధించే సంస్కృతి వుందన్న చారిత్రిక సత్యాన్ని మరువకూడదు. ఆధునికీకరణ పేరు మీద ప్రకృతి సహజ వనరులను విచక్షణారహితంగా అపరిమితంగా వినియోగిస్తూ పరిమిత వనరులను కాలుష్యం చేస్తూ భావితరాల వారికి ఆర్థిక, ఆరోగ్య సమస్యలను కానుకగా ఇస్తున్నాం. వారసులకు సంపద ఇవ్వాలని పోటీ పడుతున్న సమాజంలో స్వచ్ఛత గల ప్రకృతి పర్యావరణాన్ని ఇవ్వాలన్న స్పృహ లోపించింది. సుస్థిరాభివృద్ధికి తీవ్ర విఘాతం కలిగించే దోరిణిని సమాజం విడనాడాలి.
అటవీ క్షీణత పెరుగుతున్న కాలుష్యం
విచక్షణా రహితంగా అటవీ సందను ద్వంసం చేయడం కొల్లగొట్టడం వల్ల 33 శాతం వుండాల్సిన అడవులు నేడు దేశములో 21 శాతానికి మించి లేవు. సగటున రోజుకు 333 ఎకరాల అటవీ భూమి అదృశ్యమై పోతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. విచక్షణ రహితంగా అటవీ సంపదను విద్వంసం చేయటం వల్ల ప్రకృతి విపత్తులు అకాల వర్షాలు వరదలు వచ్చి అపారమైన ఆస్తినష్టం ప్రాణ నష్టం సంభవిస్తుంది. మానవ చర్యల వల్ల గాలి కాలుష్యం అవుతుంది. గాలి కాలుష్యం వల్ల ప్రతి యేటా 70 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ తన నివేదికలో వెల్లడించింది. వరదలు వానల వల్ల కలుషితమైన నీరుతాగి రోగాల బారినపడి యేటా 2లక్షల మంది చనిపోతున్నరాని నీతి ఆయోగ్‌ గణాంకాలు తెలియచేస్తున్నాయి. వ్యవసాయ పారిశ్రామిక రంగాల విస్తరణ వల్ల 85 శాతం చిత్తడి నేలలను ప్రపంచం కోల్పోయింది. 75 శాతం భూఉపరితలం మార్పుకు లోనయ్యింది. 66 శాతం సముద్ర విస్తీర్ణం ప్రభావితమైందన్న అద్యయనాంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఆధునిక సౌకర్యాల పేరు మీద మానవుడు విలాస జీవితానికి అలవాటుపడి కాలుష్య కారకమైన వస్తువులను ఉపయోగిస్తూ పర్యావరణానికి హాని చేస్తున్నాడు. పారిశ్రామికీకరణ పట్టణీకరణ విస్తరణ ఫలితంగా వాతావరణంలోకి అపరిమిత కర్భన ఉద్గారాలు విడిచి పెట్టడంవల్ల భూగోళం అగ్నిగోలంగా మారి గ్లోబల్‌ వార్మింగ్‌ కారణమై ఓజోన్‌ పొర క్షీణతకు మానవ చర్యలే ప్రత్యక్షంగా కారణం కావడం అంతే గాకుండా మనకు ఊపిరిని ఇచ్చే వాయువును కూడ కాలుష్య భరితం చేశాం.
వాయు జల కాలుష్యం
మనం పీల్చుకునే వాయువు కాలుష్య భరితమయింది. నదీ జలాలు కలుషితమై తాగునీటి కొరత ఏర్పడింది. పంటల దిగుబడి లోకీలకపాత్ర పోషించే తేనెటీగలు.. ఊరపిచ్చుకలు అంతరించి పోతున్నాయి. పంటల దిగుబడి తగ్గి ఆహారోత్పత్తి కోరత ఏర్పడి ఆహార విపత్తు ఏర్పడే ప్రమాదం ఉందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలించిన ఇంటర్నేషనల్‌ యూని యన్‌ ఫర్‌ కన్సర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ అనే అంతర్జాతీయ సంస్థ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యతులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ప్రకృతి పర్యావరణం పట్ల జరుగుతున్న నిర్లక్ష్యం విధ్వంసం. ఇలాగే కొనసాగితే ప్రపంచములోని ప్రతి నాలుగు జీవ జాతుల్లో ఒకటి అంతరించిపోయే దశలో ఉన్నట్లు అభిప్రాయపడింది.
మానవుడు తన మేధస్సు ద్వారా అనేక పరిశోధనలు చేశాడు. ఆధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ద్వారా అనేక ఆవిష్కరణలు చేశాడు. ఆధునిక టెక్నాలజీ వల్ల ఎంతో ప్రగతి పురోగతి అభివృద్ధి సాధించాడు. సాధించిన ప్రగతి ప్రకృతి పర్యావరణ వినాశనకరంగా పరిణమించింది. ప్రకృతిని రక్షించుకునే స్థితి రోజు రోజుకూ క్షీణిస్తుంది. దీనివల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవించి ఋతువులు గతి మారుతున్నాయి. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వరదలు తుఫానులు భూకంపాలు అగ్నిపర్వతాలు, సునామీలు మానవ జాతిని భయపెడుతున్నాయి. కరోనా లాంటి ప్రాణాంతక వైరస్‌లు సులువుగా విజృంభించి మానవ జాతిని మృత్యు కుహరంలోకి నెట్టినప్పటికి ప్రకృతి విధ్వంసాన్ని అదుపు చేయకపోవడం శోచనీయం.
ప్రకృతి ఉపద్రవాలు మానవ దోషాలు ఒకదానికి ఒకటి తోడై ప్రపంచ మానవాళి నేడు భయం గుప్పెట్లో బతుకుతున్నారు. ప్రకృతి పర్యావరణ విద్వంసాన్ని ఆపాలి. సహజ వనరుల సంరక్షణ ఉపయోగం గురించి అవగాహన కలిగించడానికి ప్రకృతి పరిరక్షణ పద్ధతుల పట్ల ప్రజలకు అవగాహన చైతన్యము శిక్షణా కార్యక్రమాలను సదస్సులను ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్నిప్రతి యేటా జూలై 28 నాడు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారు.
ప్రకృతి రక్షణలో పౌరసమాజం పాత్ర
1)చైతన్య వంతమైన పౌరసమాజం ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కొరకు ఉద్యమించాలి. 2)ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలి. ప్లాస్టిక్‌ బ్యాగుల స్థానములో జనుపనార సంచులు పేపరు బ్యాగులు వాడేట్లు ప్రజలకు అగాహన కలిగించాలి. 3)వాయు కాలుష్యము తగ్గించటానికి వాహనాల వినియోగం తగ్గించాలి. ఎలక్ట్రానిక్‌ వాహనాల సైకిళ్ల వినియోగం పెంచాలి. కాలి నడకకు ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యక్తిగత వాహనాల వాడకం తగ్గించాలి. 4)వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించాలి. సేంద్రీయ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. 5)పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా సౌరశక్తి ‘పవనశక్తి’ జలవిద్యుత్‌ను అందుబాటులోకి తేవాలి. 6)పర్యావరణ ప్రకృతి పరిరక్షణకు ‘3ఆర్‌’ రెడ్యూ స్‌ (తగ్గించడం) తిరిగి వాడటం (రీయూజ్‌) పునరుద్ధరణ (రీసైక్లింగ్‌)వంటి పద్దతులు మనిషి జీవితములో బాగం కావాలి. 7) భూగర్భ జలాల పెంపుకు ప్రతి ఇంటా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయ్యాలి. 8) ప్రతి గ్రామంలో చెక్‌ డ్యాములు నిర్మించాలి. ‘గోబర్‌ గ్యాస్‌ ప్లాంట్ల’ ఏర్పాటు చేయాలి. 9)అడవుల పెంపకం పెద్ద ఎత్తున చేపట్టాలి. ప్రకృతి పర్యావరణ హితకరమైన చర్యలు చేపట్టాలి. ప్రజల భాగస్వామ్యంతో ఎక్కువ మొక్కలు నాటాలి. వాటికి రక్షణ చర్యలు చేపట్టాలి. అటవీ భూములు దురాక్రమణకు గురికాకుండా కాపాడాలి. సామాజిక అడవుల పెంపకాన్ని పెద్దఎత్తున చేపట్టాలి. పెద్ద ఎత్తున సాగుతున్న చెట్ల నరికివేత అరికట్టాలి. ఒక చెట్టు నరికితే 10 చెట్లు పెంచే విధంగ నిర్భంధ చట్టాలను రూపొందించి అమలు చెయ్యాలి. అడవులను నాశనం చేయడం క్రిమినల్‌ చర్యగా భావించాలి. భూమి కోతకు గురికాకుండా చర్యలు తీసుకోవాలి. భూసారాన్ని రక్షించాలి. చిత్తడి నేలల రక్షణ చర్యలు చేపట్టాలి. 10) జల కాలష్య్యాన్ని నివారించాలి. నీటిని పొదుపుగా వాడుకోవాలి. భూగర్భజలాలను సంరక్షించుకోవాలి. 11)నేటి కరోనా విపత్తులో ప్రభుత్వాలు సహజ వనరుల వినియోగంపై ఉదాసీనతను విడనాడాలి. అభివృద్ధి సంరక్షణ సామాజిక సంక్షేమానికి సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. మహాత్మాగాంధీ చెప్పినట్లు ప్రకృతి ప్రతి ఒక్కరి అవ సరాలను తీర్చ గలదు కాని దురాశను కాదు అనే మాటను గుర్తెరిగి ప్రకృతి సంరక్షణలో ప్రతి వ్యక్తి భాగస్వామి కావాలి. భావి భారత భాగ్యోథయానికి పాటుపడాలి. 12) ప్రభుత్వం మీడియా ప్రసార సాధనాలు సహజవనరుల సంరక్షణతోనే సత్వరాభివృద్ది సాధ్యమన్న విషయం సమాజంలో ప్రచారం చెయ్యాలి. 13)ప్రతి పౌరుడు ప్రకృతి పర్యావరణ సంరక్షణలో క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా భాగస్వామ్యం పొందాలి. 14)ప్రకృతి రక్షణ వల్ల జీవకోటి మనగడ కొనసాగుతుంది.
పౌరులుగా ప్రకృతి పర్యావరణ సమతుల్యత లోపించకుండ చూడటం మనందరి బాధ్యత. పొల్యూషన్‌ గ్లోబల్‌ వార్మింగ్‌ తగ్గించడం ప్రతి ఒక్కరి బాధ్యత.
ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి పరిరక్షణ కార్యాచరణ ప్రారంభమైంది. అంతర్జాతీయ సదస్సులు జాతీయ సదస్సులు జరుగుతున్నాయి. అనేక చట్టాలు రూపొందించారు. జాతీయ అంతర్జాతీయ చట్టాలు అమలు చేస్తున్నప్పటికీ అనూహ్య మార్పులు రావు. 15)పర్యావరణ రక్షణ ప్రతి వ్యక్తి జీవన శైలిలో అంతర్భాగం కావాలి. 16)పాటశాల కళాశాల స్థాయిలో ప్రకృతి పర్యావరణపరిరక్షణ పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలి. యూనివర్సిటీ స్థాయిలో ప్రకృతి పర్యావరణం పట్ల పరిశోధన కొరకు నిధులు కేటాయించాలి. 17) గ్రామ, మండల, మున్సిపాలిటి, మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్థాయిలో పర్యావరణ ప్రకృతి రక్షణ అధికారులను నియమించాలి. ప్రకృతి రక్షణలో పౌర సమాజాన్ని భాగస్వాములను చెయ్యాలి. ప్రభుత్వం ప్రకృతి రక్షణకు కృషిచేసే వారికి ప్రకృతిమిత్ర అవార్డ్‌ ఇవ్వాలి.. పరిసరాల పరిశుభ్రత రోడ్ల వెంబడి పొలం గట్ల మీద చెట్లు పెంచాలి. నీటి సంరక్షణ నీటిని పొదుపుగా వాడుకోవడం ప్లాస్టిక్‌ లాంటి హానికారక ఉత్పత్తుల నిషేధం. పాఠశాలలో చదివే చిన్నారులకు ప్రకృతి రక్షణ పట్ల వివిధ పోటీలు నిర్వహించి వారికి ప్రకృతి పరిరక్షణ పట్ల అవగాహన చైతన్యం కలిగించాలి. ప్రతి ఇల్లు ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కేంద్రం కావాలి. ఇంటి నుండే ప్రకృతి పరిరక్షణ ఉద్యమం ప్రారంభంకావాలి. స్వచ్ఛంద సంస్థలు మహిళా సంఘాలు యువజన సంఘాలు సామాజిక సాంస్కృతిక సంఘాలు సమిష్టిగా ప్రకృతి పరిరక్షణ ఉద్యమంలో బహుముఖ పాత్ర పోషించాలి.
ప్రకృతి రక్షణే మానవాళి రక్షణ అన్నది ఒక నినాదం కాకుండా ప్రజల జీవన విధానం కావాలి. భావితరానికి స్వచ్ఛమైన ప్రకృతిని బహుమతిగా ఇద్దాం. ప్రకృతి రక్షణ మనందరి కోసం భావితరాల కోసం మనిషి మనుగడ కోసం. స్వచ్ఛభారత్‌ స్వస్త భారత్‌ సాధనకై సుస్తిరాభి వృద్దితో కూడిన స్వయంసమృద్ధి భారత్‌ నిర్మాణానికి పునరంకితమౌదాం.

- Advertisement -


నేదునూరి కనకయ్య
తెలంగాణ ఎకనామిక్‌ ఫోరం అధ్యక్షుడు

  • 9440245771

(నేడు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News