Viral Video : సాధారణంగా రోడ్డుపైన వాహనం ఆగిపోతే ఏం చేస్తాం. ద్విచక్రవాహనం అయితే తోసుకుంటూ వెళతాం. కారు, లారీ, బస్సు లాంటి వాహనాలై దగ్గరలోని మెకానిక్ ని తీసుకువచ్చి బాగు చేయించుకుని తీసుకువెళతాం. లేదా మన వెహికల్‌కు తాడు కట్టి మరొక వాహన సాయం తీసుకుని మెకానిక్ షెడ్‌కు తరలిస్తాం. ఓ మెర్సిడెస్ బెంజ్ కారు అనుకోకుండా అయిపోయింది. ఆ కారును ఓ ఆటో డ్రైవర్ తన కాలుతో తోసుకుంటూ వెలుతున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఘటన పూణెలోని కోరేగావ్‌లో పార్క్ ప్రాంతంలో జరిగింది. ఓ రద్దీ రోడ్డుపై బెంజ్ కారు ఆగిపోయింది. ఎవరైనా సాయం చేస్తారేమోనని అతడు ఎదురుచూశాడు. ఎవ్వరూ అతడికి సాయం చేయలేదు. ఇంతలో ఓ ఆటో డ్రైవర్ అక్కడకు వచ్చాడు. పరిస్థితిని అర్థం చేసుకుని సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. ఆటోను నడుపుతూ తన ఎడమ కాలును కారు బంపర్‌పై పెట్టి తోసుకుంటూ షెడ్డు వద్దకు తీసుకువెళ్లాడు.
ఈ తతంగాన్ని ఆ దారి గుండా వెలుతున్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే క్షణాల్లో ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.