Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్Fake affidavits: తప్పుల తడకలతో ఆస్తుల అఫిడవిట్లు

Fake affidavits: తప్పుల తడకలతో ఆస్తుల అఫిడవిట్లు

ఈ చట్టంలో సవరణలు చేయాలి

ఎన్నికల సమయంలో అభ్యర్థులు తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేయడం ప్రస్తుతం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఓ ప్రధాన సమస్య. తెలంగాణలో పాలక భారత్ రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్)కి చెందిన ముగ్గురు చట్టసభ సభ్యులు రాష్ట్ర హైకోర్టులో ఎదురు దెబ్బలు తినడంతో ఈ తప్పుడు అఫిడవిట్ల వ్యవహారం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఇందులో మొదటి కేసులో, శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వర రావు 2018 ఎన్నికల్లో తన ఆస్తుల వివరాలకు సంబంధించి తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసినందుకు హైకోర్టు ఆయనను శాసనసభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించింది. అంతేకాదు, ఓట్ల విషయంలో ఆయన తర్వాత స్థానంలో ఉన్న పిటిషనర్ ను శాసనసభ్యుడిగా ప్రకటించడమే కాకుండా, వెంకటేశ్వర రావుకు అయిదు లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది.

- Advertisement -

రెండవ కేసులో మంత్రి పదవిలో ఉన్న శాసనసభ్యుడు ఎన్నికల సందర్భంగా తప్పుడు సర్టిఫికెట్లను దాఖలు చేసినట్టు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తనపై దాఖలైన పిటిషన్ ను కొట్టేయాల్సిందిగా ఆ మంత్రి పెట్టుకున్న పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. మూడవ కేసు ఒక పార్లమెంట్ సభ్యుడికి సంబంధించినది. తాను తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేశానంటూ తనపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ ను కొట్టేయాల్సిందిగా ఆయన సుప్రీంకోర్టుకు పెట్టుకున్న పిటిషన్ ను ఆ కోర్టు కొట్టేసింది. మొదటి పిటిషన్ పై విచారణ కొనసాగుతుందని అది స్పష్టం చేసింది.

ఈ దురాగతం ఏ ఒక్క పార్టీకో, ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాలేదు. అయితే, ఒక్క తెలంగాణ శాసనసభలో మాత్రమే సుమారు 15 మంది శాసనసభ్యులు ఈ రకమైన కేసుల్ని ఎదుర్కోవడం జరుగుతోంది. నిజమైన సమాచారాన్ని తొక్కిపెట్టడమంటే ఓటరును మోసం చేయడం, తప్పుదారి పట్టించడమేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసుల గురించి అఫిడవిట్లలో ప్రస్తావించకపోవడం ఓటరు మీద అవాంఛనీయ ప్రభావాన్ని కనబరచడమే అవుతుందని కూడా అది ఒక కేసులో స్పష్టం చేసింది. అంతేకాదు, ఆస్తుల గురించి, సంపాదన గురించి పూర్తి సమాచారం అందజేయడం కూడా అవాంఛనీయ ప్రభావాన్ని కనబరచడమే అవుతుందని అది మరొక కేసులో పేర్కొంది. అయితే, ఇటువంటి అవినీతి విషయాల్లో ఎవరూ అడ్డుకునేవారు లేనందువల్ల రాజకీయ నాయకులు ఈ అవినీతికి, అక్రమానికి పాల్పడుతూనే ఉన్నారు.

నిజానికి, తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన నేరానికి ఆరు నెలల జైలు శిక్ష గానీ, జరిమానా చెల్లించడం గానీ లేదా రెండూ అనుభవించడం గానీ చేయాలని ప్రజాప్రాతినిధ్య చట్టం నిర్దేశిస్తోంది. అయితే, కేసుల విచారణలో న్యాయస్థానాలు చేస్తున్న జాప్యం కారణంగా, వనమా వెంకటేశ్వర రావు కేసులో మాదిరిగా, శాసనసభ గడువు కాలం పూర్తయ్యే వరకూ కూడా విచారణ పూర్తి కావడం లేదు. కేసు విచారణలో జరుగుతున్న జాప్యాన్ని అవకాశంగా తీసుకుని అభ్యర్థులు కూడా లబ్ధి పొందడం జరుగుతోంది.

ఈ వ్యవహారంపై లా కమిషన్ ఈ మధ్య ఒక సంస్కరణల నివేదికను రూపొందించింది. హైకోర్టులో ఎన్నికల కేసుల విచారణ కోసం ఒక ప్రత్యేక బెంచిని ఏర్పాటు చేయాలని, శాసనసభ ఏర్పడిన ఆరు నెలల్లో విచారణను పూర్తి చేయాలని ఆ నివేదిక సిఫారసు చేసింది. అంతేకాక, నామినేషన్ల పరిశీలనకు గడువు పొడిగించాలని కూడా సూచించింది. తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసే అభ్యర్థులకు ఆరు నెలలు కాకుండా రెండేళ్ల కాలం శిక్ష విధించాలని, చట్టసభ సభ్యత్వానికి అనర్హుడిగా కూడా ప్రకటించాలని, ఈ మేరకు పార్లమెంట్ చట్టం చేయాలని లా కమిషన్ తన నివేదికలో సూచించింది. ఏ కారణంగానో, ఎన్నికల సంస్కరణలకు రాజకీయ పార్టీలు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదు. మన దేశం ఆదర్శవంతమైన, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా వృద్ధి చెందాలన్న పక్షంలో నిజాయతీ కలిగిన నాయకులు దేశానికి చాలా అవసరం. పార్లమెంట్ తప్పనిసరిగా ఈ చట్టంలో సవరణలు చేయాలి. రాజకీయ పార్టీలు కూడా తమ అభ్యర్థుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News