ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, బిఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ మండలం వెంకట్రావుపల్లి, సిరసపల్లి, రంగాపూర్, రాజపల్లి, ధర్మరాజుపల్లి, కందుగుల, పెద్దపాపయ్య పల్లి, కాట్రపల్లి, తుమ్మనపల్లి, సింగపూర్ గ్రామాలకు చెందిన 22 మంది లబ్ధిదారులకు ఆరు లక్షల విలువగల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను శనివారం నేరుగా బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి అందజేశారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళుతున్న సమయంలో ఆయా గ్రామాలలో నెలకొన్న సమస్యలను పలువురు ఎమ్మెల్సీ దృష్టికి తీసుకురాగా తక్షణమే స్పందించి సమస్యల పరిష్కారానికి తగు దృష్టి సారిస్తామన్నారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, దళిత బంధు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.