Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Modi promise: మోదీ వాగ్దానం సాధ్యం అవుతుందా?

Modi promise: మోదీ వాగ్దానం సాధ్యం అవుతుందా?

ఏమిటి ప్రయోజనం? ఎవరికి ప్రయోజనం? ఏం జరుగుతుంది?

భారతీయ జనతా పార్టీ మూడవసారి కూడా అధికారంలోకి వస్తే భారతదేశాన్ని ప్రపంచంలో మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ వాగ్దానం చేశారు. గత తొమ్మిదేళ్ల కాలంలో దేశం పదవ స్థానం నుంచి అయిదవ స్థానానికి ఎలా చేరుకుందో ఆయన గణాంకాలతో సహా వివరిస్తున్నారు. తాము ఎలా మూడవ స్థానానికి చేరుకోగలమో కూడా ఆయన చెబుతున్నారు. ప్రస్తుతం భారతదేశం 3.6 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. నిజానికి, 2025 నాటికి దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ స్థాయికి తీసుకు వెడతామని మోదీ 2019 ఎన్నికల్లో వాగ్దానం చేసిన విషయాన్ని ఆయన విమర్శకులు గుర్తు చేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఆ స్థాయికి చేరుకుని ఉండడం జరిగి ఉండేదే. అయితే, ప్రపంచాన్ని చుట్టుముట్టిన ఆర్థిక మాంద్యం, కోవిడ్ మహమ్మారి, ఆ తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధం
వంటివి ఆర్థిక వ్యవస్థను కొద్దిగా బలహీనపరచినట్టు మోదీ ప్రభుత్వం చెబుతోంది.

- Advertisement -

వాస్తవానికి ఏ దేశమైనా ఈ మూడింటి ప్రభావంతో కుదేలై ఉండేవి. అయితే, భారత ఆర్థిక వ్యవస్థ పుష్టివంతమైన ఆర్థిక వ్యవస్థ అనడంలో సందేహం లేదు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐ.ఎం.ఎఫ్)తో సహా పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు తమ నివేదికల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి సానుకూలంగానే రాస్తున్నాయి. 2027-28 నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లు దాటిపోయే అవకాశం ఉందని కూడా తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం నాలుగవ స్థానంలో ఉన్న జర్మనీని, మూడవ స్థానంలో ఉన్న జపాన్ ను భారత్ కచ్చితంగా దాటిపోతుందని కూడా చెబుతున్నాయి. ప్రస్తుత అభివృద్ధి తీరును బట్టి ఇందులో నిజం లేకపోలేదు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ పరిపుష్టం అవుతున్న మాట నిజం. అయితే, జర్మనీ, జపాన్ దేశాలు ఆర్థికంగా బలహీనపడుతున్న మాట కూడా నిజమే.

దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడం వల్ల ఏమిటి ప్రయోజనం? ఎవరికి ప్రయోజనం? ఏం జరుగుతుంది? ఎస్.బి.ఐ రిసెర్చ్ ప్రకారం, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రలు 500 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థల కూటమిలో చేరే అవకాశం ఉంది. ఇవి వియత్నాం, నార్వే దేశాల ఆర్థిక వ్యవస్థల కంటే ఎక్కువ.
అయితే, దేశంలోని దాదాపు 30 రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, దాదాపు అన్ని రంగాల్లోనూ పురోగతి, అభివృద్ధి వంటివి చోటు చేసుకోవాల్సి ఉంది. పెద్ద ఎత్తున ఉద్యోగాల సృష్టి జరగాలి. వ్యక్తిగత ఆదాయం పెరగాలి. దేశంలో ప్రస్తుతం నిరుద్యోగ సమస్య అంత తీవ్రస్థాయిలో లేకపోవచ్చు. అనేక అంశాలలో అది తగ్గుతూ ఉండవచ్చు. కానీ, నిరుద్యోగ సమస్య కూడా నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో సరిసమానంగా, ఒకే విధంగా, పోటా పోటీగా తగ్గాల్సిన అవసరం ఉంది. కాగా, ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్న విషయమేమిటంటే, పూర్తికాల ఉద్యోగాల సంఖ్య తగ్గుముఖం పట్టడం.

దేశంలో దాదాపు 15 కోట్ల మంది ఉద్యోగులుండగా అందులో పూర్తికాల ఉద్యోగుల సంఖ్య 7.30 కోట్లు మాత్రమే. మొత్తం జనాభాలో 15-24 ఏళ్ల వయసువారి సంఖ్య ఎక్కువగా ఉన్నందువల్ల, వీరికి ఉపాధి కల్పించడం మీద ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉంటుంది. వీరిలో దాదాపు 23 శాతం మంది నిరుద్యోగంతో
బాధపడుతున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇక అధికార వివరాల ప్రకారం, గత తొమ్మిదేళ్ల కాలంలో దేశ ప్రజల తలసరి ఆదాయం రూ. 86, 647 నుంచి రెట్టింపు అయి, రూ. 1.7 లక్షలకు చేరుకుంది. అయితే, సంపన్నులు, పేదవాళ్ల మధ్య అంతరం పెరుగుతున్న విషయాన్ని, సంపద సరిసమానంగా పంపిణీ కావడం లేదని, కొందరి చేతుల్లో మాత్రమే పేరుకుపోతోందని కూడా అర్థం చేసుకోవాల్సి ఉంది. మధ్యతరగతి వర్గాల జీతభత్యాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. పేదల సంఖ్య
పెరుగుతోంది. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి తర్వాత దేశంలో పేదల సంఖ్య పెరిగిపోయింది. మధ్యతరగతివారిలో లక్షలాది మంది పేదరికంలోకి జారిపోవడం జరిగింది. కేవలం సంపన్నుల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెంది ఉపయోగం లేదు. అది సాధారణ ప్రజల ఆర్థిక వ్యవస్థగా కూడా అభివృద్ధి చెందాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News