Amaravati Farmers: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న అమరావతి ప్రాంత రైతులు, స్థానికులు తమ నిరసనలను మరోసారి దేశరాజధాని ఢిల్లీకి తీసుకెళ్తే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాష్ట్రాల రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు ఢిల్లీలో ఆందోళన దిగనున్నారు. మూడు రాజధానులను అభివృద్ధి చేయాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్ణయించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మరోసారి రైతులు నిరసనలకు దిగుతున్నారు.
అమరావతి రైతులు ఇప్పటికే రిలే దీక్షలు, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర, అమరావతి నుంచి అరసవల్లి వరకు మహాపాదయాత్ర వంటి కార్యక్రమాలతో రాష్ట్ర ప్రజల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఇందులో కొన్ని కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం, అమరావతి రైతుల మధ్య ఘర్షణలకు దారి తీయగా.. మరికొన్నిటిని రాష్ట్రప్రభుత్వం అడ్డుకోగా రైతులు న్యాయస్థానాలకు వెళ్లి అనుమతులు తెచ్చుకొని మరీ కార్యక్రమాలను నిర్వహించారు. ఇక ఇప్పుడు మరోసారి ఈ నెల 17 నుంచి డిసెంబర్ 19 వరకు దేశ రాజధానిలో నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
ఇందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు విజయవాడ నుంచి ప్రత్యేక రైలులో ఢిల్లీ బయల్దేరిన 15 వందల మందికి పైగా రైతులు శుక్రవారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. 17వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద రైతులు నిరసన కార్యక్రమం నిర్వహిస్తారు. 18వ తేదీన ఐకాస నేతలు, రైతులు బృందాలుగా విడిపోయి.. వివిధ పార్టీల అధినేతలు, ఎంపీలను కలిసి ఏపీ ప్రభుత్వ వైఖరిని వివరించనున్నారు. 19వ తేదీన రామ్లీలా మైదానంలో జరిగే భారతీయ కిసాన్ సంఘ్ బహిరంగసభలో రైతులు పాల్గొననున్నారు.