Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్Seela Subhadra Devi: శీలా సుభద్రాదేవి కవిత్వం - స్త్రీ అస్తిత్వ దృక్పథం

Seela Subhadra Devi: శీలా సుభద్రాదేవి కవిత్వం – స్త్రీ అస్తిత్వ దృక్పథం

స్త్రీవాదం అంటే పురుష ద్వేషమే అనుకునే స్థాయిలో తెలుగులో కవిత్వం

సాహిత్య రంగంలో ఇది అస్తిత్వ యుగం. ఆధునిక సాహిత్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ పోకడలు కనిపిస్తూ ఉన్నాయి. విశేషించి తెలుగు సాహిత్యంలోనూ ఈ ప్రభావం కనిపిస్తున్నది. ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చిన తర్వాత ఆధునిక సాహిత్య యుగం ప్రారంభమైంది అని చెప్పవచ్చు. ఈ నేపథ్యం నుంచే వచన కవిత్వంతో పాటు అనేక నూతన ప్రక్రియలు ఆవిర్భవించాయి. కవిత్వం రూపంలోనూ సారంలోనూ విప్లవాత్మక మార్పులకు లోనైంది. భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, దిగంబర కవిత్వం విప్లవ కవిత్వం, అస్తిత్వవాద కవిత్వమనే పాయలుగా కవిత్వ ఉద్యమాలు నిర్మించబడ్డాయి. అస్తిత్వవాద యుగంలో భాగంగా స్త్రీవాదం, దళితవాదం, మైనారిటీ వాదం, బహుజన వాదం, బీసీ వాదం ఇత్యాది సాహిత్య పాయలు తమ సొంత గొంతుకను వినిపించడం ప్రారంభమైంది. తెలుగు సాహిత్యంలో స్త్రీవాదం ఇతమిద్దంగా పూర్తిస్థాయిలో రూపుదాల్చకముందే స్త్రీల సమస్యలపై తమకలాన్ని సంధించిన వారు శీలా సుభద్రాదేవి. సుమారుగా 1975 నుండి నేటి వరకు సామాజిక స్పృహతో ప్రత్యేకించి స్త్రీల సమస్యలపై తనదైన వాణిని వినిపిస్తూ వస్తున్నారు. ఆకలి నృత్యం, మోళీ, తెగిన పేగు, ఆవిష్కారం, ఒప్పులకుప్ప, యుద్ధం ఒక గుండె కోత, ఏకాంత సమూహాలు, బతుకు బాటలో అస్తిత్వరాగం ఇత్యాది కవిత్వ సంపుటాలు వెలువరించిన సుభద్రాదేవి కవిత్వంలో స్త్రీ జీవిత చిత్రణను తెలియపరచడం ఈ వ్యాసం ఉద్దేశం.

- Advertisement -


సమాజంలో స్త్రీల పట్ల జరుగుతున్న అన్యాయాలను ఎత్తిచూపుతూ ధర్మాగ్రహాన్ని ప్రకటిస్తున్నారు ఈ రచయిత్రి.
ప్రేమతో తడిపిన గుడ్డతో
మా గొంతులు కట్టి
మాట పెగలనీయకుండా చేశారు
సంప్రదాయపు తాళ్లతో
మా చైతన్యపు కాళ్లు కట్టేశారు
(సం. ఆకలి నృత్యం – అడ్డుపడొద్దు) అంటూ పురుషాధిక్య సమాజం స్త్రీలను అణచివేస్తున్న వైనాన్ని వివరించారు. నిర్భంధం పెరిగిన చోట తిరుగుబాటు తప్పదు అనే హెచ్చరిక కూడా వీరి కవితల్లో కనిపిస్తుంది. తలుపు పెట్టి కొడితే పిల్లి కూడా తిరగబడుతుంది అనే సామెతను తన కవితలో ఉదహరిస్తూ.. నివురు గప్పిన నిప్పులా ఉన్నామిన్నాళ్లు
ఈ అగ్ని ఇంతలో చల్లారదు
అడ్డుపడితే నిన్ను దహించక మానదు అని హెచ్చరి కను కూడా జారీ చేశారు. స్త్రీ స్వేచ్ఛ, స్వతంత్ర వ్యక్తిత్వానికి గౌరవం ఇవ్వాల్సిన ఆవశ్యకతను వీరి కవిత్వం తెలియ జేస్తుంది.
సూర్యుడి వెలుగుల్ని అద్దుకొని
నవ్వే చంద్రుడిలా కాదు
నేనే ఒక సూర్య గోళమై
స్వయం ప్రకాశంతో జగతి నిండా వెలుగు నింపాలని…. ( సం. ఆకలి నృత్యం – మనసు ముద్రలు) తన ఆకాంక్షను వెలిబుచ్చింది. ఇది స్త్రీ ఆత్మస్థైర్యానికి, ఆత్మ గౌరవానికి నిదర్శనంగా చెప్పవచ్చు.
స్త్రీలపై అత్యాచారాలు అఘాయిత్యాలు నానాటికి పెరుగుతున్నాయే గాని తగ్గుముఖం పట్టడం లేదు. ఈ దుర్మార్గాలని నాలుగు దశాబ్దాల క్రితమే గుర్తించిన ఈ రచయిత్రి
తరతరాలుగా
అధికారం ఉక్కు పాదాల కింద పడి నలిగిపోయి
మానాభిమానాలు కోల్పోయి
బ్రతుకు శిథిలం చేసుకుంటున్న
కన్నెపిల్లల కన్నీటి గాథలు
(సం. ఆకలి నృత్యం – పల్లకి దిగిరా) వినిపిస్తూ వాళ్ల పక్షాన న్యాయానికై నినదిస్తుంది. ఊహల పల్లకి దిగి వాస్తవాలను చూడాలని ఆకాంక్షిస్తుంది. అధికారానికి అహంకారానికి తలవంచుతున్న ఆడపిల్లల పక్షాన నిలబడాలని సమాజాన్ని ఆహ్వానిస్తుంది.
భారతదేశపు ధైన్యాన్ని అభ్యుదయ దృక్పథంతో చిత్రించే మరొక కవితలో దేశమాతను స్త్రీగా చిత్రించింది.
ఆమె ఒంటిమీది పేలికలు
దేశ దుస్థితికి ప్రతీకలు (సం. ఆకలి నృత్యం – దేశ మాత) అనే వాక్యాలు భారతదేశపు సగటు స్త్రీ దీనత్వాన్ని చిత్రిక పడుతున్నాయి.
రంగుల వల అనే మరో కథనాత్మక కవితలో గద్ద లాంటి కీచకుల వలలో కోడి పిల్ల లాంటి కన్నెపిల్లలు చిక్కుకొని బలైపోతున్న తీరును చక్కగా కవిత్వీకరించారు. సాధారణంగా స్త్రీ పురుషుల అక్రమ సంబంధాల విషయంలో ఇరువురూ బాధ్యులే. కానీ సమాజంలో స్త్రీని మాత్రమే నిందితురాలుగా చూడడం గమనిస్తాం. పైగా తప్పు చేసిన పురుషుని నిందించకపోగా మగాడు అని అభినందన పూర్వకమైన మాటలు వింటాం. నిజానికి తప్పు ఒకరి వల్ల కాదు కదా.. ఒక్క చేతితో చప్పట్లు రావు కదా… ఈ సున్నితమైన అంశాన్ని సుభద్రా దేవి తన కవిత్వంలో చక్కగా చెప్పారు.
ప్రేమ మధువు తాగి అవసరం తీరాక
కాళ్లతో తన్ని మరీ పైకెగిరిపోయే తేనెటీగలా
ఆమె శీలాన్ని కడవరకు పీల్చి పిప్పి చేసి
… …. …. …. …. ……..
పతిత అంటూ ఒకరు వేలెత్తి చూపిస్తే
మిగతా మూడు వేళ్ళు నిన్నే
పతితుడని చూపుతున్నాయి చూడు… (సం. ఆకలి నృత్యం – నీ వైపు మూడు వేళ్ళు) అంటూ పురుష ప్రపంచం తమ తప్పును తెలుసుకునేలా ప్రవర్తించాలని ఈ కవిత ద్వారా చాటి చెప్పింది.
సుభద్రాదేవి స్త్రీలపై రాసిన కవిత్వంలో ఎంతో సంయమనాన్ని పాటించారు. స్త్రీవాదం అంటే పురుష ద్వేషమే అనుకునే స్థాయిలో తెలుగులో కవిత్వం వచ్చింది. కానీ సుభద్రా దేవి కవిత్వంలో స్త్రీ సాధికారత, ఆత్మగౌరవం, స్త్రీ హక్కులు, స్త్రీల వేదనలు, స్త్రీ స్వేచ్ఛ ఇత్యాది అంశాలను సూటిగా ఎత్తి చూపింది. కానీ పురుష ద్వేషం ఎక్కడా కనిపించదు. స్త్రీ సమానత్వకాంక్ష మాత్రమే బలంగా వినిపిస్తుంది.

  • సాగర్ల సత్తయ్య
    7989117415
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News