Wife Beats Husband : అనుమానం పెనుభూతం అని అంటారు. అనుమానం కారణంగా కాపురాలు కూలుతున్నాయి. వివాహేతర సంబంధాలు నెరుపుతున్నాడు అనే అనుమానంతో కట్టుకున్న భర్తను నడిరోడ్డుపైనే ఓ భార్య చితక్కొట్టుడు కొట్టింది. బట్టలు చింపుతూ, తిడుతూ పోలీస్ భర్తపై తన ప్రతాపాన్ని మొత్తం చూపింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియోలో ఏం ఉందంటే.. ఓ మహిళ పార్క్‌లో ఓ వ్యక్తిపై దాడి చేయడాన్ని చూడవచ్చు. అందరూ చూస్తుండగా, అతడిని తిడుతూ, బట్టలు చింపేసి మరీ ఇష్టం వచ్చినట్లు కొట్టింది. ఎందుకు కొడుతున్నావు అని గుంపులో ఉన్న ఇంకో వ్యక్తి అడుగగా.. ‘నేను అతడి భార్యను, అతడికి ఇతర మహిళలతో సంబంధాలు ఉన్నాయని’ చెప్పింది.
వీడియోలో ఉన్న వ్యక్తి కానిస్టేబుల్ దుర్గేష్ సోంకర్ అని, మహిళ అతని రెండవ భార్య అని నౌబస్తా పోలీస్ స్టేషన్ అధికారి జావేద్ ఆలం తెలిపారు. మొదటి భార్య ఉన్నప్పటికీ దుర్గేష్ తనను పెళ్లి చేసుకున్నాడని రెండో భార్య ఫిర్యాదు చేయడంతో రెండు నెలల క్రితమే దుర్గేష్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. దుర్గేష్‌కు ఇతర మహిళలతో అక్రమ సంబంధాలున్నాయని రెండో భార్య ఆరోపించింది. వీరిద్దరి వాంగ్మూలాలను నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.