‘జగనన్నకు చెబుదాం – స్పందన’ ఫిర్యాదులను సీరియస్ గా తీసుకొని ప్రజలు సంతృప్తి చెందే స్థాయిలో పూర్తి చేయాలని, నిర్లక్ష్యం చేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వైఎస్సార్ సెంటినరీ హాలులో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ ‘స్పందన’ కార్యక్రమంలో కలెక్టరుతో పాటు డిఆర్వో పుల్లయ్య తదితర జిల్లాధికారులు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ ‘జగనన్నకు చెబుదాం – స్పందన’ కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను వితిన్ ఎస్ఎల్ఎ లో క్లియర్ చేయాలని సంబంధిత నియోజకవర్గాల అధికారులు, మండల అధికారులను ఆదేశించారు. ‘జగనన్నకు చెబుదాం’ ఆడిట్ లో ప్రజల అసంతృప్తి కేసులు, రీఓపెన్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టికి సారించి పరిశీలించాలన్నారు. పెండింగ్ దరఖాస్తులు, బియాండ్ ఎస్ఎల్ఎ లో ఉన్న దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలన్నారు. ‘గడప గడప’కు మన ప్రభుత్వం ద్వారా మంజూరైన పనులు పూర్తి చేయడంతో పాటు ఇంకా ప్రారంభించని పనులు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కొన్ని వినతులు నంద్యాల మండలం మునగాల గ్రామ కాపురస్తుడు వెంకటరెడ్డి 2020-2021 సంవత్సరము ఖరీఫ్ సీజన్ లో వరి పంట వేసి విపరీతమైన వానల వలన పంట నష్టం జరిగిందని… ఇందుకు సంబంధించి పంట భీమా నష్ట పరిహారం విడుదల చేసారని కానీ అందులో మా పేర్లు లేవని దయతో అధికారులతో విచారణ జరిపించి మాకు పంట భీమా నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు సమర్పించుకున్నారు.
డోన్ మండలానికి చెందిన సుభాషిణి మాతల్లి జయమ్మ 1996 సంవత్సరంలో ఎంపిపి స్కూల్ బనవాసి నందు టీచర్ గా పని చేస్తూ అనారోగ్యం కారణంగా మరణించారనీ… మా నాన్నగారు మా అమ్మ యొక్క పెన్షన్ 2016 వరకు తీసుకొనే వాడు కానీ నన్ను పట్టించుకోలేదని… నేను బందువుల సహాయంతో MA.Bed వరకు చదువుకున్నానని నాకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇప్పించి నాకు జీవనోపాధిని కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు సమర్పించుకున్నారు. రుద్రవరం మండలం గుండంపాడు గ్రామ వాస్తవ్యురాలు నాగపుల్లమ్మ భర్త చంద్రహాస్ కు గ్రామంలో సర్వే నంబర్ 175/2 నందు 4.50 విస్తీర్ణం గల పొలము ప్రభుత్వం వారు మాకు ఇచ్చారని…. ఇందుకు సంబంధించి ఆన్లైన్ పాస్ బుక్ కూడా ఉందని… అయితే కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా పంట వేయనీయకుండ మా పొలాన్ని ఆక్రమించుకున్నారని… మాకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు సమర్పించుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో 232 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్ ఎస్ఎల్ఏ లోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి, ఇతర జిల్లాధికారులు పాల్గొన్నారు.