పార్టీ గెలుపులో కార్యకర్తలు ప్రధాన భూమిక పోషిస్తారని వారే గెలుపుకు మూలాధారమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. స్థానిక తిలక్ నగర్ డౌన్ లోని విశ్వం ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన తిలక్ నగర్ పట్టణ బూత్ లెవెల్ ప్రతినిధుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి గులాబీ సైన్యం కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిర్దిష్ట ప్రణాళికతో, కార్యాచరణతో ముందుకు సాగినప్పుడే విజయం తథ్యమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో చేరుతున్నాయని అనడంలో అతిశయోక్తి లేదన్నారు. కాగా రామగుండం నియోజకవర్గంలో 29వేల ఆసరా పెన్షన్లు, 9వేల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, 14వేల మంది రైతులకు రైతుబంధు, 3వందల మందికి రైతు బీమా అందించడం జరిగిందని, అంతేకాకుండా సుమారు 12వందల మందికి దళితబంధు రెండో విడత, 3వేల మందికి గృహలక్ష్మి పథకాలను అందించనున్నట్టు ఆయన తెలిపారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందడంతో ప్రతి ముఖంలో ఆనందం వెల్లివిరిసిందన్నారు. పలు సంస్థలు చేపట్టిన సర్వేల ప్రకారం రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని వెలువడటంతో విపక్ష పార్టీలు మోసపూరిత ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారని అన్నారు. బిఆర్ఎస్ ప్రజాదరణను తట్టుకోలేక, ఓర్వలేని కాంగ్రెస్, బిజెపి పార్టీలు ప్రజలను మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని, వారి నాటకాలను ప్రజలు నమ్మరని ఆయన అన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రాంతం ఎటువంటి అభివృద్ధి, సంక్షేమానికి నోచుకోక బ్రష్టు పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్, బిజెపి పాలనలో దేశం అధోగతి పాలయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో ఏ-పవర్ హౌస్ మూతపడిందని, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి చుక్కనీరు కూడా రైతులకు ఇవ్వలేదని ఆరోపించారు. రామగుండం నియోజకవర్గంలో ఏర్పాటు కావలసిన జేఎన్టీయూ కాలేజ్ మంథనికి తరలిపోయిందన్నారు. ఆనాటి ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంతో రామగుండం నియోజకవర్గంలో ప్రజలకు శాశ్వతంగా అవసరమైన కార్యాలయాలు ఏర్పాటు కాలేదన్నారు. కానీ తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాలుగున్నరేండ్ల కాలంలో రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారితో సమయం వృధా అయిందని, మిగతా రెండున్నర సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో ప్రజల చిరకాల వాంఛ అయిన మెడికల్ కళాశాల, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, కోర్టు సముదాయంతో పాటు కోట్లాది రూపాయలతో ప్రతి గ్రామాన్ని, ప్రతి డివిజన్ ను ఎంతో అభివృద్ధి చేశానన్నారు. ఎన్నికలు వస్తేనే విపక్ష పార్టీల నాయకులకు ప్రజలు గుర్తుకువస్తారని ఎద్దేవా చేశారు. చుట్టం చూపుగా వచ్చే నాయకులతో ప్రజలకు ఏమి ఒరగదని అన్నారు. సీఎం కేసీఆర్ చొరవతోనే సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు సాధ్యమయ్యానన్నారు. మెడికల్ కళాశాల ఏర్పాటుతో నిరుపేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందుతోందని, ప్రతిరోజు సుమారు 2వేల మంది ఆసుపత్రికి వస్తున్నారని అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా అభివృద్ధి, సంక్షేమం ఎవరితో సాధ్యమైందనే విషయం ప్రజలకు తెలుసన్నారు. మోసపూరిత ప్రచారాలను ప్రజలు ఎప్పుడు నమ్మబోరని, ప్రజా సంక్షేమం కోసం పాటుపడే సీఎం కేసీఆర్ కే అండగా నిలుస్తారని అన్నారు. అలాగే రామగుండం నియోజకవర్గంలో ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం తాను ఎల్లవేళలా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో కార్పొరేటర్లు పాముకుంట్ల భాస్కర్, కొమ్ము వేణుగోపాల్, సాగంటి శంకర్, తిలక్ నగర్ పట్టణం ఇన్చార్జి చెలుకలపల్లి శ్రీనివాస్ నాయకులు పిటి స్వామి, తోడేటి శంకర్ గౌడ్, పర్లపల్లి రవి, నారాయణదాసు మారుతి, జేవీ రాజు, అడ్డాల రామస్వామి, మేడి సదానందం, మెరుగు చంద్రమౌళి, శ్రీనివాస్ రెడ్డి, హనీఫ్, రాము, చెలుకలపల్లి సతీష్, యూత్ నాయకులు దొమ్మేటి వాసు, మేకల అబ్బాస్, ఇరుగురాల శ్రావణ్, పిడుగు కుమార్ తదితరులు పాల్గొన్నారు.