ఒక్క అవకాశమివ్వాలంటూ ప్రజలను పదే పదే అభ్యర్థించి అధికారానికి వచ్చిన వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రజలకు తీరని అన్యాయం చేశారని తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు విమర్శించారు. నీటిపారుదల ప్రాజెక్టులను సందర్శించడానికి బయలుదేరిన చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటిస్తూ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయిదేళ్ల కాలంలో 68 వేల కోట్ల రూపాయలను నీటిపారుదల ప్రాజెక్టులపై ఖర్చు చేసిందని తెలిపారు. గత నాలుగేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వై.ఎస్.ఆర్.సి.పి ప్రభుత్వం కేవలం 22,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని ఆయన విమర్శించారు.
ఒక్క రాయలసీమలోనే నీటిపారుదల ప్రాజెక్టుల మీద తమ ప్రభుత్వం 12,400 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని చెబుతూ ఆయన, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చుపెట్టి చేతులు దులిపేసుకుందని అన్నారు. రాయలసీమ సాగు నీటి ప్రాజెక్టుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించడం జరిగిందో జగన్ జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘ఈ నాలుగేళ్ల కాలంలో 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసిన జగన్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ విధంగా ప్రజాధనం వృథా చేసినందుకు ఆయన రాష్ట్ర ప్రజలకు, రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’’ అని చంద్రబాబు
వ్యాఖ్యానించారు.
ఆయన నందికొట్కూరులో ఒక రోడ్డు ప్రదర్శనలో మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వ ప్రతికూల, విధ్వంసకర విధానాల వల్ల సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమంతా తలకిందులైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా నీటిపారుదల ప్రాజెక్టులను నాశనం చేయడంపై తాము యుద్ధం ప్రకటించామని అంటూ ఆయన,
నీటిపారుదల ప్రాజెక్టులను ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంపై ప్రజల్లో అవగాహన పెంచడానికి తాము పది రోజుల పర్యటన చేపట్టినట్టు తెలిపారు. కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు నుంచి శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం వరకు సుమారు 2,500 కిలోమీటర్ల వ్యాప్తంగా తమ యుద్ధ భేరి కొనసాగుతుందని కూడా ఆయన వివరించారు.
ఒకే ఒక్క అవకాశం ఇవ్వండంటూ ప్రజలను ప్రాధేయపడి అధికారానికి వచ్చిన జగన్ ప్రభుత్వానికి ప్రజలను ప్రభుత్వం దారుణంగా వంచించిందని, ఫలితంగా ప్రజలు ఇక ఒక్క అవకాశం కూడా జగన్ ప్రభుత్వానికి ఇవ్వరని చంద్రబాబు అన్నారు. మొదటి రోజు యాత్రలో చంద్రబాబు ముచ్చుమర్రి, బనకచర్ల సాగునీటి ప్రాజెక్టులను సందర్శించారు. తాము అధికారానికి వచ్చినప్పుడు రాయలసీమ
సాగునీటి, తాగునీటి అవసరాలను తీర్చడంపై ప్రత్యేక శ్రద్ధ పెడతామని ఆయన హామీ ఇచ్చారు.