టీడీపీ చేపట్టిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి మాచర్లలో చేపట్టిన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారుతీసింది. మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ వార్డులో ఇదేం కర్మ కార్యక్రమం చేపట్టారు జూలకంటి బ్రహ్మారెడ్డి. వార్డులో ఇంటింటికి తిరుగుతున్న సమయంలో టీడీపీ శ్రేణులపై రాళ్లు, కర్రలతో వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఆ దాడిలో టీడీపీ నేతలు కూడా ప్రతిఘటించడంతో పరిస్థితి ఉద్రిక్తమయింది.
ఫలితంగా ఈ దాడుల్లో ఇటు టీడీపీ, అటు వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఆ తర్వాత.. టీడీపీ కార్యాలయానికి వైసీపీ కార్యకర్తలు నిప్పుపెట్టడంతో.. మాచర్లలో హింస చెలరేగింది. దీంతో మాచర్లలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. మాచర్లలో జరిగిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఛలో మాచర్లకు పిలుపినిచ్చారు. చంద్రబాబు పిలుపుతో పరిస్థితి మరింత ఉద్రిక్తమయింది. టీడీపీ నేతలు మాచర్లకు రావొద్దని పోలీసులు హెచ్చరించారు. టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడిక్కడ హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు. ఆయా టీడీపీ నేతలు బయటికి వెళ్లకుండా వారిఇళ్లవద్ద గస్తీ కాస్తున్నారు. ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనందబాబు, జీవీ ఆంజనేయులు, కోడెల శివరామ్ లను హౌస్ అరెస్ట్ చేశారు. మాచర్ల వస్తే.. వచ్చినవారిని వచ్చినట్టుగా అరెస్ట్ చేస్తామని హెచ్చరికలు జారీచేశారు.