మాచర్ల నియోజకవర్గంలో నిన్నటి నుండి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ చేపట్టిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమాన్నిటీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి మాచర్లలో నిర్వహించిన క్రమంలో.. దానిని వైసీపీ నేతలు అడ్డుకున్నారు. రాళ్లు, కర్రలతో దాడి చేయగా.. టీడీపీ నేతలు సైతం తీవ్రంగా ప్రతిఘటించారు. ఇరు పార్టీల నేతలను గాయాలు కాగా.. మాచర్లలో పరిస్థితి అదుపుతప్పింది. టీడీపీ నేత ఇళ్లపై దాడులు, పార్టీ కార్యాలయానికి నిప్పుపెట్టడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది. పోలీసులు రంగంలోకి దిగి మాచర్లలో 144 సెక్షన్ విధించారు.
కాగా.. ప్రస్తుతం మాచర్లలో పరిస్థితి అదుపులో ఉందని పల్నాడు ఎస్పీ తెలిపారు. ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్ నుండి వచ్చిన వారు ఈ అల్లర్లకు ప్రధాన కారణమని, వారిలో కొందరిని గుర్తించామన్నారు. మరికొందరి పేర్లు తెలియాల్సి ఉందని, వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. కొందరు వ్యక్తులు రెండు పొలిటికల్ పార్టీలను వాడుకుని ఈ అల్లర్లను సృష్టించారన్నారు. మాచర్లలో కొద్దిరోజుల పాటు 144 సెక్షన్ ఉంటుందని, బయటి వ్యక్తులెవరు మాచర్లలోకి రావొద్దని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా వస్తే వారిని అరెస్ట్ చేస్తామన్నారు.