మెరిసే చర్మం మీ సొంతం కావాలంటే ఒత్తిడికి తావు లేని స్థిమిత చిత్తాన్ని అలవరుచుకోవాలంటారు ఆయుర్వేద నిపుణులు. అంతేకాదు శరీరారోగ్యాన్ని పదిలంగా సంరక్షించుకోవాలని చెప్తారు. అలాగే
ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలంటారు. ఇవి కాక జీవనశైలికి సంబంధించి మరెన్నో టిప్స్ ను కూడా వారు సూచిస్తున్నారు. తొందరగా పడుకుని తొందరగా లేవడం ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తున్నారు. ఈ అలవాటు శరీర అందాన్ని ఇనుమడింప చేస్తుందంటున్నారు. ఆలస్యంగా పడుకోవడం వల్ల సరైన నిద్ర లేక శరీరంలోని కణాలు క్షీణించి యాక్నే, డెర్మిటైటిస్ వంటి పలు చర్మ సమస్యలు తలెత్తుతాయంటున్నారు. చర్మంలోని హైడ్రేషన్ వ్యవస్థ కూడా దెబ్బతింటుందంటున్నారు. దీంతో చర్మం పొడిబారడంతో పాటు తొందరగా వయసు మీద పడ్డట్టు కనిపిస్తామట. అందుకే నిత్యం నిద్రవేళలను క్రమం తప్పకుండా పాటించాలని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.
ఆహారాన్ని కూడా మందులాగ ఆచితూచి తీసుకోవాలి తప్ప ఇష్టం వచ్చిన కాంబినేషన్లతో తినొద్దంటున్నారు. అలా తింటే ఆహారం శరీరంలో విషతుల్యంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కొందరు అన్నంలో పెరుగుతో పండ్లను తింటారు. అలా తినొద్దంటున్నారు. అలాగే పాలు, పళ్లు కలిపి తీసుకోకూడదంటున్నరు. ఎందుకంటే పండ్లు తొందరగా జీర్ణం అవుతాయి. కానీ పాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే తప్పు కాంబినేషన్ తో పండు, పాలు తీసుకోవడం వల్ల ఎసిడిటీ తలెత్తే అవకాశం ఉంది. ఆహారంలో మీట్ లేదా చేపలు ఉంటే పాల ఉత్పత్తులను తినకూడదు. చేప శరీరానికి వేడి చేస్తే, పాలకి శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది. అలాంటి విభిన్న లక్షణాలు ఉన్న ఆహారపదార్థాలను కలిపి తినడం వల్ల శరీరంలోని ముఖ్య భాగాలలో అడ్డుగా నిలిచిపోయే అవకాశం ఉంది. అందుకే అలాంటి ఆహారపు అలవాట్లను మానుకోవాలని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నరు. అలాగే అన్నం తిన్నతర్వాత చల్లటి పానియాలు తాగొద్దంటున్నారు. జీర్ణక్రియకు తోడ్పడే ఆమ్లాలను ఇవి నొక్కిపెడతాయిట. దీంతో పొట్టకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయిట. అన్నం తిన్నతర్వాత ఐస్ క్రీమ్, చల్లటి పెరుగులాంటివి తిన్నా కూడా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. తేనె,
నెయ్యి కలిపి తింటే జీర్ణక్రియ చేసే ఆమ్లాలపై అవి దుష్ప్రభావం చూపుతాయి. దీంతో విషపదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. దాంతో రుమాటిక్, న్యూరలాజికల్, చర్మ సంబంధ సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
టీ తాగితే చర్మానికి చాలా మంచిదంటున్నారు. టీ వల్ల శరీరానికి కావలసిన హైడ్రేషన్ అందుతుంది. హెర్బల్ టీ తాగితే మరీ మంచిది. ముఖ్యంగా చమోమైల్, అల్లం, నిమ్మ వంటి వాటితో చేసిన టీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. మధ్యాహ్నం పూట టీని తాగితే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుందని చెప్తున్నారు. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ ఉన్న వారికి చర్మం కూడా ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఎంతో కాంతివంతంగా మెరుస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. బాగా నీళ్లు ఉన్న కూరగాయలను తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదంటున్నారు. ఇవి తొందరగా జీర్ణం అవుతాయంటున్నారు. క్యారెట్, ముల్లంగి, పాలకూర, తోటకూర, మెంతి, కీర వంటివి అన్నిరకాల చర్మాలను ఆరోగ్యంగా ఉంచే ఆహారపదార్థాలని వైద్యులు చెప్తున్నారు. వీటిని శరీరాన్ని పరిశుభ్రంచేసే ప్యూరిఫైయర్స్ గా వైద్యులు పేర్కొంటారు. రెండు మూడు రకాల కూరగాయలు కలిపి వండుకోవడం వల్ల చర్మం ఎంతో ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు. అలాగే నిత్యం వ్యాయామాలు చేయాలని చెప్తున్నారు. వ్యామాలు గుండెను, ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మాన్ని మెరిపిస్తాయంటున్నారు. వ్యాయామాల వల్ల రక్తప్రసరణ బాగా జరిగి చర్మం జీవక్రియ క్రమపద్ధతిలో సాగుతుంది. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా ఉండి ఎంతో యంగ్ గా కనిపిస్తారని ఆయుర్వేదనిపుణులు అంటున్నారు. చర్మం ఎంతో మెరుపును కూడా సంతరించుకుంటుందంటున్నారు.
మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడుల ప్రభావం చర్మ ఆరోగ్యంపై తీవ్రంగా పడుతుందని చెప్తున్నరు. దీనికి శ్వాసపరమైన వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు. వీటివల్ల ఒత్తిడి పోవడమే కాకుండా మైండ్
ప్రశాంతంగా ఉంటుందని, నిద్ర కూడా బాగా పడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ప్రాణాయామం వంటివాటిని చేయాలని సూచిస్తున్నారు. నిద్రపోయే ముందు కానీ, రోజులో ఏదో ఒక వేళలో ఐదు నుంచి 20 నిమిషాల పాటు నిత్యం బ్రీదింగ్ వ్యాయామాలు చేయమని సలహా ఇస్తున్నారు. అలాగే నిత్యం ధ్యానం చేయడం వల్ల చర్మం అందంగా, ఆరోగ్యంగా తయారవడమే కాకుండా కాంతివంతం అవుతుందని చెప్తున్నారు. మెదడు ప్రశాంతచిత్తం పొందడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెప్తున్నరు. దీంతో శరీరంలో కొత్త శక్తి వస్తుందంటున్నారు. ఒత్తిడి తగ్గి చర్మం ఆరోగ్యంగా తయారవుతుందంటున్నారు.
చర్మాన్ని ఎప్పుడూ మాయిశ్చరైజ్ చేసుకుంటుండాలంటున్నారు. ఇందుకోసం నీళ్లు బాగా తాగడంతో
పాటు ఆయిల్ మసాజులు కూడా చర్మానికి చేసుకోవాలిట. హెర్బల్ ఆయిల్స్ తో చర్మాన్ని మసాజ్ చేసుకోవడం వల్ల కండరాలు రిలాక్స్ అయి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో చర్మం పొడిబారదు. డైట్ లో నిత్యం గింజలు, నట్స్ ఉండేలా చూసుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కారణం వీటిల్లో ఆరోగ్యకరమైన ఫ్యాట్లు ఉంటాయి. ఇవి కార్డియోవాస్క్యులర్ వ్యవస్థకు కూడా ఎంతో మంచివి. వీటిల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, పీచు కూడా పుష్కలంగా ఉంటాయి. అందుకే సన్ ఫ్లవర్ విత్తనాలు, బాదం గింజలు, పిస్తాపప్పులు నిత్యం తింటే చర్మం
కాంతివంతంగా తయారవుతుంది. జీవనశైలిలో పాటించాల్సిన మరో ముఖ్య అంశం ఉప్పు, చక్కెర వాడకాన్ని బాగా తగ్గించడం. ఉప్పు బాగా తింటే రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. గుండెజబ్బులు కూడా
వస్తాయి. చక్కెర, ఉప్పు చర్మ ఆరోగ్యాన్ని సైతం దెబ్బతీస్తాయి. చర్మంపై యాక్నే, రకరకాల అలర్జీలు తలెత్తుతాయి. ఆయుర్వేద వైద్యులు చెపుతున్న మరో ముఖ్య విషయం సూర్యరశ్మి నుంచి చర్మాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. లేనిపక్షంలో అతినీలలోహిత కిరణాల ప్రభావంతో చర్మంపై టానింగ్, సన్ బర్న్స్, హైపిగ్మెంటేషన్, ముడతలు వంటి సమస్యలు ఎధురవుతాయి. అందుకే బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా చర్మానికి సన్ స్ర్కీన్ రాసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
గొడుగు, స్కార్ఫ్ లేదా హ్యాట్ వాడాలంటున్నారు.
చర్మాన్ని మెరిపించే ఆయుర్వేద ఫేస్ మాస్కులు కమలాపండు తొక్కలను అప్లై చేయడం వల్ల చర్మం శుభ్రంగా ఉండడమే కాకుండా మెరుస్తుంటుందన్నారు. జిడ్డు చర్మం వారికి ఈ ఆయుర్వేద ఫ్యాస్ ప్యాక్ వాడితే మంచి ఫలితం కనిపిస్తుందని చెప్తునారు. యాక్నేను కూడా కమలాపండు తొక్క నివారిస్తుంది.
కమలాపండు తొక్కలను బాగా ఎండబెట్టి పొడి చేసి దాన్ని చర్మానికి రాసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ కమలాపండు తొక్కల పొడి, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కలిపి పేస్టులా చేసి ముఖానికి రాసుకుని 20
నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి. అలాగే శాండల్ వుడ్, పసుపు మిశ్రమం యాక్నేని నివారిస్తుంది. పిగ్మెంటేషన్ పోవాలంటే బంగాళాదుంపపే తురిమి దాన్ని రసాన్ని దెబ్బతిన్న చర్మంపై పిండి మెల్లగా కాటన్ తో రాయాలి. రాత్రంతా దాన్ని అలాగే ఉంచుకుని మర్నాడు ఉదయం నీళ్లతో కడుక్కోవాలి. చర్మం ముడతలను పోగొట్టే సుగుణాలు మెంతుల్లో ఉన్నాయి. ఒక టేబుల్ స్పూన్ మెంతి గింజలు తీసుకుని నానబెట్టి పేస్టులా చేయాలి. మెంతి గింజలకు బదులు మెంతి ఆకులను కూడా వాడొచ్చు. ఏవైనాసరే పేస్టులా చేసి ముఖం మీద అప్లై చేసి అరగంట నుంచి గంటపాటు ముఖంపై అలాగే ఉంచి ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో కడుక్కోవాలి.
ఆవునెయ్యి చర్మానికి రాయడం వల్ల యంగ్ గా కనిపిస్తారని వైద్యులు చెపుతున్నారు. అర టీస్పూను స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో కొద్ది చుక్కల నీళ్లు కలిపి పేస్టులా చేసి ముఖానికి పదినిమిషాల పాటు గుండ్రంగా మసాజ్ చేస్తూ రాయాలి. తర్వాత గంట సేపు అలాగే ఉంచి (రాత్రి అంతా కూడా ఉంచుకోవచ్చు) తేలికపాటి క్లీన్సర్ తో శుభ్రంగా కడుక్కోవాలి. తులసి ఆకులను పేస్టు చేసి అందులో పచ్చిపాలు పోసి కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాలు అలాగే ఉంచుకొని తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. చర్మం వెంటనే మెరుపును సంతరించుకుంటుంది. శాండల్ వుడ్, పెరుగు మిశ్రమం చర్మాన్ని క్లీన్ చేయడమే కాకుండా తేమను కూడా చర్మానికి అందిస్తుంది. అలాగే కుమపువ్వు,
అలొవిరా జల్ మిశ్రమం ముఖానికి రాసుకుంటే చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది.
ఒక టీస్పూను పాలు, ఒక టీస్పూను అలొవిరా జెల్, చిటికెడు కుంకుమపువ్వు వేసి పేస్టులా చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని గంటపాటు అలాగే ఉంచుకుని ఆ తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ముందర రోజు రాత్రే పాలల్లో కుంకుమపువ్వును వేసి రాత్రంతా నానబెట్టి మర్నాడు ఉధయం దాంట్లో అలొవిరా జెల్ వేసి పేస్టులా చేయాలి. ఈ పేస్టును రాత్రంతా ముఖానికి ఉంచుకుంటే మరింత మంచి ఫలితం వస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల శెనగపిండిలో అర టీస్పూన్ నిమ్మరసం, ఒక టీస్పూను పాలు లేదా పెరుగు వేసి కలపి పేస్టులా చేసి మచ్చలు ఉన్నచోట రాసి పొడారిపోయేదాకా అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చటినీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే ముఖం మీద ఉండే నల్లమచ్చలు పోతాయి.