Big Bash league : 0,0,3,0,2,1,1,0,0,4,1 ఇదేదో ఫోర్ నెంబరో మరేటో కాదు. టీ20 మ్యాచ్‌లో 11 మంది ఆటగాళ్లు చేసిన స్కోర్లు. డెస్సింగ్ రూమ్‌లో ఏదో పని ఉన్నట్లు వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్లే ఔటై వెళ్లిపోయారు. క్రీజులో కాసేపు ఉందామని ఏ ఒక్క బ్యాటర్ కూడా ప్రయత్నించలేదు. కనీసం 6 ఓవర్లు కూడా పూర్తిగా ఆడలేదు. ఫలితంగా ఆ జట్టు 15 పరుగులకే కుప్పకూలింది. టీ20ల్లోనే అత్యత్ప స్కోరు నమోదైంది.
ఇదేదో గల్లీ క్రికెట్‌లో జరిగిందనుకుంటే పొరబాటే. ప్రతిష్టాత్మక బిగ్ బాష్ లీగ్‌లో ఈ చెత్త రికార్డు నమోదైంది. ఈ స్కోర్ చేసింది ఏదో అనామక జట్టు కాదు సిడ్నీ థండర్. అలెక్స్ హేల్స్, రిలీ రొసో, మాథ్యూ గిల్క్స్ వంటి హిట్టర్లతో నిండిన ఆ జట్టు ఈ స్కోర్ చేస్తుందని కనీసం కలలో కూడా ఎవ్వరూ ఊహించి ఉండరు.
శుక్రవారం అడిలైడ్ స్ట్రైకర్స్, సిడ్నీ థండర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన అడిలైడ్ బ్యాటింగ్ ఎంచుకుంది. క్రిస్ లిన్ (36), కాలిన్ డి గ్రాండ్‌హోం (33) లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 139 పరుగులు చేసింది. అనంతరం 140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ జట్టు 5.5 ఓవర్లలో 15 పరుగులకే కుప్పకూలింది. ఇందులో 3 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో రావడం గమనార్హం. అడిలైడ్ పేసర్ హెన్నీ థార్టన్ 3 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టి సిడ్నీ పతనంలో కీలక పాత్ర పోషించాడు. బిగ్ బాష్ లీగ్ సీనియర్ డివిజన్‌లో ఇంత తక్కువ స్కోరుకు ఒక జట్టు ఆలౌట్ అవడం ఇదే తొలిసారి.
ఇక సోషల్ మీడియా వేదికగా సీడ్ని ఆట తీరుపై అభిమానులు మండిపడుతున్నారు. మరీ ఇంత చెత్తగానా ఆడేది అంటూ కామెంట్లు పెడుతున్నారు.