Rohith Reddy : భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ(బీజేపీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ల మధ్య ఆరోపణలు, సవాళ్లతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. బెంగళూరు డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చెప్పారు. తనపై చేసిన ఆరోపణలకు రుజువులు చూపాలంటూ బండి సంజయ్ కు సవాల్ విసిరారు.
శనివారం భాగలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడారు. అమ్మవారిపై ప్రమాణం చేసి చెబుతున్నా.. బెంగళూరు డ్రగ్స్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. బండి సంజయ్‌కు 24 గంటలు సమయం ఇస్తున్నా. నాపై చేసిన ఆరోపణలకు రుజువులు చూపాలి. రేపు(ఆదివారం) ఇదే సమయానికి ఇక్కడికి వస్తా. బండి సంజయ్ కూడా ఇక్కడకు వచ్చి ఆధారాలు చూపాలన్నారు.
ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) తనకు నోటీసులు ఇస్తుందన్న విషయం ముందు బండి సంజయ్‌కు ఎలా తెలిసిందని ప్రశ్నించారు. డ్రగ్స్ కేసు ఎఫ్ఐఆర్‌లో తన పేరు ఎక్కడా లేదని, కర్ణాటక పోలీసుల నుంచి కూడా తనకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు.
కాగా.. రోహిత్ రెడ్డి చేసిన సవాల్‌పై బండి సంజయ్ స్పందించారు. రోహిత్ రెడ్డి సవాల్‌ను అసలు తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. ఎవరు పడితే వారు సవాల్ విసిరితే తాను స్పందించనని చెప్పారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రోహిత్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అంతకముందు బండి సంజయ్ స్పందిస్తూ బెంగళూరు డ్రగ్స్ కేసును మళ్లీ ఓపెన్ చేస్తే రోహిత్ రెడ్డి పాత్ర బయటకు వస్తుందన్నారు. ఈ కేసులో కర్ణాటక ప్రభుత్వం నుంచి రోహిత్ రెడ్డికి నోటీసు కూడా వచ్చిందని చెప్పారు. దీనిపైనే రోహిత్ రెడ్డి బండికి సవాల్ విసిరారు.