రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు దీర్ఘకాలం విధులకు హాజరు కాకుండా ఉండడం ఎంతమాత్రం సమర్ధనీయం కాదని అలాంటి డాక్టర్లపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అన్నారు. వైద్య ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ కార్యక్రమాలపై వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించారు. ఈసమావేశంలో వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించి అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను విస్తృతంగా సమీక్షించారు. రాష్ట్రంలో ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇచ్చి వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలన్నీ భర్తీ చేయడంతో పాటు కోట్లాది రూపాయలను ఖర్చు చేసి వైద్యపరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామన్నారు. వైద్య ఆరోగ్యశాఖకు ప్రభుత్వం ఇంతటి ప్రాధాన్యతను ఇస్తున్న తరుణంలో ప్రభుత్వ వైద్యులు ధీర్ఘకాలం సెలవులో ఉండడం లేదా అనధికారికంగా విధులకు గైర్హాజరు కావడం వంటివి ఎంతమాత్రం సమర్ధనీయం కాదని అలాంటి వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ స్పష్టం చేశారు. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్పందించి ఇప్పటికే అలాంటి డాక్టర్లకు గుర్తించి నోటీసులు జారీ చేశామని వారి వివరణలు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అనంతరం రాష్ట్రంలో మంజూరై నిర్మాణంలో ఉన్నవిజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలల నిర్మాణాల ప్రగతిని సిఎస్ జవహర్ రెడ్డి అధికారులతో సమీక్షిస్తూ వాటి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఆసుపత్రి ప్రసవాలను ప్రోత్సహించేందుకు పిహెచ్సి, సిహెచ్సి తదితర ఆసుపత్రుల వారీగాను ఎఎన్ఎం, ఆశా వర్కర్ తదితర సిబ్బందికి ప్రత్యేక లక్ష్యాలను నిర్దేశించాలని జవహర్ రెడ్డి ఆదేశించారు. ఎంసిహెచ్ టీంను పూర్తిగా దీనిలో భాగస్వామ్యం చేసి నూరు శాతం ఆసుపత్రి ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులకు కీ ఫెర్మార్మెన్స్ ఇండికేటర్లను సిఎస్ సమీక్షిస్తూ నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా ప్రజలకు తగిన వైద్య సేవలు అందేలా చూడాలని చెప్పారు.
ఆరోగ్యశ్రీ ప్రధకంపై సమీక్షిస్తూ ఆరోగ్యశ్రీ పధకం కింద ఎంపానల్ అయిన ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ రోగులకు అందుతున్న వైద్య సేవలపై క్వాలిటీ చెక్ చేయాలని సిఎస్ జవహర్ రెడ్డి వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల ఆరోగ్య పధకానికి సంబంధించి ఉద్యోగులు నెలనెలా చెల్లించే మొత్తానికి సమానంగా ప్రభుత్వ వాటా సొమ్మును కూడా ప్రతినెలా సకాలంలో ఆరోగ్య శ్రీ ట్రస్టుకు జమ అయ్యేవిధంగా చూడాలని ఆర్ధికశాఖ కార్యదర్శి గుల్జార్ ను సిఎస్ ఆదేశించారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై సిఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ నూతన వైద్య కళాశాలల నిర్మాణ పనులు వేగవతంగా జరుగుతున్నాయని తెలిపారు. దీర్ఘకాలం పాటు విధులకు హాజరు కాని ప్రభుత్వ డాక్టర్లను గుర్తించి ఇప్పటికే నోటీసులు జారీ చేశామని తదుపరి చర్యలు తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వివరించారు. రాష్ట్రంలో మాతా శిశు మరణాల సంఖ్యను కనిష్ట స్థాయికి తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇంకా వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి పలు కార్యక్రమాలపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు మాట్లాడారు.
ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్, ఆరోగ్య శ్రీ సిఇఓ ఎంఎన్. హరీంద్ర ప్రసాద్, ఎపి ఎంఎస్ఐడిసి విసి అండ్ యండి డి.మురళీధర్ రెడ్డి, ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి డా.మంజుల, ఎపివివిపి కమీషనర్ డా.ఎస్.వెంకటేశ్వర్, డిఎంఇ డా. నర్సింహం, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రామిరెడ్డి, వీడియో లింక్ ద్వారా హెచ్ఓడి డా.దేవి మాధవి తదితరులు పాల్గొన్నారు.