విద్యావ్యవస్థలో ఏపీ ప్రభుత్వం కొత్తకొత్త సంస్కరణలు చేపడుతోంది. గతంలో లేని విధంగా వైసీపీ హయాంలో ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టింది. విద్యార్థుల చదువుకయ్యే ఖర్చును.. జగనన్న విద్యా దీవెన పేరుతో ప్రతి ఏటా తల్లుల ఖాతాల్లో వేస్తోంది. ఇక తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. కళాశాలల వరకే పరిమితమైన సెమిస్టర్ విధానాన్ని ఇకపై పాఠశాలల్లోనూ అమలు చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. దీనిపై ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది.
2023-24 విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ బడుల్లో సెమిస్టర్ విధానాన్ని అమలు చేయాలని పేర్కొంటూ.. సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. 1-9 తరగతుల వరకూ ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. 2024-25 విద్యాసంవత్సరం నుంచి 10వ తరగతిలోనూ సెమిస్టర్ విధానం ప్రవేశపెడతామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సెమిస్టర్ విధానానికి అనుగుణంగానే పాఠ్యపుస్తకాలను, పాఠ్యాంశాలను రూపొందించనున్నారు.