Leopard : ఎట్టకేలకు చిరుత చిక్కింది. హెటిరో ల్యాబ్స్‌లోకి ప్రవేశించిన చిరుతకు మత్తు మందు ఇచ్చి బోనులో బంధించారు. దాదాపు 11 గంటల పాటు ఈ ఆపరేషన్ సాగింది.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని హెటిరో ల్యాబ్స్‌లోకి శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఓ చిరుత ప్రవేశించింది. హెచ్ బ్లాక్‌లో చిరుత రాకను గమనించిన ల్యాబ్ సిబ్బంది వెంటనే బయటకు వచ్చి గదికి తాళం వేశారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
ఫారెస్ట్ అధికారులు అక్కడకు చేరుకుని చిరుత కోసం గాలింపు చేపట్టారు. హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్‌కు చెందిన ప్రత్యే బృందం కూడా అక్కడకు చేరుకుంది. చిరుతకు మత్తు మందు ఇచ్చారు. చిరుత స్పృహ తప్పగానే పట్టుకుని బోనులో బంధించారు. అనంతరం దాన్ని నెహ్రూ జూ పార్కుకు తరలించారు.
ఇదిలా ఉంటే.. చిరుతపులి పరిశ్రమలోకి రావడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పరిశ్రమలో చిరుత సంచరించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో విస్తరించి ఉన్న నర్సాపూర్ అటవీ ప్రాంతం నుంచి చిరుతల సంచారం నిత్యకృత్యంగా మారింది.