IND vs BAN 1st Test : తొలి టెస్టులో బంగ్లాదేశ్‌కు టీమ్ఇండియా 512 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన బంగ్లాకు ఆ జట్టు ఓపెనర్లు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ తీసేందుకు భారత బౌలర్లు కష్టపడుతున్నా ఫలితం దక్కడం లేదు. బంగ్లా స్కోర్ 124 కి చేరింది. టీమ్ఇండియా వెనుకంజలో ఉన్న అలాంటి సమయంలో బ్యాడ్ ఎడ్జ్‌ను తీసుకున్న బంతి ఫస్ట్ స్లిప్‌లో ఉన్న విరాట్ వైపు వచ్చింది. కోహ్లీ చేతుల్లో పడిన బంతి బౌన్స్ పక్కకు వెలుతుండగా పంత్ డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఓవర్‌నైట్ స్కోరు 42/0తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన బంగ్లాదేశ్ తన ప్రణాళికలను సరిగ్గా అమలు చేసింది. ఆ జట్టు ఓపెనర్ జకీర్ హసన్, నజ్ముల్ హోస్సేన్ షాంటె ఇద్దరూ అర్థశతకాలను పూర్తి చేసుకున్నారు. అప్పటికే శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వడం లేదు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. బంగ్లాను త్వరగా ఆలౌట్ చేయాలన్న భారత వ్యూహం దెబ్బతిన్నట్లుగా కనిపించింది. వన్డేల్లోలాగా టెస్టుల్లో కూడా ఏమైనా సంచలనం నమోదు అవుతుందేమోననే అనుమానం మొదలైన సమయం అది.
ఆ సమయంలో ఉమేష్ యాదవ్ బంతిని అందుకున్నాడు. ఆఫ్ స్టంప్ ఆవలగా వేసిన బంతిని బ్యాటర్ షాంటో షాట్ ఆడేందుకు ప్రయత్నించగా బంతి ఎడ్జ్ తీసుకుంది. ఫస్ట్ స్లిప్‌లో ఉన్న కోహ్లీ వైపుకు వెళ్లింది. విరాట్ చేతుల్లో పడ్డ బంతి ఎగిరి పక్కకు వెళ్లింది. అప్రమత్తంగా ఉన్న వికెట్ కీపర్ పంత్.. కోహ్లీ చేతుల్లో బంతి పక్కకు వెళ్లగానే డైవ్ చేసి బంతిని అందుకున్నాడు. దీంతో బంగ్లా తొలి వికెట్‌ను కోల్పోయింది. 124 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ఆ తరువాత వచ్చిన బ్యాటర్లు కుదురుకోకపోవడంతో మ్యాచ్‌పై భారత్‌కు గట్టి పట్టులభించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లా ఆరు వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. ఆఖరి రోజు భారత్ మరో నాలుగు వికెట్లు తీస్తే తొలి టెస్టులో విజయం సాధిస్తుంది.